ప్రాజెక్టు బావులను ఆనుకొని తవ్వకాలు చేపడుతుండటంతో ఎడారిగా మారిన చంపావతి నది
సాక్షి, పూసపాటిరేగ(నెల్లిమర్ల) : అక్కడ వాల్టాచట్టానికి తూట్లు పొడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వేలాది కుటుంబాలకు తాగునీటి సమస్య తీర్చే బావులకు ముప్పు ఏర్పడుతున్నా... అక్రమార్కులు వెరవడం లేదు. ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తూ కాసులు కూడబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఉచితం మాటున సాగుతున్న ఈ దందాకు చంపావతి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. పూసపాటిరేగ మండలంలోని చంపావతి ప్రాజెక్టును ఆనుకొని అక్రమ ఇసుక తవ్వకాలు చేయడంతో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి వుంది.
ఊటబావులకు నీరందకపోవడమే గాకుండా నీటిసామర్థ్యం తగ్గి మోటార్లు మొరాయిస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి పూసపాటిరేగ మండలంలో 32 గ్రామాలు, డెంకాడ మండలంలో 10 గ్రామాలకు తాగునీరు అందుతోంది. కొంత కాలంగా అక్రమ ఇసుకతవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రాజెక్టును ఆనుకొని ఇసుక తవ్వకాలు జరపడంతో భూగర్భజలాలు అడుగంటితున్నాయి. పూసపాటిరేగ మండలానికి ఇదే ప్రధాన నీటి వనరు. అదే ఇప్పుడు సరిగ్గా పనిచేయకపోవడంతో పల్లెప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు.
2010లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిధులు సుమారు రూ. 12 కోట్లతో అప్పట్లో ప్రాజెక్టు పనులు చేశారు. పనులు పూర్తి చేసిన తరువాత కొన్నాళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరే దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. తాజాగా ఆ నిర్వహణ బాధ్యతను అధికారపార్టీ నాయకులకు అప్పగించడంతో వారు సక్రమంగా చేయడం లేదనే విమర్శలు వెలువడుతున్నాయి. ప్రాజెక్టు పైపులైన్ నాసిరకంగా వుండటంతో ఎప్పటికప్పుడు లీకులు ఏర్పడి నీరు వృథా అవుతోంది. దీనికి తోడు ప్రాజెక్టు సమీపంలో అక్రమతవ్వకాలను నిలుపుదల చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
పైప్‌లైన్ ఉన్నచోటే తవ్వకాలు
ప్రాజెక్టు పైపులైన్ వున్నచోటనే తవ్వకాలు జరపడంతో పైపులైన్ బయటకు తేలిపోయింది. ఇవి తరచూ పగలిపోతుండటంతో నిత్యం మరమ్మతులు చేయాల్సి వస్తోంది. అధికారులు దీనిని పట్టించువడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూసపాటిరేగతో పాటు సీహెచ్.అగ్రహారం, కనిమెట్ట, అల్లాడపాలెం, కనిమెల్ల, కామవరం, పతివాడ, చినపతివాడ, గోవిందపురంతో పాటు పలు గ్రామాలకు ప్రాజెక్టు నీరుసరఫరా అవుతోంది.
పూసపాటిరేగ మండలంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా వుండటంవల్ల ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగా మళ్లీ సమస్య ఉత్పన్నం అవుతోంది. అధికారులు స్పందించి ప్రాజెక్టుకు ఆనుకొని ఇసుక తవ్వకాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రవీణ్ శంకర్ వద్ద ప్రస్తావించగా తవ్వకాలు నిలుపుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment