పుష్కరశోభ కు కసరత్తు
- నేడు పుష్కరాల ప్రణాళికపై సమీక్ష
- నిధులపై భారీ ఆశలు
- దేవాదాయశాఖ ప్రణాళికలు సిద్ధం
- 2015 జూలై 14 నుంచి ప్రారంభం
జగిత్యాల: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అధికారయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లకు సిబ్బందిని సన్నద్ధం చేస్తోంది. ఈ ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల ఆల య కమిటీలు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల ఏర్పాట్లను ఇప్పటికే దేవాదాయశాఖ అధికారులుపరిశీలించారు. ధర్మపురిలో పుష్కర ఏర్పాట్లను ఆర్డీవో ఎస్. పద్మాకర్ ఆదివారం పరిశీలించారు.
12 రోజులు పండగే..
2003 జూలై 30 నుంచి 12 రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మల్లాపూర్ మండ లం వాల్గొండ, ధర్మపురి, కాళేశ్వరం, మంథని, కోటిలింగాల ప్రాంతంలో పుష్కరాలు జరిగాయి. ఆదిలాబాద్‌లో ప్రధానంగా బాసర, గూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో జరిగాయి. ఈసారి 14 జూలై 2015 నుంచి 12 రోజులు తెలంగాణలో తొలిసారి గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పుష్కరాలు జరుగనున్నాయి.
రూ. 300 కోట్ల ప్రతిపాదనలు
వచ్చే పుష్కరాల ఏర్పాట్ల కోసం జిల్లా నుంచి రూ.300 కోట్ల ప్రతిపాదలను వెళ్లనున్నాయి. ప్రధానంగా ధర్మపురి. కాళేశ్వరం, మంథని, కోటిలింగాల, వాల్గొండతోపాటు గోదావరిలో పుష్కరస్నానాలకు అనువుగా ఉండే ఇతర ప్రాంతాలను గుర్తించి అక్కడా తాత్కాలిక ఏర్పాట్లకు దేవాదాయ, ఇతర శాఖలు రూ.300 కోట్ల ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం.
ధర్మపురిలోని పుష్కర ఘాట్లు పెంచడం, కొత్తగా ఘాట్ల నిర్మాణాలపై ఆర్డీవో పద్మాకర్ దృష్టి సారించారు. ధర్మపురిలో ఐదు కిలో మీటర్ల మేరకు భారీ వాహనాలు లోనికి రాకుండా, పుష్కర ప్రాంతాల్లో పంటలకు క్రాప్ హాలిడే ఇవ్వాలని ఆయన కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నిధులు ఇప్పిస్తారనే ఆశలో స్థానిక అధికారులు ఉన్నారు.
రూ. 500 కోట్లు ఇస్తానన్న సీఎం
12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలకు లక్షలాది మంది పుష్కరస్నానాలు చేయడానికి వస్తారు. గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల ఖర్చు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బహిరంగ సభలో ప్రకటించారు. జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూడాలి.
పుష్కరాల అభివృద్ధి ప్రణాళికల ఇదీ..
- ధర్మపురి ఆలయంలో శ్రద్ధ మండపంతోపాటు కోనేరు(బ్రహ్మపుష్కరణి) శుభ్రత, మరమ్మతు, దేవాలయంలో ఆవరణలో కొత్త నిర్మాణాలు, పాతవాటిని తొలగించిన కొత్తగా ఏర్పాటు చేయడం
- పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా చలువ పందిళ్లు, షామియానాల ఏర్పాట్లు
- గోదావరినది 500 మంది కేపాసిటీ కలిగిన కేశఖండనశాలల నిర్మాణం
- విద్యుత్ సౌకర్యాలు, క్లాక్ రూముల ఏర్పాటు
- దేవాలయానికి రంగులు, ధర్మశాలకు సున్నం వేయడం
- వివిధ రూట్ మ్యాపులు, హెచ్చరిక బోర్డులు, సూచనల ప్లకార్డుల ఏర్పాటు
- లడ్డు/పులిహోర ప్రసాద విక్రయకేంద్రాల ఏర్పాట్లు
- 32 గదుల్లో వీఐపీలకు సేవలకు అవసరమైన సిబ్బంది. ప్రచార ఏర్పాట్లు. దేవాలయ భద్రతతోపాటు ప్రముఖల భద్రత ఏర్పాట్లు.
- క్యూలైన్లు
- 12 రోజులు నిరంతర అన్నదానం
ఇతర ఏర్పాట్లకు ప్రణాళికలు
- గోదావరినది ఒడ్డున జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని దేవాలయాల నిర్మాణం
- గోదావరిలోని పుష్కర ఘాట్ల విస్తరణ, అదనంగా ఘాట్ల నిర్మాణం
- గోదావరి నదిలో బారికేడ్ల నిర్మాణం
- ప్రధాన జాతీయ రహదారి మరమ్మతులు
- బాత్రూంలు, టాయిలెట్ల నిర్మాణాలు
- శానిటేషన్‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు
- మంచినీటి వసతి మెరుగుపరచడం
- పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చింతమణి చెరువును తీర్చిదిద్దడం
- వైద్యసౌకర్యాల కల్పనకు చర్యలు, గజ ఈతగాళ్ల ఎంపిక
- వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తిప్పడం
- పోలీసుల బందోబస్తుకు ప్రత్యేక బలగాలు
ఎక్సైజ్‌శాఖ మద్యనిషేధాన్ని కొనసాగించడం. వీటన్నింటికి వివిధ శాఖలకు నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంది