pv rao
-
హెచ్పీజీ చైర్మన్‌గా పీవీ రావు నియామకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హై పవర్డ్ గ్రూప్ (హెచ్పీజీ) చైర్మన్‌గా పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ (పెబ్స్ పెన్నార్) ఎండీ పీవీ రావు నియమితులయ్యారు. ప్రీ-ఇంజనీరింగ్ బిల్డింగ్స్ (పీఈబీ) టెక్నాలజీ పాలసీ రూపకల్పన, ప్రచారం కోసం హెచ్పీజీ పనిచేస్తుందని ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పీవీ రావు మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పీఈబీ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే పీఈబీతో నిర్మాణాలు వేగవంతమవ్వటమే కాకుండా తక్కువ ధరతో నాణ్యమైన నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. మౌలిక రంగానికి ఈ పీఈబీ టెక్నాలజీ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. -
ఉన్నత విద్యామండలికి ఊరట
సంస్థ ఉనికిలో ఉంటుందన్న సుప్రీంకోర్టు.. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఊరట లభించింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న అంశాన్ని పక్కన పెడుతున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఏపీ విద్యాసంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛను మండలికి కల్పిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం, మండలి దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రేల బెంచ్ విచారించింది. మండలి తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిం చారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదించగా.. తెలంగాణ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ వాదించారు. ఈ సందర్భంలో ధర్మాసనం.. ‘ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కౌంటర్ వేయకుంటే హైకోర్టు మాత్రం ఏంచేస్తుంది? అయినా జూన్ 2 తో ఏడాది గడువు ముగుస్తుంది కదా? హైకోర్టు ఎందుకు అంత త్వరగా తీర్పు ప్రకటించింది?’అని ప్రశ్నించింది.‘రాష్ట్రం విడిపోయింది పదే పదే కలహించుకోవడానికేనా.. పరస్పర అంగీకారంతో పనిచేసుకోవాలి ..’ అని జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే వ్యాఖ్యానించారు. ‘ఇదంతా హైదరాబాద్ చుట్టూ నలిగే అంశమే’ అని న్యాయమూర్తి విక్రంజిత్‌సేన్ వ్యాఖ్యానించారు. కౌంటర్ల దాఖలుకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మండలికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. -
తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాలి
‘‘తెలంగాణ ప్రాంతంలో ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నప్పటికీ ఇన్నేళ్లూ వివక్షకు గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి, తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చిత్ర నిర్మాణం జరగాలి’’ అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సంగకుమార్ హీరోగా శ్రీధర్ దర్శకత్వంలో పీవీరావు నిర్మించిన ‘తురుం’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను మంగళవారం హైదరాబాద్‌లో స్పీకర్ వీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షులు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ -‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ వారు వివక్షకు గురయ్యారు. ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో ప్రముఖ దర్శక నిర్మాత బి. నరసింగరావు చిత్రపటానికి స్థానం కల్పించకపోవడం అన్యాయం’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ ఏర్పడగానే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు విజయేందర్‌రెడ్డి, ‘తురుం’ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణ మాల మహాసంఘం ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలు, మాలమహానాడు స్థాపకుడు పీవీ రావు స్ఫూర్తితో మాలల హక్కులను పరిరక్షించడానికి, తెలంగాణ పునర్ నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహించడానికి ఏర్పాటైన వేదికే తెలంగాణ మాల మహాసంఘం అని ఆ సంఘం అధ్యక్షుడు మేక వెంకన్న అన్నారు. రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో మాలలకు సరైన వాటా దక్కించుకోవడానికి, వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ద్వారా పోరాటం చేస్తామన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాలమహా సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ గత పదేళ్లలో మాలలు అన్ని రంగాల్లో అణచివేతకు గురయ్యారన్నారు. మాలమహానాడు స్థాపించి మాల లను చైతన్య పరిచిన వ్యక్తి పీవీ రావు అని, ఆయన మరణానంతరం మాలమహానాడు అనేక సంఘాలుగా విడిపోయి మాలల సమస్యలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు.