ఉన్నత విద్యామండలికి ఊరట
సంస్థ ఉనికిలో ఉంటుందన్న సుప్రీంకోర్టు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఊరట లభించింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న అంశాన్ని పక్కన పెడుతున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఏపీ విద్యాసంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛను మండలికి కల్పిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం, మండలి దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రేల బెంచ్ విచారించింది. మండలి తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిం చారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదించగా.. తెలంగాణ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ వాదించారు. ఈ సందర్భంలో ధర్మాసనం.. ‘ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కౌంటర్ వేయకుంటే హైకోర్టు మాత్రం ఏంచేస్తుంది? అయినా జూన్ 2 తో ఏడాది గడువు ముగుస్తుంది కదా? హైకోర్టు ఎందుకు అంత త్వరగా తీర్పు ప్రకటించింది?’అని ప్రశ్నించింది.‘రాష్ట్రం విడిపోయింది పదే పదే కలహించుకోవడానికేనా.. పరస్పర అంగీకారంతో పనిచేసుకోవాలి ..’ అని జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే వ్యాఖ్యానించారు. ‘ఇదంతా హైదరాబాద్ చుట్టూ నలిగే అంశమే’ అని న్యాయమూర్తి విక్రంజిత్‌సేన్ వ్యాఖ్యానించారు. కౌంటర్ల దాఖలుకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మండలికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది.