కలెక్టర్ దృష్టికి ‘క్వారీ’ సమస్య
మైనింగ్ అనుమతులపై కలెక్టర్, ఎస్పీకి విన్నవించిన దువ్వాడ
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నందిగాం మండలంలో సొంటినూరు గ్రామం వద్ద నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీ అనుమతులను రెన్యువల్ చేయాలని, ఈ విషయమై టెక్కలి మైన్స్ ఏడీ లెసైన్స్‌లు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సోమవారం కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంకు ఫిర్యాదు చేశారు. తొలుత దువ్వాడ కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశా రు. అనంతరం ఎస్పీ బ్రహ్మారెడ్డిని కూడా కలసి శాంతి భద్రతల విషయమై ప్రస్తావించారు.
మైనింగ్ అనుమతుల రెన్యువల్ విషయమై టెక్కలి మైనింగ్ ఏడీ నిర్లక్ష్యానికి నిరసనగా 11 రోజులుగా దువ్వాడ వాణితో పాటు 400 మంది గిరిజనులు దీక్షలు నిర్వహిస్తున్నారని, అయినా ఇంత వరకూ అనుమతులు ఇవ్వలేదని ఆయన వివరించారు. క్వారీ నిలిపివేయడం వలన ప్రతి రోజూ రూ.75వేలు చొప్పు న నష్టం భరించాల్సి వస్తోందన్నారు.
ఇటీవల మైన్స్ ఏడీ తన కిందిస్థాయి సిబ్బందిని క్వారీకి పంపించారని, వారు కోరిన విధంగా అన్ని దరఖాస్తులు, అన్ని బ్లాకులు వారికి చూపించామని తెలిపారు. క్వారీ విషయంలో హైకోర్టు కూడా తనను మైనింగ్‌ను కొనసాగించాలని అనుమతులు కూడా జారీ చేసిందని ఆ ఉత్తర్వులను చూపించారు. సకాలంలో కలెక్టర్, ఎస్పీలు స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పోలాకి సోమేశ్వరరావు, వి.తాతారావు, విశ్వనాథం, ఎంపీటీసీ కృష్ణ తదితరులు ఉన్నారు.