అన్నదాత... సుఖీభవ
‘‘అందరికీ అన్నం పెట్టే రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల ఆత్మహత్యలను రూపుమాపేలా చర్యలు తీసుకోవాలని మా నూతన చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నాం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రం‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రం రెగ్యులర్ షూటిం ఈ నెల 4న ఆరంభం కానుంది.
మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారికి, తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి, ఏపీ సీయం నారా చంద్రబాబునాయుడుగారికి నా సినిమా ద్వారా మూడు విజ్ఞప్తులు చేయాలనుకుంటున్నాను. రైతుల ఆత్మహత్యలను జాతీయ విపత్తుగా భావించడంతో పాటు శాస్త్రవేత్త ఎమ్.ఎస్. స్వామినాథన్ సిఫార్సులను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. అలాగే, కేసీఆర్‌గారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతోపాటు అనేక సౌకర్యాలను కలిపిస్తూ రైతులకు మేలు చేస్తున్నారు.
అయితే గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతుల ఆత్మహత్యలు తగ్గడం లేదు. ఈ విషయంపై కేసీఆర్‌గారు తగు చర్యలను తీసుకోవాలని ఈ చిత్రం ద్వారా కోరుతున్నాం. ఏపీ సీయం చంద్రబాబునాయుడుగారు నదుల అనుసంధానంతో రైతులకు మరింత మేలు చేయాలని ఈ చిత్రంతో చెప్పాలనుకుంటున్నాం. అన్నదాతలూ మీరు చనిపోవద్దు. మీరు బతకండి... మమ్మల్ని బతికించండి’’ అన్నారు.