raazi
-
100 కోట్ల క్లబ్లో చేరిన మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఇవే..
Heroine Oriented Movies That Crossed 100 Crore In Bollywood: హీరో ఒరియెంటెడ్ మూవీస్ సాధారణమే. అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా హిట్ కొట్టడం పరిపాటే. కానీ మహిళా ప్రాధాన్యతతో వచ్చే సినిమాలు తక్కువే. ఒకవేళ వచ్చిన హిట్ కొట్టడం అంతా ఈజీ కాదు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి చరిష్మా, నైపుణ్యం వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. అయితే ఇటీవల 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియా భట్ నటించిన హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రం 'గంగుబాయి కతియావాడి'. ఈ సినిమాలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్‌వైడ్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 100 కోట్ల మార్క్ దాటిన మహిళా ప్రాధాన్యత గల పలు బాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా ! 1. గంగుబాయి కతియవాడి- వారం రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్లు 2. తను వెడ్స్ మను రిటర్న్స్ - రూ. 255.3 కోట్లు 3. రాజీ- రూ. 195 కోట్లు 4. నీర్జా- రూ. 131 కోట్లు 5. స్త్రీ- రూ. 130 కోట్లు -
మేకింగ్ ఆఫ్ మూవీ రాజీ
-
నటి ఆశ్చర్యకర సమాధానం
సిని పరిశ్రమలో కలకలం రేపిన ‘కాస్టింగ్ కౌచ్’ గురించి పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించగా...రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు తమకు అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌ను అడగ్గా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ‘ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బాగా వెలుగులోకి వచ్చింది. అయితే నా ఉద్దేశ్యం ప్రకారం ఇలాంటి అంశాల గురించి చర్చిస్తే పరిశ్రమ గురించి ప్రజలకు ప్రతికూల భావాలను రేకెత్తించిన వారమవుతాం. అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు’ అని తెలిపారు. అంతేకాక ‘జీవానాధరం కోసం కష్టపడే యువతీ, యువకులందరికి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని వారి పనులు జరిపించుకోవాలని చూస్తారు. అలాంటి వారి ప్రలోభాలకు లొంగకుండా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు తారసపడినప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని తెలిపారు. ప్రస్తుతం అలియా నటించిన రాజీ సినమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడతున్న సంగతి తెలిసిందే -
అలియాకు ప్రేమతో...
ముంబై: అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాజీ’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ‘రాజీ’ విజయాన్నిఎంజాయ్ చేస్తున్న అలియాకు మరో కానుక అందింది. ‘రాజీ’ విజయవంతమైన సందర్భంగా అలియ తండ్రి మహేష్ భట్ కూతురును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా అలియాను ఉద్దేశిస్తూ ట్విటర్లో ‘నా ప్రియమైన అలియా నిన్ను చూసి నేను చాలా సంతోష పడుతున్నాను, నువ్వు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి. నిన్ను నువ్వు మెరుగుపర్చుకోవడాన్ని ఒక వ్యసనంగా మార్చుకో.. ప్రేమతో మీ నాన్న’ అంటూ మేసేజ్ చేశారు. శుక్రవారం విడుదలైన ‘రాజీ’ సినిమా తొలిరోజు 7.53 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే వారాంతంలో(శని, ఆదివారాల్లో) 50 శాతం అధికంగా వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ. 32.94 కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది. అలియా నటన, బలమైన కథ ‘రాజీ’ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘రాజీ’ చిత్రాన్ని హరిందర్ సిక్క రాసిన పుస్తకం ‘కాలింగ్ సేహమత్’ ఆధారంగా తెరకెక్కించారు. గూఢచర్యం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో అలియా పాక్ సైనిక రహస్యాలను భారతీయ ఆర్మీకి చేరవేసే ‘స్పై’గా అద్భుతంగా నటించి విమర్శకులను సైతం మెప్పించింది. -
దేశం కోసం రాజీ
‘‘భారతదేశం ఆకాశం కేసి చూస్తూ ఉంటుంది... పాకిస్తాన్ భారత్ కాళ్ల కింద నేలను కబళిస్తుంది’’ అంటూ గెలుపు నవ్వు నవ్వుతాడు తనింట్లో భోజనాల బల్ల మీద భోజనం చేస్తూ పాకిస్తానీ బ్రిగేడియర్ సయ్యద్ (శిశిర్ శర్మ). ఆ మాటకు ఇద్దరు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులూ ఆనంద పడ్తారు. ఆ ఇద్దరిలో ఒకరు బ్రిగేడియర్ చిన్న కొడుకు ఇక్బాల్ (విక్కీ కౌశల్), అతని భార్య సెహమత్ (అలియా భట్). ఇక్బాల్ కూడా పాకిస్తానీ ఆర్మీ ఆఫీసరే. మరి అతని మనసెందుకు చివుక్కుమంటుంది తండ్రి మాటకు? అతని భార్య సెహమత్ భారతీయురాలు కాబట్టి! భోజనాలయిపోయి.. ఆ రాత్రి తమ గదిలోకి వెళ్లాక భార్యతో చెప్తాడు.. ‘‘సారీ.. మావాళ్లు కొంచెం ఇన్సెన్సిటివ్æ.. ఇండియా గురించి అలా మాట్లాడుతుంటే నీకెంత బాధనిపించుంటుందో అర్థం చేసుకోగలను. సారీ... ’’ అంటూ! పెద్దవాళ్ల ఇష్టంతో మాత్రమే జరిగిన తమ పెళ్లిలో.. భార్య ఎలాంటి ఇబ్బంది పడకూడదని.. తమ మనసులు కలిసేవరకు.. చెలిమి పెరిగే వరకూ తను భార్య దగ్గర తొందరపడకూడదని.. ఆమె తన ఇష్టం చెప్పేంత వరకు దగ్గరకు రాకూడదని భార్య స్పేస్‌ను గౌరవిస్తుంటాడు. సెహమత్కు హిందుస్థానీ క్లాసికల్ ఇష్టం అని ఆ రికార్డ్స్‌ను ప్రెజెంట్ చేసి తనూ ఆ సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెడ్తాడు. అలా భార్య భారతదేశంలో ఎలా పెరిగిందో.. ఎలాంటి అలవాట్లతో వచ్చిందో అలాగే పూర్తిగా ఆమెను అంగీకరించేలా తనను సన్నద్ధం చేసుకుంటుంటాడు. వాటిల్లో ఆమె దేశభక్తి కూడా ఒకటని తెలుసుకుంటాడా? అంగీకరిస్తాడా? ఆమె పట్ల అతనికున్న ప్రేమ దాన్నీ జయిస్తుందా? రాజీ పడేలా చేస్తుందా? ‘‘మనిద్దరి మధ్య ఏదీ నిజం కాదా సెహమత్?’’ తన పట్ల తుపాకీ గురిపెట్టిన భార్యను అడుగుతాడు ఇక్బాల్ ఆవేదనగా.. భార్య చేతిలో తుపాకి అబద్ధమైతే బాగుండు అనే ఆశతో.. తను అపురూపంగా తొడిగిన మువ్వల పట్టీల సవ్వడి రేపిన అలజడి అసత్యమైతే బాగుండు అనే ఆరాటంతో! ‘‘దేశం ఒక్కటే నిజం’’ అంటూ స్థిరంగా పలికిన భార్య స్వరం.. ఆయన భ్రమను పటాపంచలు చేస్తుంది. అందుకే అంటాడు ‘‘రెండు బుల్లెట్లు మాత్రమే వాడు.. ఒకటి నీ కోసం.. ఇంకోటి నా కోసం.. ఎందుకంటే దేశం ఒక్కటే నిజం కాబట్టి’’ అని. ఏంటీ యుద్ధం? ‘‘బంధాలు..అనుబంధాలు, ప్రాణాలకు విలువివ్వని ఈ యుద్ధం ఎందుకు? నా భర్తను చంపుకొని, నన్ను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేసి నేను సాధించిందేంటి?’’ అదే ఆవేదన సెహమత్లో కూడా! తండ్రి అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తుంది. కానీ ఎంతమందిని పణంగా పెట్టింది? ముఖ్యంగా తనను ప్రాణంలా ప్రేమించిన భర్తను! మిషన్ పూర్తి చేసుకొని కడుపులో నలుసుతో మాతృదేశం తిరిగొస్తుంది. ఏ యుద్ధాన్ని ద్వేషిస్తుందో.. ఏ గూఢచారి వ్యవస్థను అసహ్యించుకుంటుందో మళ్లీ అదే యుద్ధంలో.. అదే వ్యూహంలోకి తన కొడుకును సైనికుడిగా పంపిస్తుంది.ఇదీ సెహమత్ ఖాన్ జీవితం... రాజీ సినిమా కథ!ఒక సైనికుడి తల్లి నిజ జీవిత కథ ఆధారంగా ఇండియన్ నేవీ మాజీ లెఫ్టినెంట్ కమాండర్ హరీందర్ ఎస్ సిక్కా రాసిన ‘‘కాలింగ్ సెహమత్’’ నవలే రాజీ సినిమా! మేఘనా గుల్జార్ దర్శకురాలు. కథా వివరం.. కాలం 1971. హిదాయత్ ఖాన్ (రజిత్ కపూర్), పాకిస్తానీ బ్రిగేడియర్ సయ్యద్‌కు భారతదేశ సైనిక రహస్యాలను అందచేస్తున్నట్టు నటిస్తూనే పాకిస్తాన్ వ్యూహాన్ని గ్రహిస్తుంటాడు. అలాంటి ఒక సందర్భంలోనే భారత నావికా దళం మీద తన ఆధిపత్యం కోసం పాకిస్తాన్ కుట్రకు సిద్ధమైందనే విషయాన్నీ తెలుసుకుంటాడు. అప్పటికే అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలుతుంది. చావుకు దగ్గరైన∙అతను బతికున్నప్పుడే ఏదైనా చేయాలనే చింతతో ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటున్న కూతురిని ఉన్న పళంగా పిలిపిస్తాడు. ఆమే సెహమత్ ఖాన్. రక్తం చూస్తేనే కళ్లు తిరిగిపడిపోయేంత పిరికిది. చీమకు కూడా హాని కలగొద్దని తపించే సున్నితమనస్కురాలు. స్నేహితుడైన భారత ఇంటెలిజెన్స్ అధికారి ఖాలీద్ మీర్ (జైదీప్ అహ్లావత్)తో సంప్రదించి తన కూతురిని స్పైగా పాకిస్తానీ బ్రిగేడియర్ సయ్యద్ ఇంటికి పంపించాలనుకుంటాడు. ఈ విషయాన్నే సెహమత్తో చెప్పి ఒప్పిస్తాడు. ఖాలీద్ మీర్ ఆమెకు శిక్షణనిస్తాడు. బ్రిగేడియర్‌తో తనకున్న స్నేహం, అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని, సెంటిమెంట్‌తో దెబ్బకొట్టి తన కూతురిని బ్రికేడియర్ కొడుకు.. ఇక్బాల్‌కు ఇచ్చి నిఖా చేస్తాడు. పాకిస్తాన్‌కు పంపిస్తాడు కోడలిరూపంలో స్పైని. మిషన్ స్టార్ట్ అవుతుంది.. అత్తారింట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే తన మిషన్‌ను ప్రారంభిస్తుంది సెహమత్. ఆ ఇంట్లో పనోడు, నమ్మకస్తుడూ అయిన అబ్దుల్.. సెహమత్ వచ్చినప్పటి నుంచే ఆమెను అనుమానిస్తుంటాడు. అనుక్షణం నీడలా వెంటాడుతుంటాడు. మొత్తానికి ఓర్పు, నేర్పుతో ఆ ఇంట్లో వాళ్లందరికీ ఆప్తురాలవుతుంది ఒక్క అబ్దుల్‌కి తప్ప. ట్రైనింగ్‌లో నేర్చుకున్న మెళకువలతో భారత నావికా దళం మీద జరుగుతున్న కుట్రను ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిస్తుంటుంది. ఆ విషయాన్ని అబ్దుల్ పసిగడ్తాడు సాక్ష్యాధారలతో సహా. ఇంటెలిజెన్స్ నేర్పిన విద్యతోనే అబ్దుల్‌ను చంపేస్తుంది. చీమ చిటుక్కుమంటేనే విలవిల్లాడే తను ఓ మనిషిని చంపేంత కరుకుగా మారడాన్ని తట్టుకోలేకపోతుంది. ఏడుస్తుంది. అబ్దుల్ మరణం సెహమత్ బావగారి( భర్త అన్న)కీ మింగుడుపడదు. కూపీ లాగుతుంటాడు. అందులో సెహమత్ చిక్కుకునే ప్రమాదం కనపడే సరికి ట్రైనింగ్‌లో నేర్చుకున్న మరో విద్యతో బావగారినీ మట్టుబెడుతుంది. వరుస చావులతో ఆ ఇల్లు షాక్‌కి గురవుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ల నిఘా పెరుగుతుంది. తన మీద అనుమానం రాకుండా చనిపోయిన అబ్దుల్ మీదకు మళ్లిస్తుంది. భారత్, పాకిస్తాన్ విభజన జరగకముందు అబ్దుల్ భారతీయుడు. విభజన తర్వాత పాకిస్తాన్ వచ్చి స్థిరపడ్తాడు. ఆ కారణంతో అతని మీద సందేహం వచ్చేలా చేస్తుంది. ఆ క్రమంలో భర్తకు దొరికిపోతుంది. ఖంగు తింటాడు. ఇంకోవైపు సెహమత్ డేంజర్లో ఉందని తెలుసుకొని భారత ఇంటెలిజెన్స్ బృందం ఆమెను కాపాడ్డానికి పాకిస్తాన్ వస్తుంది. అయితే అప్పటికే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నిఘా ఉండడం వల్ల వాళ్లు సెహమత్ను అనుసరిస్తుంటారు. ఇది భారతీయ బృందం కళ్లలో పడి ఆమె ప్రాణాలతో శత్రువులకు దొరికితే ఇండియాకు మరింత ప్రమాదమని సెహమత్ను చంపేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రయత్నంలో సెహమత్ కాకుండా తనలా బురఖా వేసుకొని ఉన్న భారత గూఢచార సంస్థ ఉద్యోగినితో పాటు సెహమత్ భర్తా చనిపోతారు.భారత ఇంటెలిజెన్స్ తీరుకి దిగ్భ్రాంతి చెందుతుంది సెహమత్. చివరకు తనను కూడా చంపడానికి వెకడుగువేయని ఆ నిర్ధయకు. తనను నమ్మిన భర్త ప్రాణాలూ తీసినందుకు. మట్టి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఆ యుద్ధ తంత్రాలను ఏవగించుకుంటుంది. తండ్రి అప్పజెప్పిన పనిని పూర్తిచేస్తుంది. కానీ విపరీతమైన నైరాష్యంతో ఇండియాకు వస్తుంది.ఇదీ రాజీ.. ఘాజీ ముందు జరిగిన కథ. – శరాది -
ఆలియా భట్ ‘రాజీ’ ట్రైలర్ విడుదల
-
గుఢాచారిగా అలియా...?
అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ‘రాజీ’ సినిమా ట్రైలర్ మంగళవారం ఉదయం విడుదలయ్యింది. 1.5 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కథలోని కీలక విషయాలను చెప్పకనే చెప్తుంది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హరిందర్ సిక్కా పుస్తకం ‘కాలింగ్ శెహమత్’ ఆధారంగా 1971 నాటి ఇండో - పాక్ యుద్ధ పరిస్థితుల నేపధ్యంలో రూపొందింది. దేశం కోసం పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్న కాశ్మీరి యువతి అత్తవారింటికి వెళ్లిన తర్వాత గూఢచారిగా ఎలా మారిందనే కథాంశంత ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్లో ఆలియా భట్‌ను తొలుత అయాయకమైన కాశ్మీరి యువతిగా, అనంతరం గూఢచారిగా మారి తుపాకీ పట్టి, పోరాటాలు చేసే మహిళగా రెండు కోణాలలో చూస్తాం. ట్రైలర్‌ను బట్టే ఈ చిత్రంలో ఆలియా నటన అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ట్రైలర్‌తో చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ధర్మ మూవీస్, జంగిల్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నన ఈ చిత్రానికి మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. మేఘన గుల్జార్ ‘తల్వార్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియాతో పాటు విక్కి కౌశల్, రజిత్ కపూర్, జైదీప్ అహ్లవత్, సోని రాజ్డాన్ ఇతర పాత్రలు పోషస్తున్నారు. మే 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
మిస్ స్పై!
యస్.. కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది.. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌కు. ఎందుకంటే లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో నటించిన ‘రాజీ’ సినిమాను 2018 మే 11న రిలీజ్ చేయనున్నట్లు ఆలియా భట్ పేర్కొన్నారు. తొలిసారి ఆలియా లేడీ డైరెక్టర్‌తో చేసిన సినిమా ‘డియర్ జిందగీ’. దీనికి గౌరీ షిండే దర్శకురాలు. ఇప్పుడు ‘రాజీ’తో మరోసారి మహిళా దర్శకురాలితో సినిమా చేయడం ఆనందంగా ఉందంటున్నారు. 1971 ఇండో–పాక్ వార్ టైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. ఇందులో ఆలియా భట్ కాశ్మీరీ అమ్మాయి క్యారెక్టర్లో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో దేశం కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆలియా ‘స్పై’గా వర్క్ చేస్తారన్నది బాలీవుడ్ సమాచారం. ‘‘సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చాలా రోజులుగా ఒకే క్యారెక్టర్లో నటిస్తున్నప్పుడు బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ, తప్పదు. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం’’ అని షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆలియా పేర్కొన్నారు. -
దేశం కోసం
కన్నతల్లంటే ఎంత ప్రేమో, మాతృదేశమంటే అంతే ప్రేమ ఆ యువతికి. దేశసేవ చేస్తే ప్రజాసేవ చేసినట్లే అని నమ్ముతుంది. అందుకే దేశ రక్షణలో భాగంగా శత్రుదేశ ఆర్మీ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకు ఎంతో ధైర్యం కావాలి. అంతకు మించిన దేశభక్తి నరనరాన జీర్ణించుకుని ఉండాలి. సరిగ్గా ఇలాంటి దేశభక్తి కలిగిన భారతీయ కాశ్మీరీ అమ్మాయి పాత్రలో తన తర్వాతి చిత్రం ‘రాజీ’లో నటించనున్నారు క్యూట్ హీరోయిన్ ఆలియా భట్. విక్కీ కౌశల్, ఆలియా ముఖ్యతారలుగా మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేయనున్నారు. ‘‘ఇండో–పాక్ 1970 యుద్ధ సన్నివేశాలను ప్రతిబింబించేలా లొకేషన్లను ప్లాన్ చేస్తున్నాం. స్క్రిప్ట్‌పై మరింత పరిశోధన చేస్తున్నాం’’ అని ఓ సందర్భంలో దర్శకురాలు మేఘనా గుల్జార్ అన్నారు. హరీందర్ సిక్కా రాసిన ‘కాలింగ్ సెహామత్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందట.