race walk
-
నడకలో నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు. -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్‌లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్‌కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
అంచనాలకు మించి రాణిస్తున్న భారత అథ్లెట్లు.. రేస్ వాక్‌లో మరో పతకం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే ఓ స్వర్ణం (పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్దోస్ పాల్), 4 రజతాలు (మెన్స్ లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్, మహిళల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌సాబ్లే, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్), ఓ కాంస్యం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్ శంకర్) సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో పతకం చేజిక్కించుకున్నారు. పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్స్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రేస్‌ని 38:49.21 నిమిషాల్లో ముగించిన సందీప్.. మూడో స్థానంలో నిలువగా, కెనడాకు చెందిన ఎవాన్ డన్ఫీ (38:36.37 నిమిషాల్లో) స్వర్ణం, ఆస్ట్రేలియాకు చెందిన డెక్లాన్ టింగే (38:42.33 నిమిషాల్లో) రజతం సాధించారు. ఈ ఎడిషన్‌లో రేస్ వాక్‌లో భారత్‌కి ఇది రెండో మెడల్. మహిళల 10 కిలో మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించింది. సందీప్ బ్రాంజ్‌తో ప్రస్తుత క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత పతకాల సంఖ్య 7కు, ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 46కు (16 స్వర్ణాలు, 12 రజతాలు, 18 కాంస్యాలు) చేరింది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల పదో రోజు భారత్ పతకాల సంఖ్య ఆరుకు (3 స్వర్ణాలు, రజతం, 2 కాంస్యాలు)చేరింది. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్, ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ పసిడి పతకాలు సాధించగా.. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబకర్ రజతం, మహిళల హాకీలో కాంస్యం, తాజాగా సందీప్ కుమార్ పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్‌లో కాంస్యం గెలిచారు. చదవండి: చరిత్ర సృష్టంచిన భారత అథ్లెట్లు.. ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం, రజతం మనవే -
భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం
కామన్వెల్త్ క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ మూడో పతకం (పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ మురళీ రజతం) సాధించింది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ చేజిక్కించుకుంది. 43 నిమిషాల 38 సెకెన్లలో రేస్‌ను ముగించి ప్రియాంక.. కెరీర్లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు కామన్వెల్త్ క్రీడల రేస్ వాకింగ్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ప్రియాంక సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 27కు (9 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కంస్యాలు) చేరింది. మరోవైపు తొమ్మిదో రోజు బాక్సింగ్‌లోనూ భారత్ హవా కొనసాగింది. మహిళల 48 కేజీల విభాగంలో నీతూ గంగస్ కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల 51 కేజీల విభాగం సెమీ ఫైనల్లో అమిత్ పంగల్.. జాంబియా బాక్సర్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో ఆయా విభాగాల్లో భారత్‌కు రెండు పతాకలు ఖరారయ్యాయి. చదవండి: CWG 2022: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే -
ఒలింపిక్స్ నడక
‘‘ఒలింపిక్స్ అన్న మాటే నా ఆలోచనల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లోనే ఆడబోతున్నాను’’. ఫిబ్రవరి 13 న రాంచీలో జరిగిన రేస్ వాకింగ్ జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, ఒలింపిక్స్‌కి అర్హత పొందిన ప్రియాంక గోస్వామి (24) అన్న మాట ఇది!! నిజమే, ఆమె కుటుంబ పరిస్థితులు కూడా అటువంటివే! చదువే భారమైనప్పుడు ఆటలు, ఆటల పోటీలు, ఒలింపిక్స్.. ఇవన్నీ ఊహకైనా సాధ్యమయేవేనా! అయ్యాయి. అందుకు ముగ్గురు వ్యక్తులు కారణం. తల్లి, తండ్రి, కోచ్. ‘‘ఈ ముగ్గురూ స్పోర్ట్స్‌లో నాకొక అందమైన భవిష్యత్తును ప్రసాదించారు. వారు చూస్తుండగా ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాను’’ అని సంబరంగా అంటున్న ప్రియాంక ప్రస్తుతం టోక్యోలో జూలైలో జరిగే ఒలింపిక్స్‌కి సాధన చేస్తోంది. ప్రియాంక ఈ ఫిబ్రవరిలో 1:28:45 నిముషాలలో 20 కి.మీ. రేస్ వాక్‌లో లక్ష్యాన్ని సాధించి, విజేతగా నిలిచినప్పటి నుంచీ రానున్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు ఆమె ఒక పసిడి ఆశ అయింది. ప్రియాంక ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి. ఆమె తండ్రి మదన్ పాల్ ప్రభుత్వ రవాణా శాఖలో బస్ కండక్టర్. వాళ్లుండే ముజఫర్‌నగర్ బుధాన ప్రాంతంలోని సాగడి గ్రామం నుంచి ఉద్యోగం కోసం భార్యాబిడ్డలతో మీరట్ వచ్చేశారు ఆయన. ప్రియాంక పెద్దమ్మాయి. ఆమె తమ్ముడు కపిల్. తల్లి అనిత గృహిణి. డ్యూటీలో ఉండగా ఒక రోడ్డు ప్రమాదం కేసులో బస్ డ్రైవర్ తో పాటు, ప్రియాంక తండ్రి ఉద్యోగం కూడా పోయింది. ఆర్థికంగా అసలే అంతంత మాత్రం అయిన ఆ కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోయింది. అయితే బిడ్డల చదువు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని తీర్మానించుకున్నారా భార్యాభర్తలు. మదన్‌పాల్ టాక్సీ అద్దెకు తీసుకుని నడిపాడు. భార్య చేత చిన్న కిరాణా దుకాణం పెట్టించాడు. పిండి మర ఆడించాడు. స్కూలు లేనప్పుడు పిల్లలిద్దరూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకునేవారు. ప్రియాంక మీరట్‌లోని కనోహర్లాల్ గర్ల్స్ స్కూల్లో చదివింది. పాటియాలలో బి.ఎ. పూర్తి చేసింది. బి.ఎ. చదువుతున్నప్పుడే ఆమె రేస్ వాక్‌ను తనకు ఇష్టమైన క్రీడాంశం గా ఎంచుకుని ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో తండ్రి పంపించిన డబ్బుతోనే సర్దుకునేది. నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పంపేవారు ఆయన. వాటిల్లోనే కొంత మిగుల్చుకుని మిగతా ఖర్చులకు వాడుకునేది. అందుకోసం తరచు ఆమె ఒక పూట మాత్రమే భోజనం చేసింది. 2011లో రేస్ వాక్‌లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాక ఆ ఈవెంట్‌పై మరింత శ్రద్ధ పెట్టింది ప్రియాంక. ఆమె తమ్ముడు కూడా స్పోర్ట్స్మనే. స్టేట్ లెవల్ బాక్సింగ్ ప్లేయర్. మీరట్‌లో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2014–15లో ప్రియాంక డిగ్రీ అయ్యాక ఆమెకు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉచితంగా శిక్షణ లభించడానికి ఆమె కోచ్ గౌరవ్ త్యాగి చేసిన ప్రయత్నాలే కారణం. 2018లో ప్రియాంకకు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చాక ఆ కుటుంబ పరిస్థితి కాస్త మెరుగైంది. ‘‘స్కూల్లో ఉన్నప్పుడే నాన్న నాకు అప్పు చేసి స్కూటీ కొనిచ్చాడు. దానిపై స్కూలుకూ, స్టేడియంలో ప్రాక్టీస్‌కీ వెళ్లేదాన్ని. పరీక్షలు, స్పోర్ట్ ఈవెంట్లు ఉన్నప్పుడు ఆమ్మ నిద్ర మానుకుని మరీ నాకోసం అన్నీ అమర్చిపెట్టే పనిలో ఉండేది. ఇక నా కోచ్ త్యాగి సర్ అయితే నా శిక్షణ కోసం చాలా కష్టపడ్డారు. వారందరి వల్లే నేను ఈ రోజు ఒలింపిక్స్‌కి అర్హత సాధించాను’’ అని ప్రియాంక చెబుతోంది. స్కూల్లో ఉండగా ప్రియాంకకు క్రీడల్లో అసక్తికరమైన అంశం జిమ్నాస్టిక్స్. కొంతకాలం తర్వాత అథ్లెటిక్స్ వైపు వచ్చింది. డిగ్రీ అయ్యాక రేస్ వాకింగ్పై ఇష్టం పెంచుకుంది. ఫ్యాషన్ మోడలింగ్ కూడా ఇష్టం. -
ఇల్లు నిలబడాలని నడక
అమ్మానాన్నల ఆశలు తీర్చాలని నడక తోబుట్టువుల కలలు నెరవేర్చాలని నడక పూట గడవని కుటుంబాన్ని నిలబెట్టాలని నడక నడుస్తూ రికార్డులు తిరగరాస్తూ ముందుకు వెళుతోంది మునితా ప్రజాపతి. ఇటీవల గౌహతిలో జరిగిన 36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచిన మునితా ప్రజాపతి అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం 10 కిలోమీటర్ల రేస్ వాక్ ని 48 నిమిషాలలోపు పూర్తి చేసిన మొదటి మహిళా వాకర్‌గా మునితా జాతీయ రికార్డు సృష్టించింది. 19 ఏళ్ల ఈ బక్క పలచని అమ్మాయి ఎవరు? అని అందరూ ఆమెపై దృష్టి కేంద్రీకరించారు. వారణాసి జిల్లా ఖుర్ద్ గ్రామానికి చెందిన ఆమె ఓ భవన నిర్మాణ కార్మికుడి కూతురు అని, ఈ పోటీలో పాల్గొనడానికి ఆమె కుటుంబసభ్యులు కూలి పని చేసి షూస్ కొనిచ్చారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినందన ల్లో ముంచెత్తారు. ఆర్థిక వనరుల గురించి కాదు, అసలు తనలోని సత్తా నిరూపించుకోవాలని బరిలోకి దిగిన అథ్లెట్ మునితా సంకల్పశక్తిని అంతా కొనియాడారు. నడిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం.. ఖుర్ద్ గ్రామంలో ఉంటున్న మునితా కుటుంబం పెద్దదే. అయినా, పేదరికం కారణంగా వారంతా ఒకే గదిలో నివాసముంటారు. ‘స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చని మా అక్క చెబితే అథ్లెటిక్స్ వైపుగా వచ్చాను. మా కుటుంబం స్థిరపడటానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మాత్రమే నాలో ఉంది. నా తల్లిదండ్రులు ఇద్దరూ నా కోసం చాలా త్యాగం చేసారు. వారికి మంచి జీవితం కల్పించాలన్నది నా కల’ అంటూ ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్న మునిత ఈ సందర్భంగా తెలిపింది. పూట గడవని పరిస్థితుల నుంచి.. మునితా తండ్రి బిరాజు 2010 వరకు ముంబైలోని భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. అక్కడే తీవ్రంగా కరెంట్ షాక్‌కి గరయ్యాడు. దీంతో అతను ముంబై నుండి తన ఊరుకు కుటుంబాన్ని తీసుకొని వచ్చేశాడు. గ్రామంలో ఊంటూ, ఏదైనా పని కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ‘కరెంట్ షాక్ వల్ల నాన్నకు ఒక కాలి బొటనవేలు, మరో కాలుకు కొన్ని వేళ్లను తీసేయాల్సి వచ్చింది. కొన్నాళ్లపాటు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి. అప్పుడు రోజులు ఎలా గడపాలో కూడా అర్ధం కాలేదు మాకు. అమ్మ, అక్కలు పనిలోకి వెళ్లేవారు. ఓ రోజు మా అక్క చెప్పింది, ఆటలు బాగా ఆడితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అప్పుడు మన జీవితాలు బాగవుతాయ’ ని తన 10 ఏళ్ల వయసులో తోబుట్టువుల మధ్య వచ్చిన చర్చను మునితా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గ్రామంలోని ఇతర యువకులకు శిక్షణ ఇచ్చే కోచ్ నిర్భయ్ అనే ఆర్మీ వ్యక్తి ఉండటం మునిత అదృష్టమనే చెప్పాలి. రేస్ వాక్ ఓ ప్రొఫెషనల్ క్రీడ అని ఆమెకు అప్పట్లో ఏ మాత్రం తెలియదు. ‘మా కోచ్ నేను నడకలో బాగా రాణించగలనని చెప్పాడు. నేను అతనిని నమ్మాను. కోచ్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేశాను’ అని తన సాధన గురించి మునిత చెప్పింది. 2017లో మునిత భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో ట్రయల్స్ ఇవ్వడంతో హాస్టల్లో చేరడానికి అవకాశం కల్పించారు. అప్పుడు మునిత వయస్సు గ్రూప్ కమిటీలో ఎప్పుడూ చర్చకు వచ్చేది. దీంతో నెలకు 10,000 రూపాయల ఖేలో ఇండియా స్కాలర్షిప్ మునితకు వచ్చేలా ఏర్పాటయ్యింది. అమ్మానాన్నలను విమానంలో... మునిత తల్లిదండ్రులకు తమ కూతురు ఆటల పోటీల గురించి పెద్దగా తెలియకపోయినా వారు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు ఆమె పాల్గొన్న పోటీలేవీ వారు నేరుగా చూడలేదు. మునిత ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఊళ్లో వాళ్లు మా కుటుంబాన్ని హెచ్చరించారు ‘ఆడపిల్ల ఇంటి నుండి దూరంగా ఉండకూడదు’ అని. కానీ మా అమ్మ వాళ్లతో ‘నా కూతురు ఏదో ఒక రోజు పెద్దదై తిరిగి వస్తుంది. ఈ ఇంటికి దూరంగా ఉంటేనే అది జరుగుతుంది’ అని చెప్పింది. మా అమ్మ భోపాల్‌కు వచ్చి నాతో కలిసి ప్రయాణించాలని కోరుకుంటుంది. ఇప్పటి వరకు మా అమ్మనాన్నలు ఎన్నడూ విమానాశ్రయంలోకి కూడా ప్రవేశించలేదు. వారిని విమానంలో తీసుకెళ్లాలనే కోరిక నాకు ఉంది. నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మనాన్నలను విమానంలో తీసుకెళతాను’ అని తెలిపింది మునిత. నిద్ర లేచింది మొదలు నడవాలి. సొంత పనులకు, ఆర్థిక వనరులకు.. ఏదైనా నడకతో మనల్ని మనం నిరూపించుకోవాలి. ఇంటి నుంచి ఊరు నుంచి జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు నడుస్తూనే నడకలో పోటీ పడుతూ మున్ముందుకు వెళుతోంది మునిత. రేస్ వాక్‌లో మునితా ప్రజాపతి తల్లి పూజతో మునిత -
3,000 మీ. రేస్ వాక్‌లో శ్రేష్టకు స్వర్ణం
గచ్చిబౌలి: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అథ్లెట్ ఎన్. శ్రేష్ట సత్తాచాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఈ టోర్నీలో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్–16 బాలికల 3000 మీటర్ల రేస్‌వాక్ ఈవెంట్‌ను శ్రేష్ట 21 నిమిషాల 9.9 సెకన్లలో పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచింది. ఈ ఈవెంట్లో మహబూబ్‌నగర్‌కు చెందిన వి.సంధ్య (21ని.35.9సె.), ఆదిలాబాద్‌కు చెందిన ఎం.భవాని (22ని.20.2సె) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సింథటిక్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి స్థాయి నుంచే క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోచ్ రమేష్, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి కె. రంగారావు, రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభు కుమార్‌గౌడ్, సారంగ పాణి, స్టాన్లీ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–16 బాలుర 5000మీ. రేస్‌వాక్: 1. కె. దుర్గారావు (వరంగల్), 2. టి. రవి సాగర్ (కరీంనగర్), 3. ఎ. రాహుల్ (ఆదిలాబాద్). అండర్–18 బాలుర 10000మీ. రేస్‌వాక్: 1. రాజ్ మిశ్రా (హైదరాబాద్), 2. రాజ హరి (కరీంనగర్), 3. వినయ్ కుమార్ (రంగారెడ్డి). అండర్–18 బాలికల 5000మీ. రేస్‌వాక్: 1. వర్ష (రంగారెడ్డి), 2. ఆర్. సంఘవి (కరీంనగర్).