మునితా ప్రజాపతి
అమ్మానాన్నల ఆశలు తీర్చాలని నడక తోబుట్టువుల కలలు నెరవేర్చాలని నడక పూట గడవని కుటుంబాన్ని నిలబెట్టాలని నడక నడుస్తూ రికార్డులు తిరగరాస్తూ ముందుకు వెళుతోంది మునితా ప్రజాపతి.
ఇటీవల గౌహతిలో జరిగిన 36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలో గెలిచిన మునితా ప్రజాపతి అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం 10 కిలోమీటర్ల రేస్ వాక్ ని 48 నిమిషాలలోపు పూర్తి చేసిన మొదటి మహిళా వాకర్‌గా మునితా జాతీయ రికార్డు సృష్టించింది. 19 ఏళ్ల ఈ బక్క పలచని అమ్మాయి ఎవరు? అని అందరూ ఆమెపై దృష్టి కేంద్రీకరించారు. వారణాసి జిల్లా ఖుర్ద్ గ్రామానికి చెందిన ఆమె ఓ భవన నిర్మాణ కార్మికుడి కూతురు అని, ఈ పోటీలో పాల్గొనడానికి ఆమె కుటుంబసభ్యులు కూలి పని చేసి షూస్ కొనిచ్చారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినందన ల్లో ముంచెత్తారు. ఆర్థిక వనరుల గురించి కాదు, అసలు తనలోని సత్తా నిరూపించుకోవాలని బరిలోకి దిగిన అథ్లెట్ మునితా సంకల్పశక్తిని అంతా కొనియాడారు.
నడిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం..
ఖుర్ద్ గ్రామంలో ఉంటున్న మునితా కుటుంబం పెద్దదే. అయినా, పేదరికం కారణంగా వారంతా ఒకే గదిలో నివాసముంటారు. ‘స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చని మా అక్క చెబితే అథ్లెటిక్స్ వైపుగా వచ్చాను. మా కుటుంబం స్థిరపడటానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మాత్రమే నాలో ఉంది. నా తల్లిదండ్రులు ఇద్దరూ నా కోసం చాలా త్యాగం చేసారు. వారికి మంచి జీవితం కల్పించాలన్నది నా కల’ అంటూ ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్న మునిత ఈ సందర్భంగా తెలిపింది.
పూట గడవని పరిస్థితుల నుంచి..
మునితా తండ్రి బిరాజు 2010 వరకు ముంబైలోని భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. అక్కడే తీవ్రంగా కరెంట్ షాక్‌కి గరయ్యాడు. దీంతో అతను ముంబై నుండి తన ఊరుకు కుటుంబాన్ని తీసుకొని వచ్చేశాడు. గ్రామంలో ఊంటూ, ఏదైనా పని కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ‘కరెంట్ షాక్ వల్ల నాన్నకు ఒక కాలి బొటనవేలు, మరో కాలుకు కొన్ని వేళ్లను తీసేయాల్సి వచ్చింది. కొన్నాళ్లపాటు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి. అప్పుడు రోజులు ఎలా గడపాలో కూడా అర్ధం కాలేదు మాకు. అమ్మ, అక్కలు పనిలోకి వెళ్లేవారు. ఓ రోజు మా అక్క చెప్పింది, ఆటలు బాగా ఆడితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అప్పుడు మన జీవితాలు బాగవుతాయ’ ని తన 10 ఏళ్ల వయసులో తోబుట్టువుల మధ్య వచ్చిన చర్చను మునితా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
గ్రామంలోని ఇతర యువకులకు శిక్షణ ఇచ్చే కోచ్ నిర్భయ్ అనే ఆర్మీ వ్యక్తి ఉండటం మునిత అదృష్టమనే చెప్పాలి. రేస్ వాక్ ఓ ప్రొఫెషనల్ క్రీడ అని ఆమెకు అప్పట్లో ఏ మాత్రం తెలియదు. ‘మా కోచ్ నేను నడకలో బాగా రాణించగలనని చెప్పాడు. నేను అతనిని నమ్మాను. కోచ్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేశాను’ అని తన సాధన గురించి మునిత చెప్పింది. 2017లో మునిత భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో ట్రయల్స్ ఇవ్వడంతో హాస్టల్‌లో చేరడానికి అవకాశం కల్పించారు. అప్పుడు మునిత వయస్సు గ్రూప్ కమిటీలో ఎప్పుడూ చర్చకు వచ్చేది. దీంతో నెలకు 10,000 రూపాయల ఖేలో ఇండియా స్కాలర్‌షిప్ మునితకు వచ్చేలా ఏర్పాటయ్యింది.
అమ్మానాన్నలను విమానంలో...
మునిత తల్లిదండ్రులకు తమ కూతురు ఆటల పోటీల గురించి పెద్దగా తెలియకపోయినా వారు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు ఆమె పాల్గొన్న పోటీలేవీ వారు నేరుగా చూడలేదు. మునిత ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఊళ్లో వాళ్లు మా కుటుంబాన్ని హెచ్చరించారు ‘ఆడపిల్ల ఇంటి నుండి దూరంగా ఉండకూడదు’ అని. కానీ మా అమ్మ వాళ్లతో ‘నా కూతురు ఏదో ఒక రోజు పెద్దదై తిరిగి వస్తుంది. ఈ ఇంటికి దూరంగా ఉంటేనే అది జరుగుతుంది’ అని చెప్పింది. మా అమ్మ భోపాల్‌కు వచ్చి నాతో కలిసి ప్రయాణించాలని కోరుకుంటుంది. ఇప్పటి వరకు మా అమ్మనాన్నలు ఎన్నడూ విమానాశ్రయంలోకి కూడా ప్రవేశించలేదు. వారిని విమానంలో తీసుకెళ్లాలనే కోరిక నాకు ఉంది. నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మనాన్నలను విమానంలో తీసుకెళతాను’ అని తెలిపింది మునిత.
నిద్ర లేచింది మొదలు నడవాలి. సొంత పనులకు, ఆర్థిక వనరులకు.. ఏదైనా నడకతో మనల్ని మనం నిరూపించుకోవాలి. ఇంటి నుంచి ఊరు నుంచి జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు నడుస్తూనే నడకలో పోటీ పడుతూ మున్ముందుకు వెళుతోంది మునిత.
రేస్ వాక్‌లో మునితా ప్రజాపతి
తల్లి పూజతో మునిత
Comments
Please login to add a commentAdd a comment