National Junior Athletics Championship
-
ఇల్లు నిలబడాలని నడక
అమ్మానాన్నల ఆశలు తీర్చాలని నడక తోబుట్టువుల కలలు నెరవేర్చాలని నడక పూట గడవని కుటుంబాన్ని నిలబెట్టాలని నడక నడుస్తూ రికార్డులు తిరగరాస్తూ ముందుకు వెళుతోంది మునితా ప్రజాపతి. ఇటీవల గౌహతిలో జరిగిన 36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచిన మునితా ప్రజాపతి అందరి దృష్టిని ఆకర్షించింది. కారణం 10 కిలోమీటర్ల రేస్ వాక్ ని 48 నిమిషాలలోపు పూర్తి చేసిన మొదటి మహిళా వాకర్‌గా మునితా జాతీయ రికార్డు సృష్టించింది. 19 ఏళ్ల ఈ బక్క పలచని అమ్మాయి ఎవరు? అని అందరూ ఆమెపై దృష్టి కేంద్రీకరించారు. వారణాసి జిల్లా ఖుర్ద్ గ్రామానికి చెందిన ఆమె ఓ భవన నిర్మాణ కార్మికుడి కూతురు అని, ఈ పోటీలో పాల్గొనడానికి ఆమె కుటుంబసభ్యులు కూలి పని చేసి షూస్ కొనిచ్చారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినందన ల్లో ముంచెత్తారు. ఆర్థిక వనరుల గురించి కాదు, అసలు తనలోని సత్తా నిరూపించుకోవాలని బరిలోకి దిగిన అథ్లెట్ మునితా సంకల్పశక్తిని అంతా కొనియాడారు. నడిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం.. ఖుర్ద్ గ్రామంలో ఉంటున్న మునితా కుటుంబం పెద్దదే. అయినా, పేదరికం కారణంగా వారంతా ఒకే గదిలో నివాసముంటారు. ‘స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చని మా అక్క చెబితే అథ్లెటిక్స్ వైపుగా వచ్చాను. మా కుటుంబం స్థిరపడటానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మాత్రమే నాలో ఉంది. నా తల్లిదండ్రులు ఇద్దరూ నా కోసం చాలా త్యాగం చేసారు. వారికి మంచి జీవితం కల్పించాలన్నది నా కల’ అంటూ ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్న మునిత ఈ సందర్భంగా తెలిపింది. పూట గడవని పరిస్థితుల నుంచి.. మునితా తండ్రి బిరాజు 2010 వరకు ముంబైలోని భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. అక్కడే తీవ్రంగా కరెంట్ షాక్‌కి గరయ్యాడు. దీంతో అతను ముంబై నుండి తన ఊరుకు కుటుంబాన్ని తీసుకొని వచ్చేశాడు. గ్రామంలో ఊంటూ, ఏదైనా పని కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ‘కరెంట్ షాక్ వల్ల నాన్నకు ఒక కాలి బొటనవేలు, మరో కాలుకు కొన్ని వేళ్లను తీసేయాల్సి వచ్చింది. కొన్నాళ్లపాటు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి. అప్పుడు రోజులు ఎలా గడపాలో కూడా అర్ధం కాలేదు మాకు. అమ్మ, అక్కలు పనిలోకి వెళ్లేవారు. ఓ రోజు మా అక్క చెప్పింది, ఆటలు బాగా ఆడితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అప్పుడు మన జీవితాలు బాగవుతాయ’ ని తన 10 ఏళ్ల వయసులో తోబుట్టువుల మధ్య వచ్చిన చర్చను మునితా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గ్రామంలోని ఇతర యువకులకు శిక్షణ ఇచ్చే కోచ్ నిర్భయ్ అనే ఆర్మీ వ్యక్తి ఉండటం మునిత అదృష్టమనే చెప్పాలి. రేస్ వాక్ ఓ ప్రొఫెషనల్ క్రీడ అని ఆమెకు అప్పట్లో ఏ మాత్రం తెలియదు. ‘మా కోచ్ నేను నడకలో బాగా రాణించగలనని చెప్పాడు. నేను అతనిని నమ్మాను. కోచ్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేశాను’ అని తన సాధన గురించి మునిత చెప్పింది. 2017లో మునిత భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో ట్రయల్స్ ఇవ్వడంతో హాస్టల్లో చేరడానికి అవకాశం కల్పించారు. అప్పుడు మునిత వయస్సు గ్రూప్ కమిటీలో ఎప్పుడూ చర్చకు వచ్చేది. దీంతో నెలకు 10,000 రూపాయల ఖేలో ఇండియా స్కాలర్షిప్ మునితకు వచ్చేలా ఏర్పాటయ్యింది. అమ్మానాన్నలను విమానంలో... మునిత తల్లిదండ్రులకు తమ కూతురు ఆటల పోటీల గురించి పెద్దగా తెలియకపోయినా వారు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు ఆమె పాల్గొన్న పోటీలేవీ వారు నేరుగా చూడలేదు. మునిత ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఊళ్లో వాళ్లు మా కుటుంబాన్ని హెచ్చరించారు ‘ఆడపిల్ల ఇంటి నుండి దూరంగా ఉండకూడదు’ అని. కానీ మా అమ్మ వాళ్లతో ‘నా కూతురు ఏదో ఒక రోజు పెద్దదై తిరిగి వస్తుంది. ఈ ఇంటికి దూరంగా ఉంటేనే అది జరుగుతుంది’ అని చెప్పింది. మా అమ్మ భోపాల్‌కు వచ్చి నాతో కలిసి ప్రయాణించాలని కోరుకుంటుంది. ఇప్పటి వరకు మా అమ్మనాన్నలు ఎన్నడూ విమానాశ్రయంలోకి కూడా ప్రవేశించలేదు. వారిని విమానంలో తీసుకెళ్లాలనే కోరిక నాకు ఉంది. నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మనాన్నలను విమానంలో తీసుకెళతాను’ అని తెలిపింది మునిత. నిద్ర లేచింది మొదలు నడవాలి. సొంత పనులకు, ఆర్థిక వనరులకు.. ఏదైనా నడకతో మనల్ని మనం నిరూపించుకోవాలి. ఇంటి నుంచి ఊరు నుంచి జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు నడుస్తూనే నడకలో పోటీ పడుతూ మున్ముందుకు వెళుతోంది మునిత. రేస్ వాక్‌లో మునితా ప్రజాపతి తల్లి పూజతో మునిత -
ఉత్తమ అథ్లెట్లు నందిని, యశ్వంత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి అగసారా నందిని అండర్–18 బాలికల విభాగంలో... ఆంధ్రప్రదేశ్ అబ్బాయి యశ్వంత్ కుమార్ అండర్–20 బాలుర విభాగంలో ‘ఉత్తమ అథ్లెట్’ అవార్డులు గెల్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. నందిని ఈ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యశ్వంత్ అండర్–20 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తెలంగాణ మొత్తం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో 12వ ర్యాంక్‌లో... ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 15వ ర్యాంక్‌లో నిలిచాయి. అనికేత్, దీప్తిలకు రజతాలు చాంపియన్‌షిప్ చివరి రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అండర్–18 బాలుర 200 మీటర్లలో అనికేత్ చౌదరి (తెలంగాణ–21.71 సెకన్లు) రజతం సొంతం చేసుకున్నాడు. అండర్–18 బాలికల 200 మీటర్ల లో దీప్తి (తెలంగాణ–24.67 సెకన్లు) కూడా రజత పతకం సాధించింది. అండర్–20 బాలుర 200 మీటర్లలో ఎన్. షణ్ముగ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్ –21.60 సెకన్లు) కాంస్యం గెలిచాడు. -
నందిని ‘పసిడి’ జంప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు తెలంగాణకు రెండు పతకాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక పతకం లభించాయి. గువాహటిలో శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసారా నందిని అండర్–18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... అండర్–20 బాలుర షాట్‌పుట్ ఈవెంట్లో మొహమ్మద్ మోసిన్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు. అండర్–18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జెమ్మెల లక్ష్మీ రజత పతకం దక్కించుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీ 5.38 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని అయిన నందిని లాంగ్‌జంప్ ఫైనల్లో 5.80 మీటర్ల దూరం దూకి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ‘ద్రోణాచార్య అవార్డు గ్రహీత’ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న నందిని గత ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. ‘జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొనే ప్రతీ టోర్నీలో విజయం సాధించేందుకు, పతకాలు గెలిచేందుకు వందశాతం కృషి చేస్తాను. రాష్ట్రంతోపాటు దేశానికి పేరు తెచ్చేలా శ్రమిస్తాను. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడమే నా సుదీర్ఘ లక్ష్యం’ అని నందిని వ్యాఖ్యానించింది. షాట్‌పుట్ ఫైనల్లో మోసిన్ ఖురేషీ ఇనుప గుండును 16.36 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. -
అథ్లెటిక్స్ అదిరెన్
రాజధాని నడిబొడ్డున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా ప్రారంభమైన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు సమన్వయానికి ఆత్మ విశ్వాసం జత చేసి ప్రతి ఆటలోనూ తమకు తామే సాటి అంటూ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. హర్డిల్స్ అండర్– 20 విభాగంలో ఏపీ అథ్లెట్ బోణీ కొట్టాడు. ఉత్సాహం తోడుగా.. ఆకాశమే హద్దుగా అథ్లెట్లు చెలరేగిపోయారు.పతకాలు లక్ష్యంగా ప్రతిభ చూపారు. జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం వివిధ విభాగాల్లో పోటీలు ఉత్కంఠ రేపాయి. పలువురు అథ్లెట్లు సత్తాచాటి రికార్డులు బద్దలుకొట్టారు. హరియాణ క్రీడాకారులు అదరగొట్టారు. హర్డిల్స్‌లో ఏపీ పతకాల ఖాతా తెరిచింది. అథ్లెటిక్ సంబరం పసందుగా సాగి క్రీడాప్రియులకు పరమానందం పంచింది. ఏఎన్‌యూ : క్రీడాకారుల అసాధారణ ప్రతిభ, అత్యున్నత క్రీడా ప్రదర్శనల నడుమ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగాయి. ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎన్‌యూ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజైన శుక్రవారం పలు అథ్లెటిక్ అంశాల్లో పోటీలు ఉత్కంఠగా సాగాయి. అండర్ 20 విభాగంలో బాలుర కేటగిరీలో ఏపీకి చెందిన అథ్లెట్ జి.గోపీచంద్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వివిథ అథ్లెటిక్ అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారి వివరాలు వరుసగా.. కనుల పండువగా బహుమతి ప్రదానోత్సవం ఏఎన్‌యూ క్రీడా మైదానంలో శుక్రవారం సాయంత్రం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం కనుల పండువగా సాగింది. పతకాన్ని చూసిన ఆనందంలో ప్రతిభచూపిన అథ్లెట్లు ఇన్నాళ్లు పడిన కష్టాలు, కఠోర శ్రమను మర్చిపోయి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండటంతో తొలిరోజు పోటీల విజేతల్లో కొందరికి, రెండో రోజు పోటీల విజేతలకు సాయంత్రం క్రీడా మైదానంలోని వేదిక వద్ద బహుమతులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏఎఫ్ఐ సెక్రటరీ సీకే వల్సన్, ఏపీఏ సెక్రటరీ ఎ.రాఘవేంద్రరావు తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అండర్– 20 విభాగంలో.. బాలికల 10000 మీటర్ల నడక : బన్దన సాటిల్ (ఉత్తర్‌ప్రదేశ్), ప్రియాంక పాటిల్ (ఉత్తరప్రదేశ్), సోనాల్ శుక్లా (రాజస్థాన్). బాలుర 110 మీటర్ల హర్డిల్స్ : సచిన్ బిను (కేరళ), కూనాల్ చౌదరి (ఢిల్లీ), జి.గోపీచంద్ (ఆంధ్రప్రదేశ్). బాలికల 100 మీటర్ల హర్డిల్స్ : సప్నాకుమారి (జార్ఖండ్), ఆర్.నిత్య (తమిళనాడు), రిత్విక్ సింగ్ (ఉత్తరప్రదేశ్). బాలికల పోల్‌వాల్ట్ : అర్షా బాబు (కేరళ), అన్జలి ఫ్రాన్సిస్ సి (కేరళ), ప్రీతిక (తమిళనాడు ). బాలికల జావలిన్‌త్రో : మౌనిక (హరియాణ), రున్‌జున్ పేగు (అసోం), కవితా గోస్వామి (ఢిల్లీ). అండర్–18 విభాగంలో.. బాలుర హేమర్‌త్రో : దమీన్నత్ సింగ్ (ఏఎఫ్ఐ, పంజాబ్), నితీష్ పూనియా (రాజస్థాన్), అలీముద్దీన్ (ఉత్తరప్రదేశ్). బాలుర 10000 మీటర్ల నడక : సంజయ్ కుమార్ (హరియాణ), అదీప్ సింగ్ (ఏఎఫ్ఐ పంజాబ్), సూరజ్ పన్వార్ (ఉత్తరప్రదేశ్). బాలికల 100 మీటర్ల హర్డిల్స్ : అపర్ణారాయ్ (కేరళ), ప్రతిభాకుమారి (జార్ఖండ్), అంజల్య థోమాస్ (కేరళ). బాలుర 110 మీటర్ల హర్డిల్స్ : పున్గా సోరెన్ (ఒడిస్సా), అభిషేక్ యూబీ (మహారాష్ట్ర), సత్యం మిశ్రా (ఉత్తరప్రదేశ్). బాలికల జావలిన్‌త్రో : ఎన్.హేమమాలిని (తమిళనాడు), అంజని కుమారి (బిహార్), ప్రియాంకా తోప్పో (ఒడిస్సా). బాలుర లాంగ్‌జంప్ : లోకేష్ ఎస్ (కర్ణాటక), గోవింద్ కుమార్ (ఉత్తరప్రదేశ్), రిషాబ్ రిషీశ్వర్ (ఉత్తరప్రదేశ్). బాలుర షాట్‌పుట్ : దీపేందర్ దబాస్ (హరియాణ), సత్యావాన్ (హరియాణ), హర్జోత్ సింగ్ (ఏఎఫ్ఐ). అండర్–16 విభాగంలో.. బాలుర హేమర్‌త్రో : విపిన్ కుమార్ (ఉత్తరప్రదేశ్), సామ్సూల్ ఇర్ఫాన్ (ఉత్తరప్రదేశ్), ప్రశాంత్ త్రివేది (గుజరాత్). బాలుర జావలిన్‌త్రో : వికాస్ యాదవ్ (మహారాష్ట్ర), సన్దీప్ (హరియాణ), దేవ్‌రాజ్ (రాజస్థాన్). బాలుర 100 మీటర్ల హర్డిల్స్ : ఆదిత్య ప్రకాష్ (జార్ఖండ్), సూర్యజిత్ ఆర్కే (కేరళ), దిబ్యసుందర్దాస్ (పశ్చిమబెంగాల్). బాలికల 600 మీటర్ల పరుగు : గౌతమి (కర్ణాటక), సాక్షి ఫుల్సుందర్ (మహారాష్ట్ర), హర్షిలీన్ కౌర్ (ఉత్తరాఖండ్). బాలుర స్ప్రింట్ (600 డాష్‌లో) : రాబి ఖోరా (ఒడిస్సా), రితేష్ ఓరే (ఏఎఫ్ఐ), గౌరవ్ యాదవ్ (ఏఎఫ్ఐ). హరియాణ అథ్లెట్ల హవా నేషనల్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొదటి, రెండో రోజు జరిగిన పోటీల్లో హరియాణ రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు హవా ప్రదర్శించారు. శుక్రవారం సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో హరియాణ అథ్లెట్లు పలు క్రీడాంశాల్లో మొత్తం 18 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. వీరు మొదటి స్థానాలు 8, ద్వితీయ స్థానాలు 5, తృతీయ స్థానాలు 5 సాధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వివిధ క్రీడాంశాల్లో మొత్తం 14 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. వీరు పతకాల్లో మూడు మొదటి స్థానాలు, 7 ద్వితీయ స్థానాలు, 4 తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇటీవల ఏఎన్‌యూ వేదికగా జరిగిన సీనియర్ నేషనల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేరళ అథ్లెట్లు ప్రస్తుతం జరుగుతున్న జూనియర్ నేషనల్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో కొంత వెనుకబడ్డారు. వివిధ అథ్లెటిక్ అంశాల్లో మొత్తం 12 పతకాలను కేరళ రాష్ట్రం సాధించింది. వీటిలో 5 మొదటి బహుమతులు, 5 ద్వితీయ బహుమతులు, 2 తృతీయ బహుమతులు ఉన్నాయి. ప్రేక్షకుల ప్రోత్సాహం అదుర్స్ రెండో రోజు పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఏఎన్‌యూ సింథటిక్ ట్రాక్ వెలుపల ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని అథ్లెట్లను చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రేక్షకుల చప్పట్లు అథ్లెట్లకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. గెలుపొందిన అథ్లెట్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు సహచర క్రీడాకారులు, ప్రేక్షకులు పోటీపడ్డారు. -
‘ఉత్తమ అథ్లెట్’ సత్యవాన్
ముగిసిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అండర్-14 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన సత్యవాన్ ‘ఉత్తమ అథ్లెట్’గా ఎంపికయ్యాడు. అతను షాట్‌పుట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో కేరళ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అండర్-14 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు టీమ్ టైటిల్ దక్కింది. చివరిరోజు జరిగిన అండర్-20 బాల, బాలికల 4ఁ400 మీటర్ల రిలేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఎనిమిది అంశాల్లో కొత్త జాతీయ రికార్డులు నమోదయ్యాయి. -
మనోళ్లకు మూడు పతకాలు
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్లకు కలిపి మూడు పతకాలు లభించాయి. అండర్-14 బాలుర హైజంప్‌లో ఎస్.రవీంద్ర రెడ్డి (ఆంధ్రప్రదేశ్) కాంస్యం సాధించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వరుణ్ (1.86 మీటర్లు) జాతీయ రికార్డు నమోదు చేశాడు. 2011లో మహారాష్ట్రకు చెందిన అనిల్ (1.85 మీటర్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అనిల్ (హరియాణా-1.71 మీటర్లు)కు రజతం దక్కింది. అండర్-20 బాలికల 4ఁ100 మీటర్ల రిలేలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు కాంస్యం లభించింది. అండర్-16 బాలికల 1000 మీటర్ల స్ప్రింట్ మిడ్లే రిలేలో తెలంగాణ జట్టు కాంస్య పతకం నెగ్గింది. -
తొలి రోజు నాలుగు పతకాలు
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్లు బోణీ చేశారు. స్వర్ణం, రజతంతో పాటు రెండు కాంస్య పతకాలు సాధించారు. అండర్-14 బాలికల హైజంప్‌లో కేరళకు చెందిన గాయత్రి శివకుమార్ 1.61 మీటర్లు ఎత్తు ఎగిరి; అండర్-16 బాలుర 1000 మీటర్లలో హరియాణాకు చెందిన బియాంత్ సింగ్ (2ని:27:8సెకన్లు) కొత్త జాతీయ రికార్డులు నెలకొల్పారు. అండర్-14 బాలుర ట్రయాథ్లాన్లో కడప స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన పి.వివేకానంద రెడ్డి స్వర్ణ పతకం సాధించగా... ఎ. కోటేశ్వరావు (ఏపీ) 1766 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. అండర్ -14 లాంగ్‌జంప్‌లో ఎ.కోటేశ్వరరావు (ఏపీ-5.94 మీటర్లు), పి.పాండు నాయక్ (తెలంగాణ-5.91 మీటర్లు) రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ జట్టు 25 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. -
నేటి నుంచి విజయవాడలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బుధవారం నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరుగుతాయి. 26 రాష్ట్రాల నుంచి సుమారు 3వేల మంది జూనియర్ బాలబాలికలు బరిలోకి దిగుతున్నారు. 30వ తేదీ వరకు 150 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. జూనియర్ ఏషియాడ్, జూనియర్ కామన్వెల్త్ మీట్లకు ఈ పోటీల ద్వారా అథ్లెట్లను ఎంపిక చేస్తారు.