రాంచీ రేస్ వాక్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన క్షణాలు
‘‘ఒలింపిక్స్ అన్న మాటే నా ఆలోచనల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లోనే ఆడబోతున్నాను’’. ఫిబ్రవరి 13 న రాంచీలో జరిగిన రేస్ వాకింగ్ జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, ఒలింపిక్స్‌కి అర్హత పొందిన ప్రియాంక గోస్వామి (24) అన్న మాట ఇది!! నిజమే, ఆమె కుటుంబ పరిస్థితులు కూడా అటువంటివే! చదువే భారమైనప్పుడు ఆటలు, ఆటల పోటీలు, ఒలింపిక్స్.. ఇవన్నీ ఊహకైనా సాధ్యమయేవేనా! అయ్యాయి. అందుకు ముగ్గురు వ్యక్తులు కారణం. తల్లి, తండ్రి, కోచ్. ‘‘ఈ ముగ్గురూ స్పోర్ట్స్‌లో నాకొక అందమైన భవిష్యత్తును ప్రసాదించారు. వారు చూస్తుండగా ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాను’’ అని సంబరంగా అంటున్న ప్రియాంక ప్రస్తుతం టోక్యోలో జూలైలో జరిగే ఒలింపిక్స్‌కి సాధన చేస్తోంది.
ప్రియాంక ఈ ఫిబ్రవరిలో 1:28:45 నిముషాలలో 20 కి.మీ. రేస్ వాక్‌లో లక్ష్యాన్ని సాధించి, విజేతగా నిలిచినప్పటి నుంచీ రానున్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు ఆమె ఒక పసిడి ఆశ అయింది. ప్రియాంక ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి. ఆమె తండ్రి మదన్ పాల్ ప్రభుత్వ రవాణా శాఖలో బస్ కండక్టర్. వాళ్లుండే ముజఫర్‌నగర్ బుధాన ప్రాంతంలోని సాగడి గ్రామం నుంచి ఉద్యోగం కోసం భార్యాబిడ్డలతో మీరట్ వచ్చేశారు ఆయన. ప్రియాంక పెద్దమ్మాయి. ఆమె తమ్ముడు కపిల్. తల్లి అనిత గృహిణి. డ్యూటీలో ఉండగా ఒక రోడ్డు ప్రమాదం కేసులో బస్ డ్రైవర్ తో పాటు, ప్రియాంక తండ్రి ఉద్యోగం కూడా పోయింది. ఆర్థికంగా అసలే అంతంత మాత్రం అయిన ఆ కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోయింది. అయితే బిడ్డల చదువు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని తీర్మానించుకున్నారా భార్యాభర్తలు.
మదన్‌పాల్ టాక్సీ అద్దెకు తీసుకుని నడిపాడు. భార్య చేత చిన్న కిరాణా దుకాణం పెట్టించాడు. పిండి మర ఆడించాడు. స్కూలు లేనప్పుడు పిల్లలిద్దరూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకునేవారు. ప్రియాంక మీరట్‌లోని కనోహర్‌లాల్ గర్ల్స్ స్కూల్లో చదివింది. పాటియాలలో బి.ఎ. పూర్తి చేసింది. బి.ఎ. చదువుతున్నప్పుడే ఆమె రేస్ వాక్‌ను తనకు ఇష్టమైన క్రీడాంశం గా ఎంచుకుని ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో తండ్రి పంపించిన డబ్బుతోనే సర్దుకునేది. నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పంపేవారు ఆయన. వాటిల్లోనే కొంత మిగుల్చుకుని మిగతా ఖర్చులకు వాడుకునేది. అందుకోసం తరచు ఆమె ఒక పూట మాత్రమే భోజనం చేసింది.
2011లో రేస్ వాక్‌లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాక ఆ ఈవెంట్‌పై మరింత శ్రద్ధ పెట్టింది ప్రియాంక. ఆమె తమ్ముడు కూడా స్పోర్ట్స్‌మనే. స్టేట్ లెవల్ బాక్సింగ్ ప్లేయర్. మీరట్‌లో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2014–15లో ప్రియాంక డిగ్రీ అయ్యాక ఆమెకు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉచితంగా శిక్షణ లభించడానికి ఆమె కోచ్ గౌరవ్ త్యాగి చేసిన ప్రయత్నాలే కారణం. 2018లో ప్రియాంకకు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చాక ఆ కుటుంబ పరిస్థితి కాస్త మెరుగైంది. ‘‘స్కూల్లో ఉన్నప్పుడే నాన్న నాకు అప్పు చేసి స్కూటీ కొనిచ్చాడు. దానిపై స్కూలుకూ, స్టేడియంలో ప్రాక్టీస్‌కీ వెళ్లేదాన్ని. పరీక్షలు, స్పోర్ట్ ఈవెంట్‌లు ఉన్నప్పుడు ఆమ్మ నిద్ర మానుకుని మరీ నాకోసం అన్నీ అమర్చిపెట్టే పనిలో ఉండేది. ఇక నా కోచ్ త్యాగి సర్ అయితే నా శిక్షణ కోసం చాలా కష్టపడ్డారు. వారందరి వల్లే నేను ఈ రోజు ఒలింపిక్స్‌కి అర్హత సాధించాను’’ అని ప్రియాంక చెబుతోంది. స్కూల్లో ఉండగా ప్రియాంకకు క్రీడల్లో అసక్తికరమైన అంశం జిమ్నాస్టిక్స్. కొంతకాలం తర్వాత అథ్లెటిక్స్ వైపు వచ్చింది. డిగ్రీ అయ్యాక రేస్ వాకింగ్‌పై ఇష్టం పెంచుకుంది. ఫ్యాషన్ మోడలింగ్ కూడా ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment