3000 మీ. రేస్ వాక్ విజేతలతో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి
గచ్చిబౌలి: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అథ్లెట్ ఎన్. శ్రేష్ట సత్తాచాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఈ టోర్నీలో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్–16 బాలికల 3000 మీటర్ల రేస్‌వాక్ ఈవెంట్‌ను శ్రేష్ట 21 నిమిషాల 9.9 సెకన్లలో పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌లో మహబూబ్‌నగర్‌కు చెందిన వి.సంధ్య (21ని.35.9సె.), ఆదిలాబాద్‌కు చెందిన ఎం.భవాని (22ని.20.2సె) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు.
పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సింథటిక్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి స్థాయి నుంచే క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోచ్ రమేష్, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి కె. రంగారావు, రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభు కుమార్‌గౌడ్, సారంగ పాణి, స్టాన్లీ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
అండర్–16 బాలుర 5000మీ. రేస్‌వాక్: 1. కె. దుర్గారావు (వరంగల్), 2. టి. రవి సాగర్ (కరీంనగర్), 3. ఎ. రాహుల్ (ఆదిలాబాద్). అండర్–18 బాలుర 10000మీ. రేస్‌వాక్: 1. రాజ్ మిశ్రా (హైదరాబాద్), 2. రాజ హరి (కరీంనగర్), 3. వినయ్ కుమార్ (రంగారెడ్డి). అండర్–18 బాలికల 5000మీ. రేస్‌వాక్: 1. వర్ష (రంగారెడ్డి), 2. ఆర్. సంఘవి (కరీంనగర్).