Raga Reddy
-
‘రియల్’ మాయ
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి) : మండల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. అయినా సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదో తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి మమ అనిపిస్తున్నారు. వీటిని అదుపు చేయడానికి పటిష్ట ప్రణాళిక చేపట్టకపోవడంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా అక్రమ వెంచర్లను కట్టడి చేయడానికి హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో మినహా మిగతా వాటిల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇటీవల ఆదేశాలు సైతం జారీ చేసింది. ఆ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో మళ్లీ యధావిధిగా అక్రమ వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూ మూడు ప్లాట్లు, ఆరు వెంచర్లుగా లాభాలు ఆర్జిస్తున్నారు. జోన్లతో సమస్య.... కందుకూరు మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటంతో పాటు అధిక ప్రాంతాలు కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి సాధ్యం కాదు. దీంతో పాత తేదీల్లో అనుమతులు తీసుకుని జీపీ లేఅవుట్లకు తెరలేపారు. రహదారులు, డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా, పార్కు స్థలం వంటివి వదలకుండానే ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వం హెచ్ఎండీఏ, డీటీసీపీ మినహా మిగతా లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీచేసినా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గతంలో 2015 ఆగస్టు నెల వరకు కటాఫ్ తేదీ నిర్ణయించి ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. ఆ తేదీ ముందు రిజిస్ట్రేషన్లు అయి ఉన్న ప్లాట్లను కొనుగోలు చేస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత చేసిన వెంచర్లలో కొనుగోలు చేస్తే అక్రమంగానే నిర్ధారిస్తారు అధికారులు. ఫాంల్యాండ్ పేరుతో.... కాగా లేఅవుట్లు చేస్తే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడం, కూల్చివేతలు చేపట్టడంతో ఫాం ల్యాండ్ పేరుతో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంల్యాండ్ లేఅవుట్‌కు ఎవరి నుంచి అనుమతి అవసరం లేకపోవడంతో చాలా గ్రామాల పరిధిలో ప్రస్తుతం ఇవే తరహా లేఅవుట్లు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు. ఫాంల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేసినా రహదారులు వంటి వాటిని అభివృద్ధి చేయకూడదు. కాని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి అందంగా తీర్చిదిద్ది ఫాంల్యాండ్ వెంచర్లలో గుంటలుగా విభజించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు... కాగా హెచ్ఎండీఏ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి కూల్చివేతలు చేసి మమ అనిపిస్తున్నారు. పటిష్టంగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, హెచ్ఎండీఏ శాఖలు సమన్వయంతో అక్రమ లేఅవుట్లను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
కొత్తగా 49 పీహెచ్‌సీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పట్టణ ప్రజలకు శుభవార్త. త్వరలో పట్టణ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు అరకొర ఆస్పత్రులతోనే నెట్టుకొస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ.. అర్బన్ ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు సమాయత్తమైంది. అందులో భాగంగా జిల్లాలో కొత్తగా 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని పట్టణ మండలాలతోపాటు జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు.. కొత్తగా ఏర్పాటైన బడంగ్పేట్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీల పరిధిలోని ప్రజలకు ఈ సేవలందనున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 48 పీహెచ్‌సీలు కొనసాగుతున్నాయి. వీటికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి నిర్వహణ నిధులు విడుదలవుతున్నాయి. అయితే కొత్తగా పట్టణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 50 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చొప్పున.. జిల్లాలో సుమారు 49 పీహెచ్‌సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా వీటి పరిధిలో మరో 450 ఉప కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వ రలో ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే సేవలు అం దుబాటులోకి రానున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. -
సరిహద్దుల్లో..‘గ్యాస్’ దందా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా :సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నగదు బదిలీ విధానం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ముందుగా వంటగ్యాస్ సిలిండర్ల రాయితీ నిధులను నేరుగా వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది. దీంతో జిల్లాలో సిలిండర్ల అక్రమ వినియోగానికి కొంత చెక్ పడింది. అయితే ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న ఇతర జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు వంటగ్యాస్ సిలిండర్ల అక్రమ సరఫరాకు తెరలేపారు. సరిహద్దు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమల్లోకి రాకపోవడంతో అక్కడినుంచి పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు జిల్లాకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అలా తెచ్చి.. ఇలా విక్రయించి... సెప్టెంబర్ నెల నుంచి జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్లపై నగదు బదిలీ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వినియోగదారుడు సిలిండర్‌కు రూ.1,096 చెల్లిస్తే.. రాయితీ డబ్బులను వినియోగదారుని వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. అయితే జిల్లాలో డెలివరీ చార్జీ కలుపుకుని ఒక్కో సిలిండర్‌కు రూ. 1,130 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య(కమర్షియల్) సిలిండర్‌కు రూ.1,900 వరకు వసూలు చేస్తున్నారు. అయితే సమీప జిల్లాల్లోని కొందరు మధ్యవర్తులు జోరుగా వంటగ్యాస్ సిలిండర్లను అక్కడినుంచి తీసుకొచ్చి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇందులో అధికంగా వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు సమాచారం. ఒక్కో సిలిండర్‌ను కనిష్టంగా రూ.1,300 వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు యాచారం మండలం మాల్లో దాదాపు ఇరవై సిలిండర్లు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ సిలిండర్లు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందినవని అధికారులు భావిస్తున్నారు. శివారులో జోరుగా... జిల్లాలోని శివారు మండలాల్లో అక్రమ సిలిండర్ల వ్యాపారం జోరుగా నడుస్తోంది. మేడ్చల్, ఇబ్రహీంపట్నం, యాచారం, హయత్‌నగర్, ఘట్కేసర్ తదితర మండలాల్లో వంటగ్యాస్ సిలిండర్లు అక్రమంగా విక్రయిస్తున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న సమీప జిల్లాల్లోని మండలాల్లో ఎక్కువగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలే ఉన్నాయి. దీంతో అక్కడ సిలిండర్ల వినియోగం ఏటా 9కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దీంతో ఆయా జిల్లాల నుంచి భారీగా గ్యాస్ సిలిండర్లను శివారు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిద్రావస్థలో నిఘా... సిలిండర్ల సరఫరాపై నిఘా కొరవడింది. ప్రత్యేకించి జిల్లా పౌరసరఫరాల శాఖలో నిఘా విభాగం ఉన్నప్పటికీ అక్రమాలపై దృష్టి సారించడంలో విఫలమవుతోంది. ప్రజల నుంచి అడపాదడపా వచ్చే ఫిర్యాదులపై అప్పటికప్పుడు స్పందించడం తప్ప ప్రత్యేక డైవ్ నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
గతుకుల రోడ్లకిక చెక్..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గతుకుల రోడ్లపై ప్రయాణికుల అవస్థలకు త్వరలో చెక్ పడనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.19.50కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గురువారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో రోడ్ల మరమ్మతులకు విడుదలైన నిధుల వివరాలను మంత్రి వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలైన చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, పరిగి, వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం పరిధిలో 37 ప్రాంతాల్లో పనులకు గాను రూ.19.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. చాలా కాలం నుంచి జిల్లాలో గ్రామీణ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తాజాగా రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరైనందున పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో విలీనం కానివ్వం... జిల్లాలో ఇటీవల 35 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని, మరోవైపు న్యాయస్థానం కూడా విలీనాన్ని రద్దు చేయడం శుభపరిణామమని మంత్రి ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మళ్లీ విలీనం చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ తాను మాత్రం వ్యతిరేకించి తీరుతానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రెండ్రోజుల క్రితం జరిగిన పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రుల సమావేశంలోనూ తేల్చి చెప్పానన్నారు. 35 పంచాయతీల పరిధిలోని నేతలతో కలిసి రెండ్రోజుల్లో మళ్లీ పంచాయతీరాజ్ శాఖ మంత్రితో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని వివరించనున్నట్లు చెప్పారు.