కొత్తగా 49 పీహెచ్‌సీలు
Published Mon, Oct 21 2013 3:24 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పట్టణ ప్రజలకు శుభవార్త. త్వరలో పట్టణ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు అరకొర ఆస్పత్రులతోనే నెట్టుకొస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ.. అర్బన్ ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు సమాయత్తమైంది. అందులో భాగంగా జిల్లాలో కొత్తగా 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
దీంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని పట్టణ మండలాలతోపాటు జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు.. కొత్తగా ఏర్పాటైన బడంగ్‌పేట్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీల పరిధిలోని ప్రజలకు ఈ సేవలందనున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 48 పీహెచ్‌సీలు కొనసాగుతున్నాయి. వీటికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి నిర్వహణ నిధులు విడుదలవుతున్నాయి.
అయితే కొత్తగా పట్టణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 50 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చొప్పున.. జిల్లాలో సుమారు 49 పీహెచ్‌సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా వీటి పరిధిలో మరో 450 ఉప కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వ రలో ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే సేవలు అం దుబాటులోకి రానున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement