సరిహద్దుల్లో..‘గ్యాస్’ దందా!
Published Thu, Oct 17 2013 12:27 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా :సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నగదు బదిలీ విధానం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ముందుగా వంటగ్యాస్ సిలిండర్ల రాయితీ నిధులను నేరుగా వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది. దీంతో జిల్లాలో సిలిండర్ల అక్రమ వినియోగానికి కొంత చెక్ పడింది. అయితే ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న ఇతర జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు వంటగ్యాస్ సిలిండర్ల అక్రమ సరఫరాకు తెరలేపారు. సరిహద్దు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమల్లోకి రాకపోవడంతో అక్కడినుంచి పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు జిల్లాకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
అలా తెచ్చి.. ఇలా విక్రయించి...
సెప్టెంబర్ నెల నుంచి జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్లపై నగదు బదిలీ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వినియోగదారుడు సిలిండర్‌కు రూ.1,096 చెల్లిస్తే.. రాయితీ డబ్బులను వినియోగదారుని వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. అయితే జిల్లాలో డెలివరీ చార్జీ కలుపుకుని ఒక్కో సిలిండర్‌కు రూ. 1,130 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య(కమర్షియల్) సిలిండర్‌కు రూ.1,900 వరకు వసూలు చేస్తున్నారు. అయితే సమీప జిల్లాల్లోని కొందరు మధ్యవర్తులు జోరుగా వంటగ్యాస్ సిలిండర్లను అక్కడినుంచి తీసుకొచ్చి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇందులో అధికంగా వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు సమాచారం. ఒక్కో సిలిండర్‌ను కనిష్టంగా రూ.1,300 వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు యాచారం మండలం మాల్‌లో దాదాపు ఇరవై సిలిండర్లు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ సిలిండర్లు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందినవని అధికారులు భావిస్తున్నారు.
శివారులో జోరుగా...
జిల్లాలోని శివారు మండలాల్లో అక్రమ సిలిండర్ల వ్యాపారం జోరుగా నడుస్తోంది. మేడ్చల్, ఇబ్రహీంపట్నం, యాచారం, హయత్‌నగర్, ఘట్‌కేసర్ తదితర మండలాల్లో వంటగ్యాస్ సిలిండర్లు అక్రమంగా విక్రయిస్తున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న సమీప జిల్లాల్లోని మండలాల్లో ఎక్కువగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలే ఉన్నాయి. దీంతో అక్కడ సిలిండర్ల వినియోగం ఏటా 9కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దీంతో ఆయా జిల్లాల నుంచి భారీగా గ్యాస్ సిలిండర్లను శివారు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
నిద్రావస్థలో నిఘా...
సిలిండర్ల సరఫరాపై నిఘా కొరవడింది. ప్రత్యేకించి జిల్లా పౌరసరఫరాల శాఖలో నిఘా విభాగం ఉన్నప్పటికీ అక్రమాలపై దృష్టి సారించడంలో విఫలమవుతోంది. ప్రజల నుంచి అడపాదడపా వచ్చే ఫిర్యాదులపై అప్పటికప్పుడు స్పందించడం తప్ప ప్రత్యేక డైవ్ నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
Advertisement