బైరాగిగూడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాంల్యాండ్ వెంచర్
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి) : మండల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. అయినా సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదో తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి మమ అనిపిస్తున్నారు. వీటిని అదుపు చేయడానికి పటిష్ట ప్రణాళిక చేపట్టకపోవడంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా అక్రమ వెంచర్లను కట్టడి చేయడానికి హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో మినహా మిగతా వాటిల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇటీవల ఆదేశాలు సైతం జారీ చేసింది. ఆ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో మళ్లీ యధావిధిగా అక్రమ వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూ మూడు ప్లాట్లు, ఆరు వెంచర్లుగా లాభాలు ఆర్జిస్తున్నారు.
జోన్లతో సమస్య....
కందుకూరు మండలం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండటంతో పాటు అధిక ప్రాంతాలు కన్జర్వేషన్ జోన్‌లో ఉన్నాయి. దీంతో హెచ్‌ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి సాధ్యం కాదు. దీంతో పాత తేదీల్లో అనుమతులు తీసుకుని జీపీ లేఅవుట్లకు తెరలేపారు. రహదారులు, డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా, పార్కు స్థలం వంటివి వదలకుండానే ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వం హెచ్‌ఎండీఏ, డీటీసీపీ మినహా మిగతా లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీచేసినా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గతంలో 2015 ఆగస్టు నెల వరకు కటాఫ్ తేదీ నిర్ణయించి ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. ఆ తేదీ ముందు రిజిస్ట్రేషన్లు అయి ఉన్న ప్లాట్లను కొనుగోలు చేస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత చేసిన వెంచర్లలో కొనుగోలు చేస్తే అక్రమంగానే నిర్ధారిస్తారు అధికారులు.
ఫాంల్యాండ్ పేరుతో....
కాగా లేఅవుట్లు చేస్తే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు రావడం, కూల్చివేతలు చేపట్టడంతో ఫాం ల్యాండ్ పేరుతో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫాంల్యాండ్ లేఅవుట్‌కు ఎవరి నుంచి అనుమతి అవసరం లేకపోవడంతో చాలా గ్రామాల పరిధిలో ప్రస్తుతం ఇవే తరహా లేఅవుట్లు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు. ఫాంల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేసినా రహదారులు వంటి వాటిని అభివృద్ధి చేయకూడదు. కాని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి అందంగా తీర్చిదిద్ది ఫాంల్యాండ్ వెంచర్లలో గుంటలుగా విభజించి గజాల చొప్పున విక్రయిస్తున్నారు.
తూతూ మంత్రంగా కూల్చివేతలు...
కాగా హెచ్‌ఎండీఏ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి కూల్చివేతలు చేసి మమ అనిపిస్తున్నారు. పటిష్టంగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, హెచ్‌ఎండీఏ శాఖలు సమన్వయంతో అక్రమ లేఅవుట్లను నివారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment