గతుకుల రోడ్లకిక చెక్..
Published Thu, Oct 3 2013 11:39 PM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గతుకుల రోడ్లపై ప్రయాణికుల అవస్థలకు త్వరలో చెక్ పడనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.19.50కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గురువారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో రోడ్ల మరమ్మతులకు విడుదలైన నిధుల వివరాలను మంత్రి వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలైన చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, పరిగి, వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం పరిధిలో 37 ప్రాంతాల్లో పనులకు గాను రూ.19.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. చాలా కాలం నుంచి జిల్లాలో గ్రామీణ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తాజాగా రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరైనందున పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రేటర్‌లో విలీనం కానివ్వం...
జిల్లాలో ఇటీవల 35 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని, మరోవైపు న్యాయస్థానం కూడా విలీనాన్ని రద్దు చేయడం శుభపరిణామమని మంత్రి ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మళ్లీ విలీనం చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ తాను మాత్రం వ్యతిరేకించి తీరుతానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రెండ్రోజుల క్రితం జరిగిన పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రుల సమావేశంలోనూ తేల్చి చెప్పానన్నారు.
35 పంచాయతీల పరిధిలోని నేతలతో కలిసి రెండ్రోజుల్లో మళ్లీ పంచాయతీరాజ్ శాఖ మంత్రితో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని వివరించనున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement