raghuvera reddy
-
మా నాన్న సీఎం అయితే..
సాక్షి, నల్గొండ: కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ చెప్పలేదని మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి అన్నారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నానని, ఈసారి తనకు టికెట్ కచ్చితంగా దక్కుతుందన్న నమ్మకం ఉందన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తన తండ్రి సీఎం కావడం కన్నా ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. కాగా, మిర్యాలగూడలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జానారెడ్డి, పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
'ఆ రెండు బిల్లులను తిరస్కరించండి'
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన ప్రైవేట్ వర్సిటీల బిల్లు, రాజధాని భూములను 99 ఏళ్ల పాటు లీజ్ కు ఇచ్చే బిల్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆ బిల్లులను తిరస్కరించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు రఘువీరా లేఖ రాశారు. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసేలా చంద్రబాబు సర్కారు ప్రైవేటు వర్సిటీలను తెస్తోందని రఘువీరా ఆ లేఖలో పేర్కొన్నారు. రాజధాని భూములను విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే ఆ బిల్లును అసెంబ్లీలో హడావుడిగా ఆమోదం పొందేలా చేశారన్నారు. రాష్ట్రం ప్రయోజనాలను విఘాతం కల్గించేలా ఉన్న ఆ రెండు బిల్లులను నిలుపుదల చేయాలని గవర్నర్ కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. -
'సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కార మార్గం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కార మార్గమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు చార్జిషీట్ లో 22 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం తీవ్రమైన అంశంగానే పరిగణించవచ్చన్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ కోసం కేంద్రాన్ని కోరాలని ఆయన పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రెండు రాష్ట్రాల సీఎంలు నిజాయితీగా వ్యవహరిస్తారన్నవిశ్వాసం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటుకు కోట్లు కేసులో విచారన కోసం కేంద్రాన్ని అడగక తప్పదని రఘువీరా పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి నష్టం జరింగదని కాంగ్రెస్ ను తిడుతూ కాలయాపన చేస్తే ప్రజలు హర్షించరన్నారు. ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుని రావాలన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్, విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడటాన్ని చూస్తే.. కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనే విషయం రుజువుతోందన్నారు. కడపలో మంత్రి నారాయణకు చెందిన కాలేజీలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రఘువీరా ప్రశ్నించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఇలాంటి కేసులను మూడు నెలల్లో తేల్చేలాగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడిన వారిని ఉరితీయాలన్నారు. ప్రధాని బీహార్ ప్రకటించిన ప్యాకేజీని ఎవరూ నమ్మరని , అది ఎన్నికల డ్రామా అని రఘువీరా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీహార్ ప్యాకేజీ అమలవుతుందని ఆశించవచ్చన్నారు.