'సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కార మార్గం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కార మార్గమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు చార్జిషీట్ లో 22 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం తీవ్రమైన అంశంగానే పరిగణించవచ్చన్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ కోసం కేంద్రాన్ని కోరాలని ఆయన పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రెండు రాష్ట్రాల సీఎంలు నిజాయితీగా వ్యవహరిస్తారన్నవిశ్వాసం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటుకు కోట్లు కేసులో విచారన కోసం కేంద్రాన్ని అడగక తప్పదని రఘువీరా పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనతో ఏపీకి నష్టం జరింగదని కాంగ్రెస్ ను తిడుతూ కాలయాపన చేస్తే ప్రజలు హర్షించరన్నారు. ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుని రావాలన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్, విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడటాన్ని చూస్తే.. కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనే విషయం రుజువుతోందన్నారు. కడపలో మంత్రి నారాయణకు చెందిన కాలేజీలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రఘువీరా ప్రశ్నించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఇలాంటి కేసులను మూడు నెలల్లో తేల్చేలాగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడిన వారిని ఉరితీయాలన్నారు. ప్రధాని బీహార్ ప్రకటించిన ప్యాకేజీని ఎవరూ నమ్మరని , అది ఎన్నికల డ్రామా అని రఘువీరా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీహార్ ప్యాకేజీ అమలవుతుందని ఆశించవచ్చన్నారు.