టీవీ నటి ప్రత్యూష కేసులో మరో మిస్టరీ
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి కేసు విచారణలో మరో అంశం వెలుగు చూసింది. గతేడాది నవంబర్ నుంచి మార్చి వరకు ప్రత్యూష బ్యాంక్ ఎకౌంట్ నుంచి 24 లక్షల రూపాయలు విత్ డ్రా చేసినట్టు ముంబైలోని బంగుర్ నగర్ పోలీసులు గుర్తించారు. కాగా ఈ డబ్బు ఎవరు తీశారన్నది మిస్టరీగా మారింది.
ప్రత్యూష కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆమె ఎకౌంట్లో డబ్బులు లేవని, ఈ డబ్బు ఎవరు తీశారో తమకు తెలియదని చెప్పినట్టు పోలీసు వర్గాలు చెప్పాయి. ప్రత్యూష బ్యాంక్ ఎకౌంట్ వివరాలను పరిశీలించిన పోలీసులు డబ్బు మాయమైన విషయాన్ని గుర్తించారు. ఈ డబ్బును ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ విత్ డ్రా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యూష రియాల్టీ షోల్లో పాల్గొనడం ద్వారా ఈ డబ్బును సంపాదించింది. ప్రత్యూష ఇతర బ్యాంక్ ఎకౌంట్ల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్‌లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సందేహాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌పై కేసు నమోదు చేశారు. ప్రత్యూష మరణించాక షాక్‌కు గురైన రాహుల్ ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇదివరకే రాహుల్‌ను అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా ప్రశ్నించారు. రాహుల్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసేందుకోసం అతని ఆరోగ్య పరిస్థితి గురించి అభిప్రాయం కోరుతూ వైద్య నివేదికలను జేజే ఆస్పత్రికి పంపారు. జేజే ఆస్పత్రి వైద్యుల నివేదికను బట్టి అతడిని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు నిర్ణయం తీసుకుంటారు.