ఎంతకాలమీ గాలివాటు సాగు?
వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులకు మేలు చేసే దేశవ్యాప్త పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. దీన్ని కచ్చితంగా కరువుతో అనుసంధానం చేయాలి. అంటే వర్షాలు పడక రైతు పంటను పండించలేకపోతే ఈ బీమా పథకం కింద పరిహారం చెల్లించాలి. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు వాడిగా వేడిగా సాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం తీవ్ర పదజాలంతో వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అన్ని లక్ష్మణరేఖలూ చెరిగిపోతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించడం సర్వసాధారణమే అయ్యింది. ఇవి ఒక రకంగా చెడు వార్తలే. ఇంతకన్నా ప్రజలకు సంబంధించిన దుర్వార్త ఒకటుంది. అయితే అది వచ్చే ఎన్నికల ఫలితాల్లో త్రిశంకు సభ ఏర్పడే అవకాశం గురించి కాదు. భవిష్యత్తులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొననున్నాయి. వ్యవసాయ రంగం కరు వు కోరల్లో చిక్కుకోనుండడం ఒక ముందస్తు హెచ్చరికగా భావించాలి. కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 25 శాతం అవకాశం ఉందని, దేశంలోని వాయవ్య, సెంట్రల్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కరువు బారినపడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాలు పడే సమయంలో పసిఫిక్ సముద్రంలోని కెరటాల గుండా ఎల్‌నినో ప్రభావం అవకాశాలు ఉండవని భారతీయ వాతావరణ శాఖ(ఐఎండీ) తోసిపుచ్చినప్పటికీ వచ్చే సీజన్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ఒక ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేసింది. భారత్‌లోని కమోడిటీ మార్కెట్లను దెబ్బతీయడానికే అమెరికా, ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఐఎండీ డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ ఇటీవలే హెచ్చరించారు. ‘‘అమెరికా, ఆస్ట్రేలియా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ప్రచారం చేసే ఇలాంటి వదంతులకు వ్యవసాయ కమోడిటీ, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఆహారధాన్యాలను అక్రమంగా దాచిపెట్టి వాటికి కృత్రిమ కొరత సృష్టిస్తారు. వారి సలహా వినొద్దు.’’ అని ఆయన అన్నారు.
వర్షాభావ పరిస్థితుల గురించి వచ్చిన అంచనాలపై ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ధీమాగా చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏమంటే..... గతంలో ‘స్కైమెట్’ విడుదల చేసిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. 2012లో ఈ సంస్థ 94 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తే 93 శాతం వర్షాలు కురిశాయి. గత ఏడాది కూడా కచ్చితమైన అంచనాలే ఇచ్చింది. ఈ ఏడాదిలో మొత్తానికి 94 శాతం వర్షపాతం నమోదవుతుందని చెప్పడమంటే వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన తగ్గుదల ఉండకపోవచ్చు. అయితే గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, సెంట్రల్ మహారాష్ట్ర, గోవా, కొంకణ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
2009లో 96 శాతం వర్షపాతం దీర్ఘకాలిక సగటుగా నమోదు కావచ్చని భారతీయ వాతావరణ శాఖ అంచనా కట్టింది. కానీ ఇటీవల కాలంలో తీవ్ర క్షామపరిస్థితులను ఆ సంవత్సరంలో చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి కురవాల్సిన దానికన్నా వర్షాలు 23 శాతం తక్కువ కురిశాయి. దీన్ని భారీ లోటుగా గుర్తించాలి. దీని ఫలితంగా వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ముఖ్యంగా వరి ఉత్పత్తి 12 శాతం పడిపోయింది. 2012లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనాలు వెలువడ్డాయి. సాగయ్యే ప్రాంతాల్లోని 70 శాతం విస్తీర్ణంలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి. కానీ 2009 నాటి పరిస్థితితో పోల్చితే అంతటి తీవ్ర దుర్భర పరిస్థితులు మాత్రం లేవు. ఈ ఏడాది 94 శాతం వర్షపాతం నమోదవుతుందని ‘స్కైమెట్’ అంచనాలు వేయడం మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది.
రైతులకు కడగండ్లు
వాతావరణం కూడా కలిసిరాకపోతే సెంట్రల్ ఇండియాలో ఇది రైతులను రెండు రకాలుగా దెబ్బతీస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మార్చిలో వచ్చిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 24 లక్షల ఎకరాలు, మహా రాష్ట్రలో 18 లక్షల ఎకరాల పంట ధ్వంసమయ్యింది. హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,351 కోట్లతో ఒక సహాయ ప్యాకేజీ ప్రకటించింది.
వాతావరణ శాఖ నుంచి పెద్దగా వర్షాలు పడవని హెచ్చరిక వచ్చిదంటే అది కోట్లాది రైతుల నెత్తిన పిడుగు పడినట్టే. ఇప్పటికే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రక్షామ పరిస్థితులతో గ్రామీణరంగంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. రైతులు జీవనాధారం లేక కుంగిపోతారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం రైతులకు ఉపశమనం కలిగించదు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులను ఆదుకునే పంటల బీమా పథకం లేకపోతే ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు.... కరువుకోరల్లో చిక్కుకున్నప్పుడు దారుణంగా బలయ్యేది దేశానికి తిండిపెట్టే అన్నదాతే.
ద్విముఖ వ్యూహం కావాలి
2002, 2004లో కూడా వర్షాలకు కరువే. సాధారణ స్థాయి కన్నా 2002లో వర్షపాతం 22 శాతం తక్కువగానూ, 2004లో వర్షపాతం 17 శాతం తక్కువగానూ నమోదయ్యింది. అయితే 2012 ఆగస్టు వరకూ మహా రాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్‌లో పడకపోయేసరికి ఈ నాలుగు రాష్ట్రాలను కరువు రాష్ట్రాలుగా ప్రకటిం చారు. అయితే ఆగస్టు చివర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో వరదలు కూడా వచ్చాయి. భూగోళ తాపం వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో అన్నదానికి ఇదొక ఉదాహరణ. ఈ పరిస్థితులను నివారించడానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. పర్యావరణానికి హాని కలిగించని విధంగా సహజవనరులను ఉపయోగించుకుంటూనే ఆర్థికాభివృద్ధిని సాధించే విధంగా పెట్టుబడులు పెట్టాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులకు మేలు చేసే దేశవ్యాప్త పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. దీన్ని కచ్చితంగా కరువుతో లింక్ చేయాలి.
అంటే తగిన స్థాయిలో వర్షాలు పడక రైతు పంటను పండించలేకపోతే పంటల బీమా పథకం కింద అతనికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా దీనికి రావాల్సిన ప్రాధాన్యత రావడం లేదు. ఈ దేశ ఆర్థికాభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు ప డక వ్యవసాయోత్పత్తి తగ్గినా, ఇతర కారణాల ప్రభావా న్ని ప్రభుత్వం తగ్గించలేకపోయినా ఆర్థిక వ్యవస్థపై ప్రతి కూల ప్రభావం పడక తప్పదు. ఒకవేళ దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 14 శాతానికి పడిపోయినా అది మ రీ తక్కువగా ఉందని భావించనక్కర్లేదు. సాగు రంగం ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని చెప్పవచ్చు.
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)
విశ్లేషణ దేవీందర్ శర్మ