అన్నయ్యే అన్నీ..
రాజన్న సినిమాలో ‘అమ్మా అవని..’ అంటూ అభినయించిన బాలనటి అనీ అంటే ఆ అన్నకు ప్రాణం. ఎంతలా అంటే ఆ ముద్దుల చెల్లెలు పేరును చేతిపై టాటూ వేయించుకునేంత. అనీ తొమ్మిదో తరగతి చదువుతుంటే.. అన్నయ్య ఆశిష్ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. ఏజ్ గ్యాప్ ఏడేళ్లున్నా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చెల్లెలి వల్లే తమ ఫ్యామిలీకి గుర్తింపు వచ్చిందంటాడు ఆ అన్న. నాకు అన్నీ అన్నయ్యే అంటుంది చెల్లి. అలగడం హాబీగా ఉన్న చెల్లిని ఓదార్చడం అన్నకు ఇష్టం. టీవీలో యాంకర్లను చూసి.. అద్దం ముందు చెల్లెలు చేసే అభినయం మరింత ఇష్టం.
చెల్లెలు గిఫ్ట్‌గా ఇచ్చిన షర్ట్ వేసుకుంటే ఎక్కడ పాడైపోతుందోనని.. బీరువాలో భద్రంగా దాచుకోవడం ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే ఎంతో పరిణ తితో ఆలోచించే అనీ.. తనకు అక్కలా మాట్లాడుతుందని మురిసిపోతూ చెప్తాడు ఆశిష్. నటన తన చెల్లికి దేవుడిచ్చిన వరమని చెబుతున్న ఆశిష్.. అనీ పెద్దయిన తర్వాత మంచి నటిగానో.. యాంకర్గానో స్థిరపడాలని కోరుకుంటున్నాడు. షూటింగ్‌లతో అన్నయ్యను మిస్సయినా.. ఆయన పంచే అనురాగాన్ని మాత్రం మిస్సయ్యేది లేదంటోంది అనీ. రాఖీ పండుగ రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి రావడం బాధగా ఉంటుందని చెబుతోంది. ‘ఆ రోజు అన్నయ్య నిద్ర లేవక ముందే చేతికి రాఖీ కట్టి ముద్దు పెట్టి షూటింగ్‌కు వెళ్లిపోతాను. నేను షూటింగ్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి మరీ అన్నయ్య మంచి గిఫ్ట్ ఇస్తాడు’ అని ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అనీ మనముందుంచింది.