కలుషిత ఆహారంతో..200 మంది విద్యార్థులకు అస్వస్థత
ఐదుగురికి ఐసీయూలో చికిత్స
యాజమాన్యంపై కేసు నమోదు
ఉప్పల్/ బోడుప్పల్, న్యూస్‌లైన్: ఓ ప్రవేటు కళాశాల హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న 200 మంది ఇంటర్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స కోసం కళాశాల యజమాన్యం స్థానిక ఆస్పత్రులకు తరలించింది. కాగా, ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండంతో ఐసీయూకి తరలించారు. ఈ ఘటనకు సంబందించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌లోని శ్రీ రాజరాజేశ్వరి ఎడుకేషనల్ అకాడమి(ఎస్.ఆర్.జూనియర్ కళాశాల)కి బోడుప్పల్ పరిధిలో నాలుగు శాఖలున్నాయి.
బృందావన్ కాలనీలోని శాఖలో 600 మంది బాలికలు, అన్నపూర్ణాకాలనీలోని శాఖలో 700 మంది బాలురు ఇంటర్ చదువుతన్నారు. మల్లాపూర్‌లో ఉన్న హాస్టల్లో వంటలు వండి మిగతా హాస్టల్స్‌కు అందజేస్తారు. కాగా, పై రెండు హాస్టళ్ల విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో పాలకూర పప్పు, పెరుగు, రసంతో భోజనం చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యార్థులకు కడుపు నొప్పి ప్రారంభమై వాంతులు, విరేచనాలతో కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం విద్యార్థులును స్థానిక స్పార్క్, అపెక్స్ హాస్పిటల్స్, ఉప్పల్‌లోని ఆదిత్య అస్పత్రులకు తరలించింది.
ఉప్పల్ ఆదిత్యలోనే 139 మంది విద్యార్థులు చికిత్స పొందు తున్నారు. ఇందులో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమించడంతో అత్యవసర సేవలు అందిస్తున్నట్టు డా.సునీల్ వెల్లడించారు. ప్రాణహాని లేనప్పటికీ కొన్ని గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు.
యజమాన్యంపై కేసు నమోదు: ఏసీపీ
కలుషిత ఆహారం అందించి విద్యార్థుల అస్వస్థకు కారణమైన కళాశాల యజమాన్యంపై కేసులు నమోదు చేసినట్లు మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య తెలిపారు. ఆహారాన్ని ల్యాబ్‌కు పంపి వచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మేడిపల్లి సీఐ రవికిరణ్‌రెడ్డి, ఉప్పల్ సీఐ అమరవర్ధన్రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, టి.మహేష్‌గౌడ్ ఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు అందని సమాచారం
కాగా, ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా యజమాన్యం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. దీనిపై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హాస్టల్లో కిచెన్ నిర్వహణ సరిగా లేదని, స్థానికంగా కొని తెచ్చిన పాలకూర కలుషిత ఆహారానికి దారి తీసాయని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.