Rajiv Gandhi International Airpot
-
RGIA Hyderabad: బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని బంగారాన్ని బయటికి తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బయటికి తీసుకురాకుండా, ఎయిర్‌పోర్టు ఉద్యోగులతో బయటికి తరలిస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత
హైదరాబద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు. ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. Based on pax profiling & efficient surveillance, @hydcus officers at RGIA intercepted one pax arriving from Sharjah by Indigo 6E 1422 on 21.8.23 and seized #gold weighing 397 gm valued at Rs 20.59 lakhs. @cbic_india @DDNewslive pic.twitter.com/jkM9Q5BT97 — CGST & Customs Hyderabad Zone (@cgstcushyd) August 21, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు అక్కడి నుంచి ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సింధుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సింధు రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె నేరుగా ఫిలింనగర్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఇక మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించిన సంగతి కూడా తెలిసిందే. -
బంగారు టీషర్ట్! చూశారా..?
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. టీషర్ట్‌లో సైతం బంగారాన్ని తీసుకొచ్చి ఓ నిందితుడు బుధవారం పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి ఎఫ్‌జెడ్–8779 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు ధరించిన టీషర్ట్‌కు పొర మాదిరిగా ఉన్న బంగారాన్ని గుర్తించారు. ఇందులోంచి 386 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ.19 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఆర్జీఐఏ నిలిచింది. ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఆర్జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు అందజేసినట్లు జీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి. సర్వీస్ క్వాలిటీ అవార్డు పొందడం పట్ల జీఎంఆర్ హెచ్‌ఐఏల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడంలో కోవిడ్ మరింత అప్రమత్తం చేసిందని ఎయిర్పోర్ట్ ఈడీ, సౌత్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కిషోర్ పేర్కొన్నారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్జీఐఏ) మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. పర్యావరణహితమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆసియా విభాగంలో ఏటా 15 నుంచి 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల్లో ఆర్జీఐఏ 2020 సంవత్సరానికి గాను పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ పురస్కారాన్ని ఆర్జీఐఏకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఇటీవల అందజేసింది. ఆర్జీఐఏలో తీసుకుంటున్న పర్యావరణ హితమైన చర్యలు బాగున్నాయని ఏసీఐ డైరెక్టర్ స్టెఫానో బారోన్కీ పేర్కొన్నట్లు ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ఎస్జీకే కిశోర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో నీటి వినియోగాన్ని తగ్గించడం, నీటిని రీసైక్లింగ్ ద్వారా వాడుకోవడం, నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం విమానాశ్రయంలో 925 కేఎల్డీ సామర్థ్యం కలిగిన ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ డ్రిప్ సిస్టం ద్వారా ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నీటి నిర్వహణను ఏసీఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఎయిర్‌పోర్టు కమిటీ గుర్తించడం హర్షణీయమని ఎయిర్ పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ -
శంషాబాద్ రెడీ..
శంషాబాద్: సుదీర్ఘకాలం లాక్డౌన్ తర్వాత సాధారణ ప్రయాణికులతో కూడిన విమానాల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టును అన్ని విధాలుగా సిద్ధం చేశారు. లాక్డౌన్ సమయంలో కార్గోతో పాటు వేరే దేశాల నుంచి మన వారిని తీసుకొచ్చే విమానాలు, రిలీఫ్ విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. కేంద్ర పౌర విమానయాన మార్గదర్శకాల మేరకు తొలి దశలో 30 శాతం విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించి విమానాశ్రయాన్ని సిద్ధం చేసినట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ తెలిపారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడుతూ.. విమానం లోపల భౌతిక దూరం, నిబంధనలు ఉండేందుకు అవకాశం లేదని.. దీంతో ప్రయాణికులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల మధ్య దూరం ఉండేలా ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. విమానంలో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విమానం లోపల ఆహారం సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మధుమేహ రోగులకు కొందరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు.. గర్భిణులు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు. ఎయిర్‌పోర్టు విలేజ్ వద్ద భౌతిక దూరం గుర్తులు వేస్తున్న సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఇలా.. ఎయిర్‌పోర్టు ప్రవేశ మార్గం నుంచి భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా గుర్తులు ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ లెస్ విధానంలో ప్రయాణికులు తమ పత్రాలను కెమెరా ముందు పెడితే వాటిని సంబంధిత సీఐఎస్ఎఫ్ అధికారులు కంప్యూటర్లో పరిశీలించి అనుమతిస్తారు. అలాగే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేస్తారు. ప్రయాణికులకు అందుబాటులో అన్ని ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాట్లు చేశారు. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికులను లోపలికి అనుమతిస్తారు. ప్రయాణికులకు పరిశుభ్రత.. భౌతిక దూరం నిబంధనలను అప్రమత్తం చేసేందుకు ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే చెక్–ఇన్ కియోస్క్‌లు మానిటరింగ్ చేయొచ్చు. కాగా, ప్రారంభంలో విమానయానం నెమ్మదించినా.. భవిష్యత్తులో ఆశాజనకంగానే ఉండొచ్చని కిశోర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 36 ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భౌతిక దూరం కోసం ఏర్పాటు చేసిన పాద సూచికలు, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన శానిటైజర్ -
యూకే నుంచి హైదరాబాద్‌కి 328 మంది
సాక్షి, హైదారాబాద్: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన చిక్కుకున్నవిపత్కర సమయంలో ‘వందే భారత్’ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా నేడు(మంగళవారం) తెల్లవారుజామున యూకే నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. యూకేలో చిక్కుకుపోయిన 328 మంది భారతీయులతో తెల్లవారు జామున 2.21 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇదే విమానం తిరిగి తెలంగాణలో చిక్కుకుపోయిన 87 మంది అమెరికా జాతీయులను తీసుకుని ఉదయం 5.31 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. అమెరికా జాతీయులను తిరిగి ఢిల్లీ నుంచి మరో విమానం ద్వారా అమెరికాకు పంపుతారు. (మలేషియాలో మనోళ్ల ఆకలి కేకలు) యూకే నుంచి వచ్చిన భారతీయులు, అమెరికా వెళ్లే ప్రయాణికుల కోసం విమానాశ్రయంలో ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేశారు. దీంతో పాటు విమానాశ్రయంలోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైనవాటిని కూడా శానిజైట్ చేశారు. ఎయిరో బ్రిడ్జి నుంచి బయటికి వచ్చేంత వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించారు. ఇక విమానాశ్రయంలోకి ప్రయాణికులను 20-25 మందితో ఒక బృందంగా చేసి తీసుకువచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు పూర్తి చేయడానికి ముందు ఎయిర్పోర్ట్ హెల్త్ అధికారులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శాకల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. (కరోనా ఫ్రీగా కరీంనగర్) స్క్రీనింగ్ అనంతరం, సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తీసుకువెళ్లారు. ప్రయాణికులు, ఇమిగ్రేషన్ సిబ్బంది మధ్య ఎడబాటు ఉండేందుకు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద సామాజిక దూరం నిబంధనలు పాటించారు. ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది, ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులు సామాజిక దూరం నిబంధనలు పాటించడంలో సహకరించారు. బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానించిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తైన అనంతరం టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి పంపిస్తూ ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలో ముందుగా గుర్తించిన ప్రదేశాలకు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులు తరలివెళ్లిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను మరొకసారి పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేట్, డిస్ఇన్ఫెక్ట్ చేశారు. తరలింపు విమానాలు ఇప్పటివరకు నాలుగు వందే భారత్ తరలింపు విమానాలు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి వెళ్లాయి. వీటి ద్వారా కువైట్, యూఏఈ, అమెరికా, యూకేలో చిక్కుకుపోయిన సుమారు 750 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన భారతీయులందరినీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్వారంటైన్ చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 ఎవాక్యుయేషన్ ఫ్లయిట్స్ ద్వారా అమెరికా, యూకే, జర్మనీ, కెన్యా, జర్మనీ జాతీయులను వారి స్వదేశాలకు పంపించారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానాల్లో భాగంగా రెండో విమానం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి సోమవారం నగరానికి చేరుకుంది. ఉదయం 9.22 గంటలకు తెలుగురాష్ట్రాలకు చెందిన 118 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ (ఏఐ 1617) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కాగా, అబుదాబి(యూఏఈ) నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్(ఏఐ1920) రాత్రి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది. 170 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. ప్రయాణికులతో పాటు వైమానిక సిబ్బంది కోసం విమానాశ్రయంలో ఎయిరోబ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు శానిటైజ్, కెమికల్ ఫ్యూమిగేషన్ చేశారు. విమానాశ్రయం లోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లన్నింటినీ శానిటైజ్ చేశారు. ఎయిరోబ్రిడ్జి నుంచి బయటికి వచ్చే వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భౌతిక దూరా న్ని పాటించారు. 20 నుంచి 25 మందిని ఒక బృందంగా ఏర్పా టు చేసి తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు ముందు ఎయిర్ పోర్ట్ హెల్త్ అధికారులు ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. బ్యాగే జ్ బెల్టుతో అనుసంధానించిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్ర యాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్త యి, టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి ముందు, ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలోని నోవాటెల్, షెహరటాన్, వైష్ణవి తదితర హోటళ్లల్లో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్లకు బస్సుల్లో తరలించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 14 రోజుల పాటు వారు ఈ క్వారంటైన్‌లోనే ఉండవలసి ఉంటుంది. విజయవాడకు పంపించండి అమెరికా నుంచి నగరానికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన 16 మంది ప్రయాణికులను సైతం ఇక్కడే హోటళ్లలో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్లకు తరలించడం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమను ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో విజయవాడకు పంపించి ఉంటే బాగుండేదని, లాక్డౌన్ కారణంగా చాలా రోజులుగా అమెరికాలో చిక్కుకుపోయామని, ఇక్కడికి వచ్చిన తరువాత కూడా ఇంటికి చేరుకోలేకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో తమను క్వారంటైన్ కేంద్రానికి పంపించినా బాగుండేదన్నారు. మరోవైపు పలు హోటళ్లలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. -
ప్రత్యేక విమానంలో బయలుదేరిన అమెరికన్లు
శంషాబాద్: హైదరాబాద్ నుంచి పలువురు అమెరికన్లు ప్రత్యేక విమానంలో వారి దేశానికి బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో వీరిని అమెరికాకు పంపారు. ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానం ఏఐ1616 గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అమెరికన్లకు శానిటైజేషన్ చేసిన టెర్మినల్ ద్వారా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 101 మంది ప్రయాణికులు 3.52 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరారు. అక్కడి నుంచి డెల్టా ఎయిర్‌లైన్స్ ద్వారా మరికొందరు ప్రయాణికులతో కూడిన విమానం అమెరికా బయలుదేరింది. లాక్డౌన్ తర్వాత, అమెరికా, యూకే తదితర దేశాలకు సంబంధించి మొత్తం 12 ప్రత్యేక విమానాలు ఇక్కడి నుంచి వెళ్లాయి. -
మరో రెండు విమానాల్లో బయల్దేరిన అమెరికన్లు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన అమెరికన్లు మరో రెండు విమానాల్లో ఆదివారం బయల్దేరారు. తెలంగాణ ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో వీరిని ఆ దేశానికి పంపారు. మధ్యాహ్నం 3.15కి మొదటి విమానం ఏఐ1615లో 81 మంది పెద్దలు, ఒక శిశువు ముంబైకి బయల్దే రారు. మరో విమానం ఏఐ 1617లో 82 మంది పెద్దలు, ఒక శిశు వుతో 3.51కి ముంబైకి బయల్దేరింది. పూర్తి శానిటైజర్ చేసిన టెర్మినల్ ద్వారా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వీరిని పంపా రు. ఈ విమానాలు ముంబై మీదుగా అమెరికా వెళ్లనున్నట్లు ఆర్జీఐఏ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విమానాల్లో ఎక్కే ప్రయాణికులను ముందుగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో బస చేయించారు. అమెరికన్ ఎంబసీ ఆధీనంలోకి తీసుకున్న ఈ హోటల్లోనే అందరికీ కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ విమానాల్లో వెళ్తున్న వారి ప్రయాణ చార్జీలను ఇంకా నిర్ధారించలేదు. నిర్ణయించిన చార్జీలను అమెరికా వెళ్లాక చె ల్లించాలంటూ ప్రయాణికుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. -
కరోనా: ఎయిర్‌పోర్ట్‌లో ఇష్టారాజ్యం
అతని పేరు ఆకాశ్ (పేరు మార్చాం). శనివారం జర్మనీ నుంచి వచ్చాడు. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు. అక్కడి కేంద్ర వైద్య అధికారులు థర్మల్ స్క్రీనింగ్ చేసి వదిలేశారు. అతడి గురించి రాష్ట్ర వైద్యాధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. తనకు జాగ్రత్తలు కానీ, ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉండాలని కానీ అక్కడ ఎవరూ చెప్పలేదని అతను అంటున్నాడు. దర్జాగా హైదరాబాద్‌లో తిరుగుతున్నాడు. పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన లోకేష్ (పేరు మార్చాం) 3 రోజుల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. విమానా శ్రయంలో అతడికి ఎటువంటి జాగ్రత్తలు చెప్పలేదు. సరికదా అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడు కూడా తెలుసుకోలేదు. అతను పెళ్లి చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాడన్న విషయం కూడా అధికారులకు తెలియదు. ఆదివారం పెళ్లి జరిగింది. అతను అమెరికా నుంచి వచ్చాడని తెలిసి చాలా మంది పెళ్లికి కూడా వెళ్లలేదు. సాక్షి, హైదరాబాద్: ఇలా వివిధ దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది సంబంధం లేకుండా హోం ఐసోలేషన్‌లో ఉంచాలి. జర్మనీ సహా ఏడు దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే సర్కారు ఆధ్వర్యంలో ఐసోలేషన్ చేయాలని తెలంగాణ వైద్యాధికారులు నిర్ణయించారు. అది ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశం నుంచి వచ్చినా, వారిని కూడా 14 రోజులు హోం ఐసోలేషన్ చేయాలని గతంలోనే నిర్ణయించారు. పైన పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు ఒకరు జర్మనీ నుంచి, మరొకరు అమెరికా నుంచి వచ్చారు. కానీ ఈ ఇద్దరికీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని కానీ, ఎలాంటి జాగ్రత్తలు కానీ చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలంగాణ వైద్యాధికారులకు కొందరు ప్రయాణికుల విషయంలో సరైన సమాచారం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కోసారి విదేశీ ప్రయాణికుల జాబితా తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందని రాష్ట్ర వైద్యాధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ కోవిడ్ వైరస్‌పై యుద్ధం ప్రకటిస్తే, విమానాశ్రయ అధికారుల్లో కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారని అంటున్నారు. ఆ ఏడు దేశాలు హైరిస్క్‌లో ఉన్నందున, 60 ఏళ్లు దాటిన వారికి లక్షణాలు లేకపోయినా తప్పకుండా సర్కారు ఆధ్వర్యంలో కోరంటైన్ చేయాలని, ఆ లోపు వారికి లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నది కేంద్రం నిబంధన. ఈ నిబంధనను మార్చాలని, ఆ ఏడు దేశాల నుంచి వచ్చేవారెవరైనా సరే తమ ఆధ్వ ర్యంలోనే కోరంటైన్లో ఉంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు తాజాగా లేఖ రాశారు. అయినా ప్రస్తుతం ఉన్న నిబంధనలను కూడా తుంగలో తొక్కడం వల్ల ఆ 2 దేశాలకు చెందినవారు హోం ఐసోలేషన్‌లో కూడా లేకుండా బయట ఉన్నారు. ఇలా విదేశాల నుంచి, రిస్క్ ఉన్న దేశాల నుంచి ఎందరు రాష్ట్రంలోకి సమాచారం లేకుండా ప్రవేశిస్తున్నారన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే మున్ముందు పరిస్థితిని నియంత్రించలేమన్న భయాందోళనలు కూడా వైద్యాధికారుల్లో నెలకొన్నాయి. -
బాంబు అనుకుని తెరిస్తే బంగారం..
శంషాబాద్: అనుమానిత వస్తువుగా భావించిన ఓ బ్యాగులో బంగారం బయటపడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని అంతర్జాతీయ అరైవల్‌లో బ్యాగులు తీసుకొచ్చే బెల్టుపై ఆదివారం రాత్రి ఓ బ్యాగు మిగిలిపోయింది. ప్రయాణికులు ఎవరూ దానిని తీసుకోకపోవడంతో సీసీ కెమెరాల్లో పరిశీలించిన అధికారులు వెంటనే సీఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో బాంబు ఉండవచ్చేమోనని అనుమానించిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించారు. స్కానింగ్ ద్వారా బ్యాగ్‌లో ఓ అనుమానిత వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మోటార్‌ను బయటికి తీశారు. దానిని బద్దలు చేసి చూడగా.. బంగారు ప్లేట్లకు ఇనుప పూతపూసి మోటారులో పెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ప్లేట్ల బరువు దాదాపు 1.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దీనిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలు గమనించిన ప్రయాణికుడే దానిని బెల్టుపై వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికుడు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ప్లేట్లపై ఇనుపపూత -
ప్రారంభమైన ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఫాస్టాగ్’ కార్ పార్కింగ్ విధానం ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో నగదు రహిత లావాదేవీలతోపాటు కాలయాపన లేకుండా పర్యావరణ హితంగా మొత్తం ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ‘ప్యాసింజర్ ప్రైమ్’లో ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో దీనిని ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సహకారంతో దీనిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఐసీఐసీఐ ఫాస్టాగ్‌లతో ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియ క్రమంగా ఇతర బ్యాంకులకు విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ద్వారా కార్ల పార్కింగ్ సులభతరం కానుందన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ కాలుష్యాన్ని నివారించడంతోపాటు పర్యావరణ సుస్థిరతకు దోహదం చేస్తుందని తెలిపారు. తమకు భాగస్వాములుగా చేరిన ఎన్‌పీసీఐకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఉపయోగించుకోవాలి.. ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ను ఉపయోగించుకోవడానికి రీలోడబుల్ ఎలక్ట్రానిక్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది. వినియోగదారులు ముందుగా ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫాస్టాగ్‌ను సదరు వినియోగదారుడి ప్రీపెయిడ్ బ్యాంకు ఖాతాకు లింక్ చేస్తారు. ట్యాగ్ ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత దానిని కారుకు సంబంధించిన విండ్ స్క్రీన్‌పై అమర్చుకోవాలి. ప్రయాణికులు, వినియోగదారులు పార్కింగ్‌కు వచ్చినపుడు లావాదేవీల కోసం ఆగకుండా ఈ ట్యాగ్ నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు పూర్తవుతాయి. ఈ విధానాన్ని సబ్‌స్క్రైబ్ చేసిన వాహనదారులు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వీటి కోసం పార్కింగ్ వెళ్లే చోట, నిష్క్రమణల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నకిలీ వీసాలతో మోసాలు
సిరిసిల్ల: గల్ఫ్ బాటలో ఘరానా మోసం జరిగింది. నకిలీ వీసాలు అంటగట్టి కోట్లు కొల్లగొట్టిన ఘటన తెలంగాణ జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. బోగస్ వెబ్సైట్ సృష్టించి నకిలీ వీసాలను చూపించి రూ.5 కోట్లకు టోకరా ఇచ్చాడు ఓ రాజస్తానీ యువకుడు. రాష్ట్రంలోని 5 జిల్లాలకు చెందిన 300 మంది చెల్లించిన లక్షలతో ఉడాయించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో పొరుగు జిల్లాల్లోనూ బాధితులున్నారు. షార్జా బల్దియా వీసాల పేరిట షార్జాలోని బల్దియా (మున్సిపాల్) క్లీనింగ్ వీసాల పేరిట మోసం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన మక్సూద్ అలీ (పాస్‌పోర్టు నంబరు ఎల్ 3833483) దుబాయి వెళ్లి వస్తాడు. సొంతగా ఓ నకిలీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందు లో నకిలీ వీసాలను తయారు చేసి అప్లోడ్ చేశాడు. దుబాయి, షార్జాల్లో పని చేసే వలస కార్మికులకు బల్దియా వీసాలు ఉన్నాయని నమ్మించాడు. మీకు బంధువులకు వీసాలు ఇవ్వండి అంటూ మక్సూద్ చెప్పాడు. దీంతో పలువురు వలస జీవులు సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలోని సమీప బంధువులకు షార్జా బల్దియా వీసాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే వెబ్సైట్లో చెక్ చేసుకుని వీసాలకు డబ్బులు చెల్లించాలని సూచించారు. షార్జాలో ఉన్న ఆత్మీయులే ఇలా చెప్పడంతో నమ్మిన పలువురు వెబ్సైట్ చెక్ చేయడంతో వీసాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కొక్కరు రూ.1.80 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు వీసాలకు చెల్లించారు. ఇలా సుమారు 300 మంది యువకులు రూ.5 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ఆ డబ్బులను తీసుకున్న మక్సూద్ నకిలీ వీసాలతో అందరినీ మోసం చేశాడు. బయట పడిందిలా.. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యులు గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తారు. ఆయన 36 మందికి సంబంధించి రూ.56 లక్షలను మక్సూద్‌కి చెల్లించాడు. ఏడుగురు అభ్యర్థులను ఇటీవల షార్జా పంపించగా.. షార్జా ఎయిర్‌పోర్టు అధికారులు అవి నకిలీ వీసాలని గుర్తించి వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ శివారు తుర్కాసికాలనీకి చెందిన మరో పది మందిని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు షార్జా పంపేందుకు హైదరాబాద్ పంపారు. శంషాబాద్‌విమానాశ్రయం అధికారులు నకిలీ వీసాలను గుర్తించి ఆ పది మందిని వెనక్కి పంపారు. మక్సూద్ ఇచ్చిన వెబ్‌సైట్‌ను చెక్ చేస్తే.. అది నకిలీదని తేలింది. దీంతో తాము మోసపోయామనే విషయం బాధితులకు అర్థమైంది. కాగా, 36 మంది మోసపోయినట్లు తెలియడంతో దర్పల్లికి చెందిన ప్రజాప్రతినిధి గుండెపోటుకు గురై∙ఆస్పత్రి పాలయ్యాడు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాడీ స్కానర్లు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ప్రయాణికుల తనిఖీకి ఇటీవల అధునాతన బాడీ స్కానర్లను ప్రవేశపెట్టారు. కేవలం రెండు, మూడు సెకన్లలో పూర్తిగా తనిఖీ చేసే ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ట్రయల్‌రన్ ప్రారంభించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచనల మేరకు ఈ స్కానర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మి నల్ వద్ద ఏర్పాటు చేసిన వీటిని 3 నెలల పాటు పరిశీలిస్తారు. ట్రయల్స్‌లో భాగంగా డిపార్చర్ గేట్ నం.3 వద్ద ఉన్న ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ లేన్ వద్ద స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ట్రయల్స్ విజయవంతమైతే సంబంధిత రెగ్యులేటరీ అనుమతుల మేరకు టెర్మినల్ అంతటా ఏర్పాటు చేస్తారు. ఇమేజ్ ఫ్రీ స్కానింగ్ టెక్నిక్ మీద పనిచేసే ఈ స్కానర్ వల్ల ఎలాంటి హానీ ఉండదు. ప్రయాణికుల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల అనుమతితోనే వారిని స్కానింగ్ చేస్తారు. పలు యూరోప్ దేశాలు, అమెరికాలోని అనేక విమానాశ్రయాల్లో ఇప్పటికే భద్రతా తనిఖీల నిమిత్తం బాడీ స్కానర్లను వినియోగిస్తున్నారు. -
నైజీరియన్ల అక్రమ దందాకు తెర
సాక్షి, హైదరాబాద్ : రాజీవ్‌గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నైజీరియన్లు కొత్త రకం దందాతో రంగంలోకి దిగారు . ఎయిర్పోర్ట్ కార్గోలో లాగోస్ నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా నిషేధిత పదార్థాలు దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా నిషేధిత పదార్థాలను పట్టుకున్నారు. నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ భారీ పార్సల్‌లో 13 టన్నులు ఉన్న కాస్మోటిక్స్, బీర్, విస్కీ, జిన్‌తోపాటు ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. వీటి విలువ 52 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా అనుమతి లేకుండా వీటిని నగరానికి తీసుకు వచ్చిన నిందితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
కువైట్ చెక్కేస్తున్న 20 మంది మహిళల అరెస్టు..
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో విదేశాలకు చెక్కేస్తున్న 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలు కలిగిన వీరు కువైట్ వెళ్లేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. మహిళలను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానం టాయిలెట్లో బంగారం పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలకు భయపడిన ఓ ప్రయాణికుడు తాను పట్టుబడుతానేమోననే ఆందోళనతో విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్లో వదిలివెళ్లాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 1,866 గ్రాముల బరువు కలిగిన పదహారు బంగారు బిస్కెట్లు ఇందులో బయటపడ్డాయి. వీటి విలువ రూ.60,94,122 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అయితే, విమానం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియరాలేదు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహారాజశ్రీ మొక్కజొన్న..
మొక్కజొన్నేంటి.. అదీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్లాస్టిక్ సమస్యలకు పరిష్కారం చూపడమేంటి? దానికీ.. దీనికీ సంబంధమేంటి? ఇదే కదా మీ అనుమానం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ఆ వివరాలు మీకోసం.. – సాక్షి, హైదరాబాద్ అసలు సమస్యేంటి? ఈ ఎయిర్‌పోర్టుకు రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాగే ఎయిర్‌పోర్టుకు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వీరందరికీ టీ, కాఫీలు, భోజనం, తాగునీరు కావాలి. అక్కడ ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకింగ్‌తోనే లభిస్తాయి. దీంతో నిత్యం టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇదో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఎలాంటి ప్లాస్టిక్ వినియోగానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఐఏఎల్ నిర్ణయించింది. దీనికి మొక్కజొన్నే పరిష్కారమని భావించింది. పరిష్కారమిలా... మొక్కజొన్నతో తయారు చేసిన ప్లేట్లు వంటివాటికి భూమిలో కలిసిపోయే గుణం ఉంది. పైగా.. ఒక రోజులో 2 టన్నుల వ్యర్థాలను ఎరువుగా మార్చే సామర్థ్యమున్న కంపోస్ట్ ప్లాంట్ ఎయిర్‌పోర్టుకు ఉంది. దీంతో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో మొక్కజొన్న, చెక్క తదితరాలతో తయారు చేసిన ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, ట్రేలు, ఫోర్క్‌లు, స్ట్రిరర్లు, స్పూన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు వాడిపారేసిన తర్వాత ఆ వ్యర్థాలను సేకరించి.. కంపోస్టు ప్లాంటుకు తరలిస్తారు. దాన్ని అది ఎరువుగా మారుస్తుంది. ఇప్పటికే ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన కంపోస్టును ఎయిర్‌పోర్టులో మొక్కలకు ఎరువులుగా వాడుతున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా ఈ రకంగానూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. జీహెచ్ఐఏఎల్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ ప్లేట్ల వినియోగాన్ని ప్రవేశపెట్టాం. మా వద్ద10 మెగావాట్ల సోలార్ ప్లాంటు, కంపోస్ట్ ప్లాంటు, ఎలక్ట్రిక్ చార్జింగ్ యూనిట్, నీటి పరిరక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు సిబ్బందీ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో వస్త్రంతో చేసిన సంచులనే వాడుతున్నారు. –ఎస్జీకే కిశోర్, సీఈవో, జీహెచ్ఐఏఎల్ -
డీజే ఆరోపణలు.. ఎయిర్ ఇండియా రిప్లై
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే చేసిన ఆరోపణలపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఇటాలియిన్ డీజే చేసిన ఆరోపణలు అసత్యమైనవని, తమ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించలేదని కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన ఇటాలియన్ డీజేకు విమానశ్రయ పోలీసు అధికారి బదులిచ్చారు. సంఘటన జరిగిన రోజంతా తాను పోలీస్ స్టేషన్లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు. అసలేం జరిగిందంటే.. ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిర్ ఇండియా సిబ్బంది తనపై చేయి చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలో వారిపై కేసు పెట్టేందుకు విమానశ్రయ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్తే ఎస్సై లేడని, తమకు ఏం తెలియదని అక్కడి పోలీసులు చెప్పారని.. అంతే కాకుండా అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని వివరించారు. విమానశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రయాణించాల్సిన ఎయిర్ ఇండియా విమానం 9 గంటలు ఆలస్యమైందని, అందుకే తాను ఎక్కాల్సిన విమానం ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు డిపరేచర్ గేటు వద్దనున్న అధికారుల దగ్గరికి వెళ్లినట్లు వీడియోలో పేర్కొన్నారు. కానీ, అక్కడి సిబ్బంది స్పందించకపోవడంతో పక్కనే ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లి అడగగా అది తనపని కాదని బిగ్గరగా అరిచారని, మరోసారి అడిగితే చేయిచేసుకున్నారని వీడియోలో పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాపై ఇటాలియన్ డీజే ఫిర్యాదు
-
ఉత్తమ విమానాశ్రయాల్లో శంషాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకును దక్కించుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) నుంచి 2014 సంవత్సరానికిగాను ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డును పొందింది. 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో గత ఆరేళ్లుగా టాప్-3 ర్యాంకుల్లో శంషాబాద్ విమానాశ్రయం నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 300 విమానాశ్రయాల్లో నాణ్యమైన సేవల విషయంలో 34 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఏసీఐ ర్యాంకులను ప్రకటిస్తోంది.