rajupet
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ
రాజుపేట (నల్గొండ జిల్లా) : రాజుపేట మండలం నమిల గ్రామ వీఆర్ఓ శేషగిరిరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. రాపోలు రవీందర్ రెడ్డి అనే రైతు నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. రవీందర్ రెడ్డి తనకున్న ఏడెకరాలను భూమిని పౌతీ చేయించడానికి వెళితే వీఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయం రైతు రవీందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. పథకం ప్రకారం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్ఓను రెవెన్యూ ఆఫీసులో అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో వీరంగం: గుడి పందిరికి నిప్పు
రాజుపేట (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా రాజుపేట మండలం రేణిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మహిళలపై దాడి చేయడమేకాక దుర్గమ్మ గుడిలోని పందిరికి నిప్పు పెట్టాడు. దాంతో పందిరి మొత్తం కాలిబూడిదైంది. గమనించిన స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేణిగుంటకు చెందిన నల్ల భాస్కర్(18) అనే యువకుడు గత కొంతకాలంగా ఊరిలో అర్ధనగ్నంగా తిరుగుతూ మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామస్తులు ఎన్నిసార్లు చితకబాదినా ప్రయోజనం లేదు. ఆదివారం ఉదయం కూడా ఊరిలో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. చివరకు దుర్గమ్మ గుడి ప్రాంగణంలో వేసిన చలువ పందిరికి నిప్పుపెట్టాడు. ఫలితంగా పందిరి కాలిబూడిదైంది. ఆగ్రహించిన గ్రామస్తులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.