ఉత్తరాఖండ్ సంక్షోభంపై రాజ్యసభలో రగడ
ఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం వ్యవహారంపై రాజ్యసభ దద్దరిల్లింది. సోమవారం మలివిడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ఉత్తరాఖండ్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లో సభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ చైర్మన్ పోడియంను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు.