Rakshaka Bhatudu
-
ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ
‘‘రక్ష, జక్కన్న’ చిత్రాల స్థాయిలో ‘రక్షకభటుడు’ ఉంటుంది. చిన్న సినిమా చేసిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్‌కి వెళ్దామనుకున్న నాకు ‘రక్షకభటుడు’ పెద్ద చిత్రంగా నిలిచింది’’ అని వంశీకృష్ణ ఆకెళ్ళ అన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మించిన ‘రక్షకభటుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఆకెళ్ళ చిత్రవిశేషాలు పంచుకున్నారు. ⇔ అరకు సమీపంలోని ఓ హిల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు. ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రారు. కానీ, ఆ స్టేషన్లో నైట్‌డ్యూటీ చేయాలంటే పోలీసులకు భయం. అది ఎందుకన్నది సస్పెన్స్. ఓ అమ్మాయికి వచ్చిన ఒక సోషల్ సమస్యను పోలీస్ స్టేషన్లో ఎలా పరిష్కరించారన్నదే ఈ సినిమా. ⇔ ఈ చిత్రంలో నటుడు ధన్‌రాజ్ ‘ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి’ అంటాడు. ఆంజనేయస్వామి నిజంగానే ప్రొటెక్టర్. ప్రస్తుతం సొసైటీలో ప్రొటెక్టింగ్ ఫోర్స్ అంటే పోలీస్. ఆ పోలీస్ రూపంలో మనల్ని రక్షించే దేవుడు అనే పాయింట్ ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ చిత్రం కథ. ఇందులో పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఆంజనేయ స్వామి ఎవరు? అన్నది రివీల్ చేయకపోవడంతో బిజినెస్ బాగా జరిగింది. ⇔ రిచా పనయ్ ఇప్పటికి నాలుగు సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ‘రక్షకభటుడు’ తో ఆ లోటు తీరుతుంది. బ్రహ్మానందంగారు హారర్ సినిమాల దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ⇔ రెండు, మూడు స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఓ పెద్ద స్టార్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా. అది కాకుండా మరో చిన్న సినిమా కూడా పరిశీలనలో ఉంది. -
ఆంజనేయస్వామి ఎవరో తెలుసుకోవాలనుంది!
– దర్శకుడు మారుతి ‘‘రక్షక భటుడు’ చిత్రంలో పోలీస్ గెటప్‌లో ఉన్న ఆంజనేయస్వామి మోషన్ పోస్టర్ చూస్తే ఆ నటుడు ఎవరా? అని అందరిలో ఓ కుతూహలం పెరిగింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి నాలోనూ కలిగింది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో ‘రక్ష, జక్కన్న’ చిత్రాల ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎ. గురురాజ్ నిర్మించిన చిత్రం ‘రక్షక భటుడు’. శేఖర్ చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘జక్కన్న’ సినిమాలో నేను ఓ పాత్ర చేశా. ఆ టైమ్‌లో వంశీకృష్ణగారు వినిపించిన కథ బాగా నచ్చింది. ముఖ్యంగా వంశీ చెప్పిన క్లయిమాక్స్ విని ఒళ్ళు జలదరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నేను సినిమాలపై ఉన్న ఇష్టంతోనే ఈ చిత్రంతో నిర్మాతగా మారా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో ఆంజనేయస్వామి గెటప్‌లో ఉన్న హీరో ఎవరనే ఆసక్తి అందరిలో కలిగింది. మే ప్రథమార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఆ నటుడు ఎవరనేది తెలిసేది అప్పుడే. శేఖర్ చంద్ర మంచి పాటలిచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. గురురాజ్‌గారు రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించినట్లుగానే సినిమా రంగంలోనూ సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని వంశీకృష్ణ అన్నారు. రిచా పనయ్, శేఖర్ చంద్ర, పాటల రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
కట్టప్పకన్నా పెద్ద మిస్టరీ!
‘‘నటుడవ్వాలని చిత్ర పరిశ్రమకొచ్చి, అదృష్టం కలిసి రాక వ్యాపారాలు చేశా. అయినా, సినిమాలపై ఇష్టం పోక నిర్మాతగా మారి, ‘రక్షక భటుడు’ నిర్మించా. నటన మీద ఉన్న మక్కువతో ఈ చిత్రంలో ఓ పాత్ర చేశా’’ అని నిర్మాత ఎ. గురురాజ్ అన్నారు. రిచా పనై, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో గురురాజ్ నిర్మించిన ‘రక్షక భటుడు’ మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ –‘‘ నేను ఆంజనేయస్వామి భక్తుణ్ణి. హనుమత్ జయంతి రోజునే(మంగళవారం) నా బర్త్‌డే రావడం హ్యాపీ. మా చిత్రంలో ఆంజనేయుడి పాత్ర కీలకం. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడన్నది పెద్ద మిస్టరీ. మా సినిమాలో హనుమంతుడి వేషం ఎవరు వేశారన్నది అంతకంటే పెద్ద మిస్టరీ. దీనికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే. మా చిత్రం కుటుంబమంతా చూసేలా ఉంటుంది. ఫస్ట్ లుక్, ట్రైలర్‌తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. తర్వాతి చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో చేయనున్నాం’’ అన్నారు. -
లేడీ టైగర్
మాములుగా సినిమా షూటింగ్ స్పాట్ ఆర్టిస్టుల సందడితో కోలాహలంగా ఉంటుంది. అయితే అనుకోని అతిథిలా వచ్చిన ఓ దెయ్యం ఆ కేరింతల్ని కంగారుగా మార్చేసింది. దెయ్యాన్ని తరుముదామంటే దేవుడు రక్షిస్తున్నాడు. మరి వారి పరిస్థితి ఏంటి? దెయ్యానికి దేవుడు ఎందుకు అభయం ఇచ్చాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘రక్షక భటుడు’ చిత్రం చూడాల్సిందేనని అంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ నిర్మించారు. రిచాపనయ్, బ్రహ్మనందం, బ్రాహ్మజీ, సుప్రీత్, ప్రభాకర్ ముఖ్య తారాగణం. ఈ చిత్రం ట్రైలర్‌ను హైద్రాబాద్‌లో రిలీజ్ చేశారు. సినిమాను ఈనెల 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భం మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులు తప్పక ఉంటాయి. నటుడు గురురాజ్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. దర్శకుడు వంశీకి సినిమాలంటే పిచ్చి. ఈ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘కథనే హీరోగా భావించి అందరం కష్టపడ్డాం. రిచా పనయ్ లేడి టైగర్‌లా నటించింది. వంశీకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాత గురురాజ్. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: జె.శ్రీనివాసరాజు. -
హిందీలో రక్షకభటుడు
‘‘కథే హీరో అంటుంటాం. అందుకే స్టార్ హీరో నటించారా? మినిమమ్ గ్యారంటీ హీరో నటించారా? అనేది పట్టించుకోకుండా కథ విని, మా చిత్రం హిందీ అనువాద హక్కులను ఫ్యాన్సీ రేటు ఇచ్చి, కొన్నారు’’ అని నిర్మాత ఎ. గురురాజ్ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘రక్షకభటుడు’. రిచా పనై, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్ ముఖ్య తారలు. ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘కథే ఈ చిత్రానికి అసలైన హీరో. దెయ్యాలని దేవుడు శిక్షిస్తాడంటారు. కానీ, రక్షిస్తాడనే డిఫరెంట్ ఎలిమెంట్‌తో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల విడుదల చేసిన డిజిటల్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్లో ఆంజనేయస్వామి పోలీస్ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఫ్యాన్సీ రేట్‌తో హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోవడం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
రక్షకభటుడు... దెయ్యానికి!
దేవుణ్ణి చూస్తే దెయ్యాలకు వణుకు. భయంతో పరుగులు పెడతాయి. అందువల్ల, ఎవరికైనా దెయ్యం పడితే రక్షించమంటూ భక్తులు దేవుణ్ణి శరణు కోరతారు. దేవుడు వాళ్లను రక్షిస్తాడు. పురాణాల నుంచి మన తెలుగు సినిమాల వరకూ వింటున్న కథలు ఈ కోవలోనే ఉంటాయి. బట్ ఫర్ ఏ ఛేంజ్... దేవుడు ఓ దెయ్యాన్ని రక్షిస్తే? ఎలా ఉంటుందో వెండితెరపై చూడమంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ. గురురాజ్ నిర్మిస్తున్న సినిమా ‘రక్షకభటుడు’. రేపటితో చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో కథే హీరో. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంది. 90 శాతం సినిమా అరకు లోయలోని పోలీస్ స్టేషన్ నేపథ్యంలో నడుస్తుంది. సెకండాఫ్‌లో బ్రహ్మానందంగారు కీలక పాత్ర చేశారు. త్వరలో టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు వంశీకృష్ణ ఆకెళ్ల. హీరోయిన్ రిచా పనయ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, కళా దర్శకుడు రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
రిలీజ్ వరకూ సస్పెన్సే!
‘‘ఇటీవల విడుదలైన ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీసాఫీసర్ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆయన ఎవరో చెప్పమని పలువురు అడిగారు. సినిమా రిలీజ్ వరకూ ఆ స్పెషల్ స్టార్ ఎవరు? అనేది సస్పెన్సే’’ అన్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ, ధనరాజ్, నందు ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో గురురాజ్ నిర్మిస్తున్న సినిమా ‘రక్షక భటుడు’. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే థ్రిల్ ఫీలయ్యా. ఈ నెల ప్రథమార్థం ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘నేను దర్శకత్వం వహించిన గత చిత్రాలు ‘రక్ష’, ‘జక్కన్న’ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రకథాంశం ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: దినేశ్.