Ram Mandir row
-
అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం!
లాతెహర్ (జార్ఖండ్): అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన నిందించారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా బాలరాముడికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్యలోని ప్రముఖ ప్రదేశంలో ముస్లింలు మసీదు కట్టుకోవడానికి ఐదు ఎకరాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జార్ఖండ్ లాతెహర్‌లో గురువారం అమిత్ షా ప్రసంగిస్తూ.. ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే అయోధ్య తీర్పు జాప్యానికి కారణమైందని విమర్శించారు. ‘అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? మీరే చెప్పండి. కానీ, కాంగ్రెస్ ఈ కేసు విచారణ జరగకుండా చూసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది’ అని షా అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కృషి చేయలేదని, మోదీ సర్కారు ప్రతి ఆదివాసీ బ్లాకులోనూ ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటుచేసి.. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని షా తెలిపారు. -
రామజన్మభూమి యాజమాన్య పత్రాలు పోయాయ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజువారీ వాదనల్లో భాగంగా బుధవారం రెండోరోజు వాదనలను సుప్రీంకోర్టు కొనసాగించింది. ఈ కేసులో ఒక వాదిగా ఉన్న నిర్మోహి అఖారా వాదనలు వినిపిస్తూ.. రామజన్మభూమి యాజమాన్యానికి సంబంధించి తమ వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. రామజన్మభూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూర్వం మీ అధీనంలో ఉందని చెప్పడానికి మీ వద్ద మౌకిక లేదా పత్ర సంబంధమైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు నిర్మోహి అఖారా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. 1982లో జరిగిన బందిపోటు దాడిలో రామజన్మభూమి యాజమాన్య పత్రాలను తాము కోల్పోయామని, తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అఖారా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. రామజన్మభూమి-బాబ్రి మసీదు కేసులో ఆగస్టు ఆరో తేదీ నుంచి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రోజువారీ వాదనలు వింటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన మధ్యవర్తిత్వ కమిటీ ఓ పరిష్కారం చూపడంలో విఫలమవ్వడంతో ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వాద, ప్రతివాదులుగా ఉన్న హిందూ-ముస్లిం సంఘాలు ఒక రాజీ పరిష్కారానికి రాకపోవడంతో మధ్యవర్తిత్వ కమిటీ నాలుగు నెలల పాటు జరిపిన సంప్రదింపుల ప్రక్రియ విఫలమైన సంగతి తెలిసిందే. -
అయోధ్యపై రాందేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతికి గర్వకారణమని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. రాముడు కేవలం హిందువులకే కాకుండా ముస్లింలకూ పూర్వీకుడని చెప్పుకొచ్చారు. ఖేడా జిల్లా నదియాద్‌లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామ మందిర అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. రామ మందిరాన్ని అయోధ్యలోనే నిర్మించాలన్నది తన అభిమతమని, రామ మందిరం అయోధ్యలో కాకుండా మక్కా, మదీనా లేదా వాటికన్ నగరంలో నిర్మించలేరని వ్యాఖ్యానించారు. రాముడి జన్మస్ధలం అయోధ్య అనేది వాస్తవమని, రాముడు మనందరికీ పూర్వీకుడని పేర్కొన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. పాలక బీజేపీతో లబ్ధి పొందిన ఇలాంటి బాబాలు ఎన్నికల సమయంలో బీజేపీ, మోదీ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ముందుకొస్తున్నారని ఆరోపించింది. -
బీజేపీకి వీహెచ్‌పీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ బీజేపీకి షాక్ ఇచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్‌పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమకు అన్ని దారులు మూసేసిందని.. రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రామమందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌పీ ధర్మ సన్సద్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో...అలోక్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా వీహెచ్‌పీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకుంటోంది కాంగ్రెస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. -
కాంగ్రెస్‌తోనే మందిర్ నిర్మాణంలో జాప్యం : మోదీ
జైపూర్ : అయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో రామమందిర నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్వార్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ న్యాయవ్యవస్ధను రాజకీయాల్లోకి లాగుతోందని, 2019 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా అయోధ్యపై కోర్టు తీర్పును వాయిదా వేయాలని ఓ కాంగ్రెస్ నేత కోరారని చెప్పారు. న్యాయస్ధానాలపై భీతిగొలిపే వాతావరణాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు సరైనవి కాదన్నారు. గతంలో కాంగ్రెస్ చేపట్టిన గరీబీ హఠావో నినాదంతో మార్పు రాలేదని, బ్యాంకుల జాతీయీకరణ విఫలమైందని శనివారం ప్రధాని మోదీ ప్రత్యర్ధి పార్టీపై ఆరోపణలు గుప్పించారు. భారత తొలి ప్రధానిగా సర్ధార్ పటేల్ బాధ్యతలు చేపడితే రైతుల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేవారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో వెల్లడించాలని శివసేన చీఫ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మందిర నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడం గమనార్హం. -
చట్టంతో అయోధ్య రామాలయం సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసును రోజువారి ప్రాతిపదిక త్వరతగతిన విచారించేందుకు ప్రత్యేక బెంచీని ఏర్పాటు చేయాల్సిన సుప్రీం కోర్టు అందుకు నిరాకరించడమే కాకుండా ఆ విషయాన్ని వచ్చే జనవరి నెలకు వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలంటూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ లాంటి బీజేపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. చేస్తున్నాయి. అది సాధ్యం అయ్యే పనేనా? కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినా, చట్టాన్ని తీసుకొచ్చినా కోర్టు ముందు అవి నిలబడగలవా? భారత రాజ్యాంగం ఓ మతానికి సానుకూలంగా వ్యవహరించేందుకు అనుమతిస్తుందా? అయోధ్యలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదును హిందూ కర సేవకులు విధ్వంసం చేసిన నేపథ్యంలో తలెత్తిన అల్లర్లను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అంతకుముందు బాబ్రీ మసీదు ఉన్న 2.7 ఎకరాల స్థలంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని మొత్తం 66.7 ఎకరాల భూమిని ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం స్వాధీనం చేసుకుంది. ఆ స్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది అవడం వల్ల దాని మీద కేంద్రానికి టైటిల్ హక్కులు రావాలంటే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో చట్టం తీసుకరావాల్సి ఉంటుంది. తాము భూమిపై హక్కులు కోరడం లేదని, అల్లర్ల నివారణం కోసం, ఆ స్థలాన్ని తమ పర్యవేక్షణలోకి తీసుకుంటున్నామని, అందుకే ఆర్డినెన్స్‌ను ప్రత్యేకమైనదిగా పేర్కొన్నామని నాడు కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం 1993లో పార్లమెంట్ ద్వారా అయోధ్య చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసినప్పుడు కూడా ఓ రాష్ట్రంలోని భూమి కేంద్ర చట్టం ద్వారా కేంద్రానికి ఎలా దక్కుతుందన్న వాదన వచ్చింది. ఆ భూమిపై తాము హక్కులు కోరడం లేదని, బాబ్రీ మసీదు భూమికి సంబంధించిన హక్కులపై వివాదం కొనసాగుతున్నందున అది తేలే వరకు మాత్రమే ఆ భూమి తమ ఆధీనంలో ఉంటుందని కేంద్రం వాదించింది. ఈ వాదనతో ఏకీభవించే సుప్రీం కోర్టు నాడు పార్లమెంట్ చట్టాన్ని సమర్థించింది. 2010లో అయోధ్య టైటిల్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా అనే హిందూ సంస్థతోపాటు రామ్ లల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు పంచాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐదు అప్పీళ్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. వాటిపైనే ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు వివాదాస్పద భూమిలో రామాలయాన్ని అనుమతిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకరావాలంటే ఆ భూమిపై తన హక్కులను ముందుగా స్థిర పర్చుకోవాలి. అందుకు యూపీ అసెంబ్లీ ద్వారా ఓ చట్టం తీసుకరావాల్సి ఉంటుంది. ఇది అత్యవసరమైన అంశం కాదుకనుక, కేంద్రం కూడా ఆర్డినెన్స్‌కు బదులుగా పార్లమెంట్ ద్వారానే మరో చట్టం తీసుకరావాల్సి ఉంటుంది. ఈ చట్టాలన్ని సుప్రీం కోర్టు ముందు చెల్లుబాటు కావాలి. భారత్ లౌకిక రాజ్యాంగాన్ని కలిగి ఉన్నందున అది సాధ్యమయ్యే పనికాదు. మతాలకు అతీతంగా వ్యవహరించాలని, ఏ మతానికి సానుకూలంగా. పక్షపాతంగా వ్యవహరించడానికి వీల్లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 1994 నాటి ‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్రం’ కేసులో తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పింది. -
వారిద్దరికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది!
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ధంధూకా, దహోద్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. జాతీయ నేతలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, అంబేడ్కర్లకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. అయోధ్య అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలతో ముడిపెడుతోందని ఆయన మండిపడ్డారు. 2019 వరకు అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాన్ని వాయిదా వేయాలన్న కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశం గురించి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బాధ లేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించారు. 2019వరకు అయోధ్య సమస్యకు పరిష్కారం కాకుండా ఎవరు ఆపలేరని అన్నారు. అయోధ్య సమస్యకు పరిష్కారం దొరకడం కాంగ్రెస్ ఇష్టం లేదన్నారు. ‘ట్రిపుల్ తలాఖ్‌పై మౌనం వహించకుండా నేను స్పష్టమైన వైఖరిని వెల్లడించాను. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూదు. ఇది మహిళల హక్కుల సంబంధించిన విషయం. మానవత్వమే ముఖ్యం.. ఆ తర్వాతే ఎన్నికలు’ అని అన్నారు. పండిట్ నెహ్రూ ఆధిపత్యం కాంగ్రెస్‌లో బలంగా ఉన్న రోజుల్లో రాజ్యాంగ అసెంబ్లీలో అంబేద్కర్‌కు చోటు కష్టమయ్యేలా చేసిందని, అంబేద్కర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని మోదీ దుయ్యబట్టారు. -
‘యూపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదంపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం లేదని సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా అన్నారు. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధికే ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. అయోధ్య భూ వివాదం కేసును అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారు. ఉత్తరప్రదేశ్ శాంతిసామరస్య పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో అయోధ్య అంశాన్ని మళ్లీ తెర మీదకు తేవడం సరికాద’ని అభిప్రాయపడ్డారు.