సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసును రోజువారి ప్రాతిపదిక త్వరతగతిన విచారించేందుకు ప్రత్యేక బెంచీని ఏర్పాటు చేయాల్సిన సుప్రీం కోర్టు అందుకు నిరాకరించడమే కాకుండా ఆ విషయాన్ని వచ్చే జనవరి నెలకు వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలంటూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ లాంటి బీజేపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. చేస్తున్నాయి. అది సాధ్యం అయ్యే పనేనా? కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినా, చట్టాన్ని తీసుకొచ్చినా కోర్టు ముందు అవి నిలబడగలవా? భారత రాజ్యాంగం ఓ మతానికి సానుకూలంగా వ్యవహరించేందుకు అనుమతిస్తుందా?
అయోధ్యలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదును హిందూ కర సేవకులు విధ్వంసం చేసిన నేపథ్యంలో తలెత్తిన అల్లర్లను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అంతకుముందు బాబ్రీ మసీదు ఉన్న 2.7 ఎకరాల స్థలంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని మొత్తం 66.7 ఎకరాల భూమిని ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం స్వాధీనం చేసుకుంది. ఆ స్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది అవడం వల్ల దాని మీద కేంద్రానికి టైటిల్ హక్కులు రావాలంటే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో చట్టం తీసుకరావాల్సి ఉంటుంది. తాము భూమిపై హక్కులు కోరడం లేదని, అల్లర్ల నివారణం కోసం, ఆ స్థలాన్ని తమ పర్యవేక్షణలోకి తీసుకుంటున్నామని, అందుకే ఆర్డినెన్స్‌ను ప్రత్యేకమైనదిగా పేర్కొన్నామని నాడు కేంద్రం వివరణ ఇచ్చింది.
ఈ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం 1993లో పార్లమెంట్ ద్వారా అయోధ్య చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసినప్పుడు కూడా ఓ రాష్ట్రంలోని భూమి కేంద్ర చట్టం ద్వారా కేంద్రానికి ఎలా దక్కుతుందన్న వాదన వచ్చింది. ఆ భూమిపై తాము హక్కులు కోరడం లేదని, బాబ్రీ మసీదు భూమికి సంబంధించిన హక్కులపై వివాదం కొనసాగుతున్నందున అది తేలే వరకు మాత్రమే ఆ భూమి తమ ఆధీనంలో ఉంటుందని కేంద్రం వాదించింది. ఈ వాదనతో ఏకీభవించే సుప్రీం కోర్టు నాడు పార్లమెంట్ చట్టాన్ని సమర్థించింది. 2010లో అయోధ్య టైటిల్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా అనే హిందూ సంస్థతోపాటు రామ్ లల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు పంచాలంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐదు అప్పీళ్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. వాటిపైనే ఇప్పుడు విచారణ కొనసాగుతోంది.
ఇప్పుడు వివాదాస్పద భూమిలో రామాలయాన్ని అనుమతిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకరావాలంటే ఆ భూమిపై తన హక్కులను ముందుగా స్థిర పర్చుకోవాలి. అందుకు యూపీ అసెంబ్లీ ద్వారా ఓ చట్టం తీసుకరావాల్సి ఉంటుంది. ఇది అత్యవసరమైన అంశం కాదుకనుక, కేంద్రం కూడా ఆర్డినెన్స్‌కు బదులుగా పార్లమెంట్ ద్వారానే మరో చట్టం తీసుకరావాల్సి ఉంటుంది. ఈ చట్టాలన్ని సుప్రీం కోర్టు ముందు చెల్లుబాటు కావాలి. భారత్ లౌకిక రాజ్యాంగాన్ని కలిగి ఉన్నందున అది సాధ్యమయ్యే పనికాదు. మతాలకు అతీతంగా వ్యవహరించాలని, ఏ మతానికి సానుకూలంగా. పక్షపాతంగా వ్యవహరించడానికి వీల్లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 1994 నాటి ‘ఎస్‌ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్రం’ కేసులో తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment