‘విద్రోహి’ జీవితం.. విద్యార్థులకే అంకితం
న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం, వారి హక్కుల కోసం మూడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేసిన గుండె అలసిపోయి ఆగిపోయింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఓ చెట్టును ఆవాసం చేసుకుని యూనివర్సిటీ యాజమాన్య పోకడలను అధిక్షేపించిన స్వరం మూగబోయింది. సామాజిక రుగ్మతలపై అలుపెరుగకుండా చేసిన యుద్ధం అర్ధంతరంగా ముగిసిపోయింది. యూనివర్సిటీ ప్రాంగణంలోనూ.. దాని బయటా విద్యార్థుల ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఆ శ్వాస నిలిచిపోయింది. శ్వాస కలం పేరు విద్రోహి.. ఆ గొంతుక అసలు పేరు రమాశంకర్ యాదవ్.. ఏ చెట్టునైతే ఆయన నివాసం చేసుకున్నారో.. ఆ చెట్టు నీడనే తుది శ్వాస విడిచారు. 58 ఏళ్ల వయసులోనే విద్యార్థి లోకాన్ని.. వారికి తానిచ్చిన ఉద్యమస్ఫూర్తిని వదిలేసి కన్నుమూశారు.
ఉత్తర్రపదేశ్‌లో 1957లో జన్మించిన యాదవ్ 1980లో జేఎన్‌యూలో ఎంఏ హిందీలో చేరారు. చేరిన రోజు నుంచే విద్యార్థి ఉద్యమాలో్ల చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనల బాట పట్టిస్తున్నారంటూ యాజమాన్యం ఆయన్ని 1983లో తాత్కాలికంగా క్యాంపస్ నుంచి సస్పెండ్ చేసినా ఆయన క్యాంపస్‌ను వీడిపోలేదు. అక్కడే ఓ చెట్టు కింద భీష్మించుకుని కూచున్నారు. మంగళవారం ఆయన మరణించేంత వరకూ ఆ చెట్టు నీడనే ఉండిపోయారు. బలవంతంగా ఆయన్ను యూనివర్సిటీ నుంచి పంపించాలని చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. విద్యార్థులిచ్చే కాఫీ, ప్లేట్ మీల్స్తోనే కాలం గడిపారు.
విద్యార్థులకు సంబంధించిన అన్ని ఆందోళనల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఏనాడూ అక్షర బద్ధం చేయని తన కవిత్వం వినిపించారు. విద్యార్థులకు ప్రేమాస్పదుడిగా మారారు. క్యాంపస్ యాజమాన్యం 2010లో సెక్యూరిటీ ద్వారా ఆయన్ని క్యాంపస్ నుంచి బయటకు పంపించటంతో, అధికార విద్యార్థి సంఘం దీనికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది. రెండు వారాలపాటు క్యాంపస్ మూతపడింది. ఫలితంగా యాదవ్‌ను మళ్లీ క్యాంపస్‌లోకి అనుమతించారు. అప్పటివరకు విద్యార్థుల దయాదాక్షిణ్యాలతో బతికిన యాదవ్‌కు క్యాంటిన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఉచిత టీ, భోజన సదుపాయాలను కల్పించాల్సి వచ్చింది.. చలికాలం కోసం గొంగళ్లు ఇచ్చారు.
వర్షాకాలంలో పడుకునేందుకు విద్యార్థి సంఘం ఆఫీస్‌లో వెసులుబాటు కల్పించారు. గ్వాలియర్‌కు చెందిన నితిన్ పమ్నాని 2011లో ఆయనపై ‘మై తుమ్హారా కవి హూ’ అనే శీర్షికతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఆ డాక్యుమెంటరీకి అవార్డు కూడా వచ్చింది. క్యాంపస్ విద్యార్థులు బుధవారం సంతాప సభ ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన లేకున్నా ఆయన కవిత్వం పంక్తులు తమ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయని విద్యార్థి నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.