ramagunadm
-
అక్కడ అన్నీ ఉన్నాయ్.. అధికారుల నిర్లక్ష్యంతో సహా!
రామగుండం: సహజ వనరులకు కొదవ లేదు.. శ్రామిక శక్తికి ఏలోటూ లేదు.. స్థలం కొరత అంతకన్నా లేదు.. నిధుల విడుదలలో ఏమాత్రం జాప్యం కావడంలేదు.. ఉన్నదంతా నిలువెల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే.. అందుకే రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తొలి థర్మల్ విద్యుత్ రామగుండంలోనే.. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం రామగుండంలోనే నిర్మించారు.అంటే రామగుండం పారిశ్రామి ప్రాంతం ప్రాధాన్యత ఎంతఉందో అర్థం చేసుకోవచ్చు. ►ఎన్టీపీసీ, బీ–థర్మల్, రైల్వేస్టేషన్, సింగరేణి బొగ్గు గనులు, ఎరువుల తయారీ కంపెనీ, సిమెంట్ కంపెనీ తదితర పరిశ్రమలు రామగుండం పేరిట స్థాపించారు. ► రాముడు సీతను నడియాడిన నేల కూడా ఇక్కడే ఉంది. ► రాముడు–సీతాదేవి సంచరించిన ఆనవాళ్లు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయని చర్రికారులు చెబుతున్నారు. ►ఇందుకు నిదర్శనంగా భక్తులు ఆయా ప్రాంతాలను దర్శించుకొని పునీతులవుతున్నారు. పర్యాటకంపై దృష్టి సారిస్తే.. పట్టణ సమీపంలోని రామునిగుండాల ఆధ్మాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రామలక్ష్మణుడు, సీతాదేవి ఇక్కడ సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండపై 108 గుండాలు ఉండగా ఇందులో ఒకగుండం 200 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఓలోయ ఉంది. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 108 గుండాల్లో అన్నికాలాల్లోనూ నీరు సమృద్ధిగా లభిస్తూ ఉండడం ఇక్కడి విశేషం. ఇందులో ప్రధానమైనవి పాలగుండం, నేతిగుండం, జీడిగుండం, పసుపుగుండం, తొక్కుడుగుండం, యమగుండం, ధర్మగుండం, మోక్షగుండం ఉన్నాయి. కొండపై లోయ.. సొరంగం.. ►రామునిగుండాల కొండపై లోయ మధ్యలో సొరంగ మార్గం ఉంది. దీనిని యమకోణమని పేర్కొంటారు. ►ఈ సొరంగం గుండా నిత్యం నీరు పారుతూ ఉంటుంది. ► ప్రతీ శ్రావణ, కార్తీకమాసంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీసీతారామ లక్ష్మణులను దర్శించుకుంటారు. ►ఇంతటి ప్రాధాన్యం కలిగిన రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ► కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా రామగుండం ప్రాధాన్యం గుర్తించి దీని పేరిటనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తారని భావించినా జాబితాలో ఆ పేరు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. మూలనపడ్డ ప్రణాళిక.. రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో 2007లో అప్పటి మున్సిపల్ చైర్మన్ రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇస్కాన్ సంస్థను సంప్రదించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ తరహాలో దేవాలయం, కొండకింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇస్కాన్ ప్రతినిధులు కూడా క్షేత్రసందర్శనకు రాగా అటవీశాఖ అధికారుల అభ్యంతరంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యాయి. భూ వివాదాస్పద అంశాలతో ఇస్కాన్ సంస్థ ముందుకు రాలేదు. అభివృద్ధికి ఆమడదూరం రామునిగుండాలను అభివృద్ధి చేసేందుకు అటవీ భూముల సాకుతో అభివృద్ధికి నోచుకోకపోవడం లేదు. ఆధ్యాత్మిక చరిత్ర క లిగిన ప్రాంతాలను వివక్ష లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అర్హత ఉన్నా పాలకుల ఆధిపత్య ధోరణితో అభివృద్ధికి దూరంగా ఉంది. – భట్టు ప్రసాద్, పట్టణవాసి అవకాశం ఉన్నా.. రామగుండం పేరిట ఉన్న ప్రతీ పరిశ్రమకు సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్)కింద నిధులు విడుదల చేసి అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులను పాలకులు వేరే ప్రాంతాలకు తరలించుకెళ్లారు. ఏ ప్రాంతమైనా ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయి. – ముస్త్యాల శంకర్లింగం, పట్టణవాసి -
వామ్మో... దోమలు...
సాక్షి, కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమలు విజృంభిస్తున్నాయి. నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా దోమలు వ్యాపిస్తున్న తీరుపై నగర ప్రజానికం ఆందోళన చెందుతోంది. దోమల దాడికి వందలాది మంది విషజ్వరాల భారిన పడ్డారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోనే దోమల బెడద ఎక్కువవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాలువల్లో పూడికలు తీయకపోడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దోమల ధాటికి బల్దియా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దోమల నివాస ప్రాంతాలు డ్రెయినేజీల్లో పూడికలు తీయకపోడంతో పారిశుధ్యం పేరుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. ఖాళీ స్థలాలలో పిచ్చిమొక్కలు, చెత్తకుప్పల తొలగింపుపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా దోమలకు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. పట్ట పగలు కూడా ఇళ్ళల్లో ఉండాలంటే దోమల నివారణకు ‘ఆల్ఔట్’ పెట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రాత్రిళ్లు మాత్రమే కుట్టే దోమలు ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా దాడి చేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న అదనపు ఖర్చు దోమల నివారణ కోసం కూడా ప్రతీ కుటుంబం ఇంటి బడ్జెట్లో అదనంగా కొంత మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. దోమల నివారణకు మస్కిటో కాయల్స్, కెమికెల్స్తోపాటు బ్యాటింగ్ తదితర వాటి కోసం కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటి సరుకులతోపాటు దోమల నివారణకు కూడా అదనపు వ్యయం చేయాల్సి రావడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. కానరాని నివారణ చర్యలు రోజురోజుకు పెరుగుతున్న దోమలను నివారించడంలో అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిల్వ ఉన్న మురుగు నీటి గుంటల్లో గంభూషియా చేపలను వెయ్యడం లేదు. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్, మలాథియిన్ స్ప్రె తదితర నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో మొక్కుబడిగా పూడిక తీయించి చేతులు దుల్పుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిసారించాను. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాపించవు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. – చిట్టూరి రాజమణి, నగర మేయర్ చర్యలు తీసుకుంటున్నాం దోమల నివారణకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మలాథియిన్ స్ప్రె చేయిస్తున్నాం. నీరు నిల్వ ఉన్న గుంటల్లో గంభూషియా చేపలను వేస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – కిషోర్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ -
ఎన్టీపీసీలో ఇంజినీర్స్ డే
జ్యోతినగర్: దేశాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకమని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్ ఉద్యోగ వికాస కేంద్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) చాప్టర్ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన 49వ ఇంజినీర్స్ డే వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రోజురోజుకూ మారుతున్న ప్రపంచ పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇంజనీర్స్‌డే ప్రతిజ్ఞ అనంతరం బ్రోచర్ విడుదల చేశారు. ‘యువ ఇంజనీర్ల నైపుణ్యం, పరిశ్రమల్లో సంస్కరణలు’ అంశంపై ఈఎస్సీఐ డైరెక్టర్ డి.ఎన్.రెడ్డి‡Sవిద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వ్యాసరచన పోటీలలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించిన కరీంనగర్ వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆమనికి బహుమతి అందించారు. అనంతరం సోమారపు సత్యనారాయణను పూలమాల, శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర, ఆర్జీ–3 జీఎం డాక్టర్. ఎం.ఎస్.వెంకట్రామయ్య, రామగుండం జీఎం దాస్‌గుప్తా, చంద్రశేఖర్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.