సాక్షి, కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమలు విజృంభిస్తున్నాయి. నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా దోమలు వ్యాపిస్తున్న తీరుపై నగర ప్రజానికం ఆందోళన చెందుతోంది. దోమల దాడికి వందలాది మంది విషజ్వరాల భారిన పడ్డారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోనే దోమల బెడద ఎక్కువవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాలువల్లో పూడికలు తీయకపోడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దోమల ధాటికి బల్దియా ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
దోమల నివాస ప్రాంతాలు
డ్రెయినేజీల్లో పూడికలు తీయకపోడంతో పారిశుధ్యం పేరుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. ఖాళీ స్థలాలలో పిచ్చిమొక్కలు, చెత్తకుప్పల తొలగింపుపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా దోమలకు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. పట్ట పగలు కూడా ఇళ్ళల్లో ఉండాలంటే దోమల నివారణకు ‘ఆల్‌ఔట్’ పెట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రాత్రిళ్లు మాత్రమే కుట్టే దోమలు ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా దాడి చేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
పెరుగుతున్న అదనపు ఖర్చు
దోమల నివారణ కోసం కూడా ప్రతీ కుటుంబం ఇంటి బడ్జెట్‌లో అదనంగా కొంత మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. దోమల నివారణకు మస్కిటో కాయల్స్, కెమికెల్స్‌తోపాటు బ్యాటింగ్ తదితర వాటి కోసం కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటి సరుకులతోపాటు దోమల నివారణకు కూడా అదనపు వ్యయం చేయాల్సి రావడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు.
కానరాని నివారణ చర్యలు
రోజురోజుకు పెరుగుతున్న దోమలను నివారించడంలో అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిల్వ ఉన్న మురుగు నీటి గుంటల్లో గంభూషియా చేపలను వెయ్యడం లేదు. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్, మలాథియిన్ స్ప్రె తదితర నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో మొక్కుబడిగా పూడిక తీయించి చేతులు దుల్పుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిసారించాను. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాపించవు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
– చిట్టూరి రాజమణి, నగర మేయర్
చర్యలు తీసుకుంటున్నాం
దోమల నివారణకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మలాథియిన్ స్ప్రె చేయిస్తున్నాం. నీరు నిల్వ ఉన్న గుంటల్లో గంభూషియా చేపలను వేస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం.
– కిషోర్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment