రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు
* హాజరుకానున్న 19.78 లక్షల మంది
* 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
* ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 19,78,379 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,29,090 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 10,49,289 మంది పరీక్షలు రాయనున్నారు. 975 ప్రభుత్వ, 187 ఎయిడెడ్, 1,499 ప్రైవేటు కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడించారు. సోమవారమిక్కడి బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన పరీక్షలు మార్చి 26తో పూర్తవుతాయని, అన్ని పరీక్షలు ఏప్రిల్ 1న ముగుస్తాయని తెలిపారు.
ప్రధాన పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌ను ఈనెల 28న ప్రారంభిస్తామని, సంస్కృతం పేప రు మూల్యాంకనాన్ని ఈనెల 19 నుంచే మొదలుపెడతామని చెప్పా రు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. స్పాట్ వాల్యుయేషన్‌లో తప్పులు చేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్య, పోలీసు, రెవెన్యూ సిబ్బంది తో 133 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 135 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోర్డు నుంచి కూడా సీనియర్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తారని వివరించారు. ప్రథమ సంవత్సర విద్యార్థుల ద్వితీయ భాష పేపరు, ద్వితీయ సంవత్సర విద్యార్థుల మ్యాథ్స్-2ఏ, మ్యాథ్స్-2బీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బ్రిడ్జి కోర్సు గణితం విషయంలో ఓల్డ్, న్యూ పేపర్లు ఉన్నాయని.. ప్రశ్నపత్రం తీసుకోగానే సరిగ్గా చూసుకొని పరీక్ష రాయాలని సూచించారు.
ఆలస్యంగా వస్తే అనుమతి లేదు...
ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 8:30 గంటల కంటే ముందుగానే చేరుకోవాలి. 8:30 గంటల నుంచి 8:45 గంటల వరకు పరీక్ష హాల్లోకి పంపిస్తారు. ఆ తర్వాత కూడా 9 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. అయితే వారు తమ ఆలస్యానికి గల కారణాలు రాతపూర్వకంగా తెలియజేయాలి. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించరు. సెల్ఫోన్లు, ఎల క్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు. ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తించే లెక్చరర్లు కూడా ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు సెల్‌ఫోన్ అనుమతి ఉన్నా, వారి ఫోన్లపై ట్యాంపింగ్ తరహా నిఘా ఉంటుంది. వారి ఫోన్ల నుంచి ఏయే నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు వెళ్లాయనే సమాచారం సేకరిస్తారు. తద్వారా ప్రశ్నలు లీక్ వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సమస్య లేకుండా, విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షకు ముందురోజే తమకు కేటాయించిన కేంద్రానికి వెళ్లి చూసుకోవాలి. ప్రైవేటు యాజమాన్యాలు మాల్ ప్రాక్టీస్, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించినా, చర్యలు చేపడతారు. హాల్‌టికెట్ సమస్యలు వస్తే జిల్లాల్లో ఆర్ఐఓ కార్యాలయాల్లో, ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో 040-24601010 ఫోన్ నంబరు, 040-24655027 నంబరుకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
వెబ్సైట్లో ఇంటర్ హాల్‌టికెట్లు
ఈనెల 12 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను తమ వెబ్సైట్లోనూ (ఠీఠీఠీ.ఛజ్ఛ్చీఞ.ఛిజజ.జౌఠి.జీ) అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 11న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు తమ పదో తరగతి హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను వెంట తీసుకెళ్లాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులైతే ప్రథమ సంవత్సర హాల్‌టికెట్ నంబరును, పుట్టిన తేదీ వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా తాము బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని వచ్చినట్లు ఇన్విజిలేటర్‌కు డిక్లరేషన్‌ను ఇవ్వాలని నాయక్ వివరించారు.
అందరి అభిప్రాయాల మేరకే మూల్యాంకనం
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేయిస్తామని బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. తెలంగాణ విద్యార్థుల పేపర్లను తెలంగాణలోనే మూల్యాంకనం చేయించాలని కోరుతూ సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కార్యాలయం వద్ద తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సభ్యులు నినాదాలు చేశారు. ఎక్కడి పేపర్లను అక్కడే మూల్యాంకనం చేయించాలని కోరుతూ నాయక్‌కు టీఎల్ఎఫ్ కన్వీనర్ వెంకటస్వామి వినతపత్రం అందజేశారు.
పరీక్ష కేంద్రాలు: 2,661. వీటిలో సెల్ఫ్ సెంటర్లు 95, సమస్యాత్మక కేంద్రాలు 230
ప్రథమ సంవత్సర విద్యార్థులు (జనరల్) - 8,69,377 (బాలురు-4,45,061, బాలికలు-4,24,316)
ప్రథమ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు - 59,713 (బాలురు 37,116, బాలికలు 22,597)
ద్వితీయ సంవత్సర విద్యార్థులు (రెగ్యులర్) - 8,01,467 (బాలురు - 4,13,123, బాలికలు - 3,88,344)
ద్వితీయ సంవత్సర విద్యార్థులు (ప్రైవేటు) - 1,52,669 (బాలురు - 98,233, బాలికలు - 54,446)
ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు (రెగ్యులర్) - 76,433 (బాలురు- 40,405, బాలికలు - 36,028)
ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు (ప్రైవేటు) - 18720 (బాలురు- 11,387, బాలికలు - 7,333)
ఇంటర్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మార్పు
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మారనుంది. ఈ మేరకు ఇంటర్ విద్య అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల సిలబస్‌ను మార్పు చేసిన అధికారులు.. ఇప్పుడు ఆర్ ్ట్స సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. మొదట ప్రథమ సంవత్సర కోర్సు సిలబస్‌ను మారుస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయ సంవత్సర కోర్సుల సిల బస్‌ను మారుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో కొన్ని పాఠ్యాంశాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.