ఈవీఎంల కేటాయింపు : కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. స్థానిక ఈవీఎం గోదాము వద్ద ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు కేటాయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 3,334 పోలింగ్ కేంద్రాలుండగా, 6,668 ఈవీఎంలు అవసరం కాగా, 9 శాతం రిజర్వుతో కలిపి రాయదుర్గం 534, ఉరవకొండ 493, గుంతకల్లు 528, తాడిపత్రి 536, శింగన మల 554, అనంతపురంఅర్బన్499, కళ్యాణదుర్గం 499, రాప్తాడు 484, మడకశిర 482, హిందూపురం 501, పెనుకొండ 541, పుట్టపర్తి 473, ధర్మవరం 569, కదిరి 576 మొత్తం 7,269 ఈవీఎంలు కేటాయించినట్లు తెలిపారు.
నామినేషన్ల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈ నెల 25న రెండో ర్యాండమైజేషన్లో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించాలని ఆర్ఓలకు సూచించారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, జెడ్పీసీఈఓ విజమేందిర, ఏజేసీ రామస్వామి, డీఆర్వో హేమసాగర్, అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ: సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూభవన్, జెడ్పీ హాల్, పెన్నార్భవన్లలో ఈవీఎంలపై మాస్టర్ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాప్తాడు, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్లకు రెవెన్యూభవన్‌లో, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల మాస్టర్ట్రైనర్లకు జిల్లాపరిషత్తు హాల్లో, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం,అనంతపురం అర్బన్ నియోజకవర్గాలకు పెన్నార్ భవన్ మీటింగ్ హాల్లో ఆర్డీఓ స్థాయి అధికారులు మలోలా, చిన్నఓబుళేసు, శశిదేవి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
20న పీఓలకు, ఏపీఓలకు శిక్షణ:శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లతో ఈ నెల 20న 3,700 మంది పీఓలు, 3700 మంది ఏపీఓలకు మొదటి విడత ఈవీఎంలపై నియోజకవర్గ కేంద్రాల్లోనే శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.