ravi shanker
-
భారీ వర్షాలు: దెబ్బతిన్ని పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్: వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట వేసిన రైతులకు పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొంది. వర్షం వరదలతో చేతికందే దశలో ఉన్న వరి పంట నేలవాలి అక్కరకు రాకుండా పోయింది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చొప్పదండి మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన ఆయన రైతులను ఓదార్చారు. ఆరుకాలాల పాటు శ్రమించే అన్నదాతకు అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం మొలకెత్తడం చూసి అమ్ముకోవడానికి సిద్ధం చేయాలని, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రైతులకు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. -
పొలం పనుల్లో ఎమ్మెల్యే బిజీ
సాక్షి, గంగాధర(కరీంనగర్) : ప్రజా సమస్యల పరిష్కారం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలోని పొలంలో వరి సాగు పనుల్లో పాల్గొన్నారు. పొద్దున్నే పొలంలోకి ఎడ్లబండిపై నారు జారవేశారు. అనంతరం పొలంలో నారు పంచి వేశారు. ఎమ్మెల్యే పొలం పనులు చేయడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
'ఉమ్మేసి పారిపోవడం రాహుల్ విధానం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల స్థాయిని మరింత పెంచింది. ఉమ్మేసి పారిపోవడం, ఢీకొట్టి పారిపోవడం రాహుల్ గాంధీ రాజకీయ విధానాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కోసం ర్యాలీ నిర్వహించిన మాజీ మిలటరీ అధికారులకు రాహుల్ తన మద్ధతు తెలిపి అనంతరం బీజేపీ విమర్శలు చేయడంపట్ల స్పందిస్తూ రవిశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓపక్క రాహుల్ పార్టీ నడుపుతున్న విధానంపై ఆ పార్టీలోని ఎందరో సీనియర్ నేతలు పెదవి విరుస్తుండగా.. కొంతకాలం తర్వాత పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారని విమర్శించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, సమస్యను పరిష్కరించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్యాకేజీ, రిప్యాకేజీ ఇచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు రాహుల్‌కు వెంటనే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పెద్ద స్థాయిలో గొంతెత్తి నినదిస్తే ఈరోజు అలా నినదించేవారి సంఖ్య తగ్గిందని అన్నారు.