Ravindar singh
-
'నిరూపించు.. లేదంటే ముక్కు నేలకు రాయి' : మేయర్ సునీల్‌రావు ఫైర్!
కరీంనగర్: స్మార్ట్ సిటీలో రూ.130 కోట్ల కుంభకోణం జరిగిందని, రోడ్డు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణలు చెప్పి, టవర్‌సర్కిల్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీలో భాగంగా రూ.934 కోట్లతో పనులు ప్రారంభించామని.. అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ.539 కోట్లు నగరపాలకసంస్థకు వచ్చాయని... రూ.514 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. ప్రతీ పని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిధిలో జరుతుతుందన్నారు. మూడు సంస్థల రిపోర్ట్ తర్వాతే బిల్లులు చెల్లిస్తారన్నారు. గత పాలకవర్గం హయాంలోనే టెండర్లు పూర్తయినా.. రవీందర్ సింగ్ తనకు నచ్చిన ఏజెన్సీకి టెండర్లు దక్కలేదని ఏడాది పాటు పనులు పెండింగ్‌లో పెట్టారన్నారు. టవర్ సర్కిల్ ఆధునీకరణ పేరిట నిర్మాణాలు కూలగొట్టాలనే ఆలోచన చేసిన గొప్ప మేధావి అని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో రవీందర్ సింగ్ లాంటి వెన్నుపోటుదారులు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ బీఆర్ఎస్ గెలిచిందన్నారు. కార్పొరేటర్, సివిల్సప్లై చైర్మన్‌గా ఏకకాలంలో రెండు జీతాలు తీసుకున్నారని విమర్శించారు. రవీందర్ సింగ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో కార్పొరేటర్లు గందే మాధవి మహేశ్, గంట కళ్యాణి, కంసాల శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, చాడగొండ బుచ్చిరెడ్డి, వాల రమణారావు, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, కుర్ర తిరుపతి, సల్ల శారద రవీందర్, ఎడ్ల సరిత అశోక్, వంగల శ్రీదేవి పవన్, పిట్టల వినోద శ్రీనివాస్ ఉన్నారు. ఇవి చదవండి: యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్ -
Karimnagar: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీలో అంతర్గతపోరుతో కరీంనగర్ జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందుతున్న క్రమంలో జిల్లాలో ఇంటిపోరు రచ్చకెక్కడం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా రవీందర్‌సింగ్ అల్లుడు సోహన్‌సింగ్ మంత్రిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోహన్ సింగ్ తీరును మంత్రి వర్గీయులతోపాటు జిల్లా పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ కమల్జిత్కౌర్ దంపతులకు పార్టీ షోకాజ్ జారీ చేసింది. మూడురోజుల్లో సమాధానం చెప్పాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే..! వాస్తవానికి ఈ విభేదాలు రాత్రికి రాత్రి మొదలవలేదు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని అలకబూనిన రవీందర్ సింగ్ తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారిపై మంత్రివర్గీయులు కేసులు పెట్టిస్తూ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ రోజు సైతం రవీందర్‌సింగ్, ఆయన అన్న కూతురు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్‌లు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టపాసులు కాల్చారన్న అభియోగంపై రవీందర్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. తరువాత ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. వెంటనే పార్టీలోకి పునరాగమనం చేశారు. రీ ఎంట్రీ తరువాత కూడా రవీందర్‌సింగ్, మంత్రి వర్గాల మధ్య విభేదాలు ఏమాత్రం చల్లారలేదు. ఇటీవల కాలంలో కౌన్సిల్ సమావేశంలో నీటికొరతపై కమల్జిత్కౌర్ నిరసన తెలపడం, స్మార్ట్ సిటీ పనులపై రవీందర్‌సింగ్ ఆరోపణలతో మంత్రివర్గంతో అగాథం మరింత పెరిగింది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌పై కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ భర్త సోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యల ఆడియో లీకవడం పార్టీలో చిచ్చురేపింది. మంత్రికి, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి నేతత్వంలో పలువురు కార్పొరేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అయితే.. సీఎం కేసీఆర్ ఉత్తరభారతదేశ పర్యటనల నేపథ్యంలో తమకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో మంత్రి వర్గం తమపై రాజకీయ దాడి చేస్తోందని రవీందర్‌సింగ్ వర్గం ఎదురుదాడికి దిగుతోంది. మూడురోజులే గడువు..! పార్టీ ప్రతిష్ట మసకబారేలా, మంత్రి కమలాకర్‌కు పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, ఆమెభర్త సోహన్‌సింగ్‌లకు పార్టీ అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు బుధవారం జారీ చేసిన షోకాజుల్లో స్పష్టం చేశారు. దీంతో మూడురోజుల అనంతరం ఈ దంపతులు ఏమని వివరణ ఇస్తారు? ఆ సమాధానంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు సంతృప్తి చెందుతారా? అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) -
కేసీఆర్ దగ్గర మోదీ ట్యూషన్ చెప్పించుకోవాలె
టవర్‌సర్కిల్: సంక్షేమ పథకాలు అమలు విషయంలో సీఎం కేసీఆర్ దేశంలోనే ముందువరుసలో ఉన్నారని.. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేసీఆర్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని నగర మేయర్ రవీందర్‌సింగ్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జనచైతన్యయాత్ర పేరిట బీజేపీ హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అడ్డగోలుగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నేతల మగతనాన్ని ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతల మగతనం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. మిషన్‌భగీరథతో ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని సవాలు విసిరిన వ్యక్తి కేసీఆర్ అని, 28 రాష్ట్రాల మంత్రులు ఇక్కడకు వచ్చి అభివృద్ధిని కొనియాడుతున్నారని గుర్తు చేశారు. వారిలోనూ బీజేపీ నేతలతోపాటు కేంద్ర మంత్రులు ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. జన్ధన్ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న కేంద్రం ప్రజలను మోసం చేసిందన్నారు. వై.సునీల్‌రావు, పెద్దపల్లి రవీందర్, కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, సాదవేని శ్రీనివాస్, మేకేల్ శ్రీను, దండబోయిన రాము, జక్కం నర్సయ్య, గుంజపడుగు హరిప్రసాద్, యూసుఫ్, ప్రిన్స్‌రాజు, పురుషోత్తంసోనీ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్‌గా టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్సిం గ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఎమ్మెల్యే గం గుల కమలాకర్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రవీందర్‌సింగ్‌ను మేయర్‌గా, గు గిల్లపు రమేశ్‌ను డెప్యూటీ మేయర్‌గా, ఫ్లోర్‌లీడర్‌గా మహ్మద్ ఆరిఫ్, విప్‌గా కంసాల శ్రీనివాస్ పేర్లను ప్రకటించారు. ఈ నలుగురి పేర్లు ఫలితాలు వెలువడిన నాటినుంచే ప్రచారంలో ఉన్నా పరోక్ష ఎన్నికల తేదీ ఖరారైన తర్వాతే వెల్లడించాలని ఇన్ని రోజులు జాప్యం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే కమలాకర్ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికపై చర్చించారు. గతంలో ఎంపిక చేసిన పేర్లనే ఖరారు చేసిన సీఎం.. అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సమానప్రాతినిథ్యం కల్పించినట్లు వెల్లడించారు. నాలుగుసార్లు మున్సిపల్లో ప్రాతినిథ్యం ఇరవై ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న రవీందర్‌సింగ్ ఒక పర్యాయం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. చాలాకాలం పాటు బీజేపీలో కొనసాగారు. ఆపార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం 2006లో ఆయన సమక్షంలో రవీందర్‌సింగ్ టీఆర్ఎస్లో చేరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా మెదులుతున్నారు. గతంలో రవీందర్‌సింగ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కరీంనగర్ నుంచి పలువురు నేతలు ఎమ్మెల్సీగా రవీందర్‌సింగ్‌ను ఎంపిక చేయాలని కేసీఆర్‌ను కోరారు. సామాజిక సమీకరణల వల్ల ఎమ్మెల్సీ పదవి దక్కలేదని తెలిసింది. ప్రస్తుతం రవీందర్‌సింగ్ టీఆర్ఎస్ నగర అధ్యక్షుడిగా పనిచేస్తూ 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. మున్సిపల్ పాలనపై పట్టున్న రవీందర్‌సింగ్‌ను ఎన్నికల ముందు నుంచే మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేశారు. నగరంలోని సుమారు 50 సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి పూర్తి మెజారిటీ ఉండడంతో ఇక మేయర్ పదవి రవీందర్‌సింగ్‌కు లాంఛనమే కానుంది. మార్పులు లేకుండానే.. మేయర్‌తో పాటు డెప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, విప్ పదవులకు గతంలో ఎంపిక చేసిన అభ్యర్థులనే ప్రకటించారు. డెప్యూటీ మేయర్ అభ్యర్థి గుగ్గిల్లపు రమేశ్ ఒకసారి కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత పాలక వర్గంలో ఆయన సతీమణి మంజుల కూడా కార్పొరేటర్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే గంగులకు అత్యంత సన్నిహితుడైన రమేశ్ గతంలో టీడీపీలో నగర అధ్యక్షుడిగా పనిచేశారు. గంగుల టీఆర్ఎస్లో చేరడంతో రమేశ్ కూడా ఆయన బాటలోనే నడిచారు. ప్రస్తుతం 18వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందాడు. ఫ్లోర్ లీడర్ అభ్యర్థిగా ఎన్నికైన మహ్మద్ ఆరిఫ్ 6వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎంఐఎం అభ్యర్థిపై గెలుపొందారు. ఎంఐఎంకు పట్టున్న 6వ డివిజన్ నుంచి గెలుపొంది సత్తా చాటుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. విప్ అభ్యర్థి కంసాల శ్రీనివాస్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజాసంఘాల జేఏసీలో కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరి 5వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. విహారయాత్రకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు పూర్తి మెజారిటీ ఉండడంతో ఎలాంటి క్యాంపులు అవసరం లేదని మొదట భావించినా కార్పొరేటర్ల కోరిక మేరకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే కమలాకర్ తెలిపారు. మహిళా కార్పొరేటర్లు అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళ్లనున్నారు. నేడో రేపో విహారయాత్రకు బయలు దేరే కార్పొరేటర్లు జులై 3వ తేదీన జరిగే మేయర్ ఎన్నికకు ముందు రోజు తిరిగి వస్తారన్నారు. పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ ప్రాంతాలను చూసి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.