మాట్లాడుతున్న మేయర్ సునీల్‌రావు
కరీంనగర్: స్మార్ట్ సిటీలో రూ.130 కోట్ల కుంభకోణం జరిగిందని, రోడ్డు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణలు చెప్పి, టవర్‌సర్కిల్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
స్మార్ట్ సిటీలో భాగంగా రూ.934 కోట్లతో పనులు ప్రారంభించామని.. అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ.539 కోట్లు నగరపాలకసంస్థకు వచ్చాయని... రూ.514 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. ప్రతీ పని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిధిలో జరుతుతుందన్నారు. మూడు సంస్థల రిపోర్ట్ తర్వాతే బిల్లులు చెల్లిస్తారన్నారు. గత పాలకవర్గం హయాంలోనే టెండర్లు పూర్తయినా.. రవీందర్ సింగ్ తనకు నచ్చిన ఏజెన్సీకి టెండర్లు దక్కలేదని ఏడాది పాటు పనులు పెండింగ్‌లో పెట్టారన్నారు. టవర్ సర్కిల్ ఆధునీకరణ పేరిట నిర్మాణాలు కూలగొట్టాలనే ఆలోచన చేసిన గొప్ప మేధావి అని ఎద్దేవా చేశారు.
కరీంనగర్‌లో రవీందర్ సింగ్ లాంటి వెన్నుపోటుదారులు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ బీఆర్‌ఎస్ గెలిచిందన్నారు. కార్పొరేటర్, సివిల్‌సప్‌లై చైర్మన్‌గా ఏకకాలంలో రెండు జీతాలు తీసుకున్నారని విమర్శించారు. రవీందర్ సింగ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో కార్పొరేటర్లు గందే మాధవి మహేశ్, గంట కళ్యాణి, కంసాల శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, చాడగొండ బుచ్చిరెడ్డి, వాల రమణారావు, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, కుర్ర తిరుపతి, సల్ల శారద రవీందర్, ఎడ్ల సరిత అశోక్, వంగల శ్రీదేవి పవన్, పిట్టల వినోద శ్రీనివాస్ ఉన్నారు.
ఇవి చదవండి: యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్
Comments
Please login to add a commentAdd a comment