Ravindra Kumar Ramavath
-
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
చందంపేట (దేవరకొండ) : రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పోలేపల్లి, చందంపేట, గుంటిపల్లి, ముడుదండ్ల గ్రామాల పరిధిలోని చెరువుల వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గుత్తా మాట్లాడుతూ 70 ఏళ్లుగా పూడికతో నిండిన కాల్వలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాల్వల ద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లోని చెరువులు జలకళను సంతరించుకోవడంతో రైతన్నలకు సాగు నీటికి డోకా లేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి డిండి రిజర్వాయర్ ద్వారా చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని సుమారు 12 చెరువులను నింపనున్నట్లు తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాల్వల ద్వారా చెరువులకు నీరు చేరుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోందని అన్నారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేలు చెరువుల వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, శ్రీనివాస్‌గౌడ్, డీఈ రూప్లానాయక్, శిరందాసు కష్ణయ్య, సర్పంచ్ అన్నెపాక ధనమ్మ, మల్లారెడ్డి, అనంతగిరి, మల్లేశ్‌యాదవ్ పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్ది రాజకీయ వ్యభిచారం'
హైదరాబాద్: టీఆర్ఎస్లోకి వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే సభ్యత్వం రద్దు చేయాలన్న కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంటులో ఈ మేరకు వెంటనే రాజ్యాంగ సవరణ తేవాలని కోరారు. టీఆర్ఎస్ది హోల్‌సేల్ రాజకీయ వ్యభిచారమని దుయ్యబట్టారు. పార్టీలు మారిన వాళ్లు, చేరిన వాళ్ల లెక్కలు తేలుస్తామని చాడ హెచ్చరించారు. మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలతో యుద్ధానికి దిగుతోందని ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. -
పిల్లల్ని సాకలేక సచ్చిపోతున్నం
దేవరకొండ... రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. పేదరికంతో కన్నపిల్లలను సాకలేక పుట్టిన బిడ్డను పురిట్లోనే అమ్మకానికి పెట్టే దుస్థితి అక్కడక్కడా కొనసాగుతుండగా, చాలాచోట్ల ఆడబిడ్డ పుట్టగానే అమ్మదనపు వెచ్చనికౌగిలికి దూరమైపోయి శిశుగృహల్లో చేరిపోతున్నది. గత ప్రభుత్వాలన్నీ ఇక్కడి గిరిజనులకు మాటల ఓదార్పు తప్ప చేతల్లో చేసిందేమీ లేదు. వీరి బాధలు, వెతలు స్వయంగా తెలుసుకోవడానికి సీపీఐ శాసనసభాపక్షనేత రామావత్ రవీంద్రకుమార్ ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి దేవరకొండ మండలం జాల్‌తండా గిరిజనులను పలకరించారు. ఎమ్మెల్యే ఏం చెప్పారంటే.. మా నియోజకవర్గంలో శిశు విక్రయాలు జరుగుతున్నమాట వాస్తవం. ఈ పరిస్థితిపై 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్నోత్తరాల సమయంలో సభలో చర్చ లేవనెత్తా. అప్పటి ముఖ్యమంత్రి ైవె ఎస్.రాజశేఖరరెడ్డి, గిరిజనశాఖ మంత్రి రెడ్యానాయక్‌లు శిశువిక్రయాలపై సానుకూలంగా స్పందించారు. దేవరకొండ నియోజకవర్గంలో శిశువిక్రయాల నిర్మూలన కోసం రూ.26 కోట్లు కేటాయించారు. కొద్దిగా ఖర్చు చేశారు రూ.26 కోట్ల ప్యాకేజీకి సంబంధించి గత ప్రభుత్వం, అధికారులు చేసిన అశ్రద్ధను, తద్వారా జరిగిన పరిణామాలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తి కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. శిశువిక్రయాల నిర్మూలన కోసం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. రవీంద్రకుమార్ : గతంలో ఆడపిల్లను విక్రయించావు కదా..? ఏ పరిస్థితుల్లో కన్నబిడ్డను అమ్ముకున్నావు ? బాధితురాలు సువాలి : నలుగురూ ఆడపిల్లలే. సాకాలంటే కష్టమయ్యింది. ఎవలో పిల్లల్లేరంటే ఇచ్చాం. ఆళ్లు...ఈళ్లు నచ్చజెప్పడంతో మళ్ళీ తెచ్చుకున్న. రవీంద్రకుమార్ : మరి అప్పట్లో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం అందలేదా? సువాలి : ఏది సారూ... ఎవ్వళ్లన్నా ఆదుకోలె. పిల్లల్ని సాకలేక సచ్చిపోతున్నం. సర్కారోళ్లు పైసలిస్తరని ఆశపడ్డం. ఇప్పటి వరకు ఏమన్న సాయం చేయలే. రవీంద్రకుమార్ : నీ పేరేంటి? నీకెంత మంది పిల్లలు? బుజ్జి : నా పేరు బుజ్జి. నేను మినీ అంగన్వాడీ ఆయాను. నాకు నలుగురు పిల్లలు. రవీంద్రకుమార్ : నువ్వే నలుగురు పిల్లల్ని కంటే కుటుంబ నియంత్రణపై మీవోళ్లకు నువ్వేం చెప్తావు? బుజ్జి : నలుగురూ ఆడపిల్లలు కాదు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. రవీంద్రకుమార్ : ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దని తెలియదా? అది సరే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి ఏం పెడుతున్నావు? బుజ్జి : అందరికీ పోషకాహారం ఇస్తున్నాం. గుడ్లు, పాలు పెడుతున్నాం. రవీంద్రకుమార్ : గిరిజనులు ఆడపిల్లలను ఎందుకు అమ్ముకుంటున్నారు? మగపిల్లలే ఎందుకు కావాలనుకుంటున్నారు? నారాయణమ్మ (అంగన్వాడీ సూపర్వైజర్) : గిరిజనులలో చాలామంది ఇంటికి ఒక్కడైనా వారసుడు ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో ఆడపిల్లలను ఎంత మందిని కనడానికైనా సిద్ధపడుతున్నారు. పేదరికంతో పిల్లలను సాకలేక ఉన్న ఆడపిల్లలను అమ్ముకోవాలని భావిస్తున్నారు. రవీంద్రకుమార్ : మరి ఈ అనాచారంపై మీరు మోటివేషన్ చేయడం లేదా ? నారాయణమ్మ : శిశువిక్రయాలకు పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఈమధ్య కాలంలో శిశువిక్రయాలు తగ్గుముఖం పట్టి పిల్లలను సాకలేక శిశుగృహాల్లో ఆడపిల్లలను వదిలిపెట్టడం ఎక్కువైంది. ఇందుకోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. రవీంద్రకుమార్ : తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కదా? దీనిపై అవగాహన కల్పిస్తున్నారా? నారాయణమ్మ : గతంలో ఉన్న బంగారు తల్లి పథకం గురించి, అంతకు ముందు పథకాల గురించి వివరించాం. కానీ, అవి సక్రమంగా అమలు కాకపోవడంతో జనాలు విశ్వసించే పరిస్థితి లేదు. రవీంద్రకుమార్ : ఏం బాబూ.... స్కూల్‌కు వెళ్తున్నావా? (అక్కడున్న స్కూల్ డ్రెస్సు వేసుకున్న విద్యార్థితో) విద్యార్థి : మా తండాలో స్కూల్ లేదు. ఇక్కడినుంచి దేవరకొండ దాకా పోయి చదువుకుంటున్నా. రవీంద్రకుమార్: ఆడపిల్లల్ని ఎందుకు అమ్ముతున్నరు? పిల్లల్ని అమ్ముకోకుండా ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి (గిరిజన మహిళతో) మూడావత్ భాగ్యలక్ష్మి : రోజంతా కష్టపడితే వందో, రెండందలో గిడ్తది. ఓ రోజు పనుంటది... రెండు రోజులు పనుండదు. పిల్లల్ని సాకాలంటే మావల్ల గాదు. మరేం చేస్తం సారూ... రవీంద్రకుమార్ : అందుకని అమ్ముకుంటారా ? మూడావత్ భాగ్యలక్ష్మి : అంతకంటే దిక్కులేకపోయింది. ప్రభుత్వమన్నా పట్టించుకుంటదా అంటే అది లేదాయె. మా పేదరికం పోతే మేం మాత్రం ఎందుకు అమ్ముకుంటం. మా బాధలు లేకపోతే అమ్ముకోవడానికి ఏం కర్మ. రవీంద్రకుమార్ : శిశువిక్రయాల నిర్మూలనకు ప్రభుత్వం ఏం చేసింది? అంజన్ : గిరిజన నియోజకవర్గమైన దేవరకొండలో ఆడపిల్లలను అమ్ముకుంటున్నారని అప్పటి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అసెంబ్లీలో అడిగిండు. రాజశేఖరరెడ్డి హయాంలో 26 కోట్లు మంజూరైనా... జిల్లాలో ఆ డబ్బులు ఎట్టా వచ్చాయో.. ఎక్కడ జమ అయ్యాయో తెలియదు. ఆ తర్వాత పట్టించుకోలేదు.