RAVULA Chandrasekhar Reddy
-
నాటి శత్రువులే.. నేటి మిత్రులు
సాక్షి, వనపర్తి / ఆత్మకూరు : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఈ చిత్రాలను ఉదాహరణగా చెప్పొచ్చు. అమరచింత నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.వీరారెడ్డి, టీడీపీ నుంచి కె.దయాకర్‌రెడ్డి పోటీ పడగా వీరారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే బరిలోకి దిగగా వీరారెడ్డిపై దయాకర్‌రెడ్డి గెలుపొందారు. అలా ప్రత్యర్థులు ఉన్న వీరిద్దరు ఇప్పుడు మహాకూటమి ఏర్పాటుతో ఒక్కటయ్యారు. ఈ మేరకు మక్తల్ నుంచి మహాకూటమి తరఫున కె.దయాకర్‌రెడ్డి బరిలో ఉండగా.. ఆత్మకూరులో శనివారం జరిగిన మహాకూటమి పార్టీల్లోని కార్యకర్తల సమావేశంలో వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఇక మరో ఫొటోలో ఉన్న ఇద్దరు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి బాల్యమిత్రులు! అయితే, దశాబ్దాల కాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా టీడీపీ, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో రావుల 1994 ఎన్నికల్లో చిన్నారెడ్డిపై విజయం సాధించగా.. 1999 ఎన్నికల్లో చిన్నారెడ్డి రావులపై గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్లీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి చిన్నారెడ్డిపై గెలిచారు. ఇప్పుడు మహాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్ భాగస్వామ్యం కావడంతో శనివారం జరిగిన చిన్నారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి, ఆ తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశానికి రావుల హాజరై వేదికపై చిన్నారెడ్డితో పలు అంశాలపై చర్చించండి కనిపించింది. వనపర్తిలో జరిగిన సమావేశంలో వేదికపై మిత్రులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి ఆత్మకూరు సమావేశంలో మాట్లాడుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు వీరారెడ్డి, కె.దయాకర్‌రెడ్డి -
టీఆర్ఎస్ గెలిస్తే..నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్..
సాక్షి, ఖిల్లాఘనపురం: డిసెంబర్ 11 తరువాత నీళ్ల నిరంజన్‌రెడ్డి.. కన్నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతా సిద్ధం చేసిన తరువాత వచ్చి నీళ్లు తెచ్చానని, నీళ్ల నిరంజన్‌రెడ్డి గా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. నిరంజన్‌రెడ్డి గెలిస్తే జీఎస్టీ తరహాలో ఎన్ఎస్టీ (నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్) వేస్తారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు రోజు రాత్రి రూ.12 కోట్ల అవినీతి సొమ్ముతో 29 కిలోల బంగారం కొన్న అవినీతి పరుడా వనపర్తిలో గెలిచేది? అని నిలదీశారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా తాను, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేశామన్నారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి కృష్ణుడిగా, తాను అర్జునుడిగా ఎన్నికల యుద్ధంలో దిగుతున్నామని చిన్నారెడ్డి అభివర్ణించుకుంటూ ఎన్నికల బరిలో తమను తట్టుకునేవారు ఉండబోరని చెప్పారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరిస్తాన్న వారు కొత్తగా 12వేల ఎకరాలకే ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ నిరంజన్‌రెడ్డికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చూపుతామని ప్రతినబూనారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, శివసేనారెడ్డి, నాగం తిరుపతిరెడ్డి, సతీష్, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, కొండారెడ్డి, కృష్ణయ్యయాదవ్, బాల్‌రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కరువు అంచనాకు... టీ టీడీపీ బృందాలు
18 నుంచి 25వరకు కరువు యాత్రలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అంచనాకు వచ్చేందుకు ఈ నెల 18 నుంచి 25 వరకు టీటీడీపీ బృందాలు కరువు యాత్రలు చేపడుతున్నట్లు టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపా రు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర కార్యదర్శి తాజుద్దీన్‌తో కలసి విలేక రులతో మాట్లాడారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులుంటారని, స్థానికంగానే నివేదికలు తయారు చేసి కలెక్టర్లకు అందజేస్తామన్నారు. ఈనెల 25 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు కరువుపై ప్రస్తావించడంతో పాటు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి నివేదికిస్తామన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతున్నారని రావుల విమర్శించారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మద్యం కంపెనీలకు మాత్రం నీళ్లు సరఫరా చేస్తున్నారన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామన్న హామీ మరిచిపోయారన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన 4శాతం రిజర్వేషన్లను కూడా కాపాడటం లేదన్నారు.