వేలానికి వైద్య విద్య!
► సీమ మెడికల్ సీట్లు అమ్మేస్తున్నారు
► ప్రతిభావంతులను వెనక్కి నెట్టి.. వైద్యసీట్ల అమ్మకం
► ఒక్కో సీటుకు కోటి రూపాయల వరకు రేటు
► రెండో కౌన్సెలింగుకు ముందు బ్లాకవుతున్న సీట్లు
వైద్య విద్య అంటే అందరికీ మక్కువే. మెడికల్ సీటు సాధించాలని అహోరాత్రాలు కష్టపడి చదివి మంచి ర్యాంకులు పొందిన తర్వాత కూడా సీటు రాకపోతే.. తమకు దక్కాల్సిన సీటు దొడ్డిదారిలో వేరేవాళ్లకు వెళ్లిపోయందని తెలిస్తే.. ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లిపోతాయి! రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు ఇప్పుడు ఇలాగే బాధపడుతున్నారు. ఎంసెట్లో తాము సాధించిన ర్యాంకుకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కచ్చితంగా సీటు వస్తుందని భావించినా చివరి నిమిషంలో అది కాస్తా చేజారిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆ చిన్నారులు చివరకు మెడిసిన్ చదవాలన్న ఆశను కూడా చంపేసుకుంటున్నారు.
రాయలసీమ పిల్లల విషయంలో ఎందుకిలా జరుగుతోందని అనుమానం వచ్చిన ఆర్టీఐ కార్యకర్త మర్రి రమణ.. ఈ పుట్టను మొత్తం కదిలించారు. అక్కడ తీగలాగితే డొంకంతా కదిలింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పది వైద్య కళాశాలల మీద అడ్మిషన్ల విషయంలో ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ద్వారా ఖరారైంది. నాన్ మెరిట్ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయని, మెరిట్ అభ్యర్థులకు మొండిచెయ్యి చూపుతున్నారని ఆయన అన్నారు. తనకు వచ్చిన ర్యాంకుతో తిరుపతి పద్మావతి వైద్యకళాశాలలో సీటు రావడం గ్యారంటీ అనే భావించానని, కానీ అక్కడికెళ్తే.. కౌన్సెలింగ్ ప్రారంభమైన గంటకే సీట్లన్నీ అయిపోయినట్లు చెప్పారని విధుప్రియ అనే విద్యార్థిని వాపోయింది. తన సీటును వేరేవాళ్లకు అమ్మేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పింది. ఒక్క పద్మావతి కళాశాలే కాదు.. తనకు కచ్చితంగా సీటు వస్తుందని భావించిన చాలా కాలేజీలలో ఆమెకు చుక్కెదురైంది. కేవలం డబ్బు, రికమండేషన్లు ఉన్నవాళ్లకే మెడికల్ సీట్లు వస్తున్నాయి తప్ప ప్రతిభావంతులకు ఏపీలోని ప్రభుత్వ కళాశాలల్లో వైద్యవిద్య చదువుకునే అవకాశం దొరకట్లేదని ఆమె తల్లి స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవంతా ఎందుకని, ఇక వైద్యవిద్య చదవాలన్న ఆశను విధుప్రియ వదిలేసుకుంది.
కర్నూలుకు చెందిన సాయిశ్రీ కూడా మెడికల్ సీట్ల కుంభకోణం బాధితురాలే. ఆమెకు వచ్చిన ర్యాంకుకు కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆమెకు దాదాపు సీటు ఖాయం అనుకుంటున్న సమయంలో వాళ్లు లేదు పొమ్మన్నారు. తర్వాత ఆమెకు ఎక్కడా సీటు రాలేదు. అయినా పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించాలని ఆమె భావిస్తోంది.
ఇదంతా ఎలా జరుగుతోందని జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. దాంతో.. రెండో కౌన్సెలింగుకు ముందే సీట్లను బ్లాక్ చేస్తున్నారని తెలిసింది. వాటిని నాన్ లోకల్ విద్యార్థులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. స్థానిక విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చినా సీట్లు ఇవ్వకుండా, వాటిని ఎన్నారై కోటాలో అమ్ముకుంటున్నట్లు సమాచారం. దాదాపు వంద సీట్ల వరకు ఇలా అమ్ముడుపోయాయని, ఒక్కో సీటును 80 లక్షల నుంచి కోటి వరకు అమ్మారని అంటున్నారు. అయితే.. వైద్య సీట్ల కేటాయింపులో తాము చేసేది ఏమీ లేదని, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయమే రిజర్వేషన్ల ప్రకారం, ర్యాంకుల ప్రకారం సీట్లు కేటాయిస్తుందని కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
సీబీఐ విచారణతోనే న్యాయం
రాజ్యాంగంలోని 371 డి అధికరణ ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, మిగిలిన 15 శాతం స్థానికేతరులకు ఇవ్వాలి. కానీ, రాయలసీమ వైద్య కళాశాలల్లో మాత్రం స్థానిక విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉన్నా వాళ్లకు వైద్యసీట్లు ఇవ్వకుండా.. వాటిని అమ్మేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సీట్లు రాకపోవడంతో కొంతమంది హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లగా, వారికి మాత్రం న్యాయం జరిగిందని, అలా వెళ్లలేని విద్యార్థులకు వైద్యులయ్యే అవకాశం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.