మంత్రిగా ‘ఆర్బీ’ ప్రమాణం
సాక్షి, చెన్నై: సీఎం జయలలిత కెబినెట్లో 13వ సారి మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇసుక దెబ్బకు కీలకమైన ప్రజా పనుల శాఖ నుంచి ప్రాధాన్యత లేని క్రీడల శాఖలో పడ్డ రామలింగానికి పదవీ గండం తప్పలేదు. ఆయన స్థానంలో సాత్తూరు ఎమ్మెల్యే ఆర్బి ఉదయకుమార్కు చోటు కల్పించారు. మంత్రులు బివి రమణ, ఎంసి సంపత్, ఎన్డీ వెంకటాచలం శాఖల్లో మార్పులు చేశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అనుమతులు, కేటాయింపుల వ్యవహారం వెంటకటాచలం మెడకు చుట్టుకోవడంతో తాజాగా ఆయనకు ప్రాధాన్యత లేని శాఖకు కేటాయించారు. త్వరలో ఈయనకూ పదవీ గండం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త మంత్రి ఆర్బి ఉదయకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం రాజ్ భవన్లో నిరాడంబరంగా జరిగింది.
ప్రమాణ స్వీకారం:
ఉదయాన్నే రాజన్ భవన్ పరిసరాలు అధికారులు, మంత్రుల వాహనాలతో నిండిపోయూయి. సరిగ్గా తొమ్మిదిన్నర గంటల సమయంలో సీఎం జయలలిత రాజ్ భవన్కు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, గవర్నర్ కొణిజేటి రోశయ్య కార్యదర్శి రమేష్చంద్ మీన పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్ద గవర్నర్ రోశయ్యకు కొత్త మంత్రి ఆర్బి ఉదయకుమార్ను సీఎం జయలలిత పరిచయం చేశారు. అనంతరం ఉదయకుమార్ చేత రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జయలలిత ఆశీస్సుల్ని ఉదయకుమార్ అందుకున్నారు. అనంతరం కొత్త మంత్రికి సహచర మంత్రులు, రోశయ్య, జయలలిత శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి సచివాలయం చేరుకున్న ఉదయకుమార్ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. ఒకే కేబినెట్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఆర్బి ఖాతాలో పడింది. ఇది వరకు జయలలిత కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేసి ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే.