సమాచారం లేకుండానే కేబినెట్‌కు వస్తారా?
సాక్షి, హైదరాబాద్: సరైన సమాచారం లేకుండా మంత్రివర్గ సమావేశానికి ఎలా వస్తారంటూ వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆ శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశ్వసనీ యవర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక మిషన్‌పై సీఎం సమీక్షించారు. గతంలో నిర్ణయించిన విధంగా ఏపీ ప్రభుత్వం, ఇక్రిశాట్ల మధ్య ఒప్పందం జరిగిందా అని మంత్రి పుల్లారావును, అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. ‘‘ఇక్రిశాట్ అంతర్జాతీయ సంస్థ. అది మన వద్దకు రాదు. మనమే వెళ్లాలి. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా మీ శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకపోతే ఎలా’’ అని ప్రశ్నించారు.
వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడాన్ని సీఎం ప్రశ్నించగా.. తాము పంపిన ప్రతిపాదనలకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో సీఎం ఆర్థిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా ఇసుకను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిన అధికారిపై చర్య లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని అధికారులను సస్పెం డ్చేయాలని చెప్పారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు కేటాయించినా వారికి తగినంత ఆదాయం రావడంలేదని పలువురు మంత్రులు చెప్పారు.
డ్వాక్రా సంఘాలకు రీచ్‌ల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ.. కొద్ది రోజుల క్రితమే రీచ్‌లను మహిళలకు కేటాయించినందున, మరికొన్ని రోజుల తరువాత సమీక్షించి, నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అర్హులైన వారికి అనేక మందికి పింఛన్లు రావడంలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి కె.అచ్చన్నాయుడు తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. పింఛన్లలో కోత విధించమని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని చెప్పారు. నిబంధనలను మాత్రం మార్చేది లేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.