real estate investment trust
-
రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల (ఇన్విట్స్) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) పోర్ట్‌ఫోలియోలోని 125 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్ చ.అ.లకు చేరనుంది.బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్‌లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎఫ్‌వో ప్రీతి ఛేడా, హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ సీఎఫ్‌వో అభిషేక్ ఛాజర్, నెకస్స్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈవో రాజేష్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్ ఉండగా, లిస్టెడ్ రీట్స్ నాలుగు ఉన్నాయి. -
రియల్టీలో సిప్ చేద్దామా!
వాణిజ్య ప్రాపరీ్టపై పెట్టుబడి పెట్టాలంటే సామాన్య ఇన్వెస్టర్లకు అయ్యే పనేనా..! ఎక్కడ చూసినా ధరలు గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో.. కొనాలంటే పెద్ద మొత్తమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే క్రమానుగత పెట్టుబడి (సిప్) విధానంలో వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆకాంక్షలకు ఆచరణ మార్గమే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు). వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వచ్చే ప్రయోజనం ఎంత మేర? తదితర వివరాలను అందించే కథనమే ఇది. రీట్ అంటే...?రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు) పేరులో ఉన్నట్టుగానే.. వివిధ రకాల వాణిజ్య ప్రాపరీ్టలపై పెట్టుబడులు పెడుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరిస్తుంటాయి. వాటిని వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఆయా ప్రాపరీ్టలను అద్దెకు, లీజుకు ఇస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి వాటాదారులకు క్రమం తప్పకుండా పంచుతుంటాయి. ఆఫీసులు, మాల్స్, ఇండ్రస్టియల్ పార్క్‌లు, వేర్‌హౌస్‌లు, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ సెంటర్లు తదితర వసతులపై రీట్లు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్లు, గోల్డ్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ పది మంది స్నేహితుల బృందం ఉందనుకుందాం. తలో రూ.10 లక్షలు వేసుకుని రూ.కోటితో ఒక వాణిజ్య భవనాన్ని సమకూర్చుకున్నారు. దాన్ని ఓ కార్పొరేట్ సంస్థ కార్యాలయానికి లీజుకు ఇచ్చారు. లీజు రూపంలో వచ్చే మొత్తం నుంచి 90 శాతాన్ని పది మంది డివిడెండ్ కింద పంచుకుంటారు. రీట్‌లో ఇదే మాదిరి జరుగుతుంది. కాకపోతే రీట్ల నిర్వహణలో ఇలాంటి వాణిజ్య ఆస్తులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రీట్లకు ఎంతో ఆదరణ ఉంది. కానీ మన దేశంలో వీటిపై అంత అవగాహన లేదు. అందుకే ఇవి పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలుగా వీటికి తగినంత ప్రచారం కల్పించేందుకు సెబీ తన వంతు కృషి చేస్తోంది. స్టాక్స్, ఫండ్స్ మాదిరే రీట్లు కూడా సెబీ పర్యవేక్షణ కిందకే వస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు 80% పెట్టుబడులను అద్దెను సమ కూర్చే ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరో 20% మేర పెట్టుబడులను నిర్మాణంలోని ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే, వచ్చే అద్దె ఆదాయంలో నిర్వహణ వ్యయాలు, పన్నులు పోను మిగిలిన నికర మొత్తం నుంచి 90 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలి. ప్రయోజనాలు... అద్దె ఆదాయంరీట్లకు లీజు రూపంలో ఆదాయం వస్తుంటుంది. దీన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకోసారి 15 శాతం అద్దె పెంచాలన్న నిబంధనతో లీజు ఒప్పందాలు చేసుకుంటుంటాయి. దీంతో వాటాదారులకు వచ్చే డివిడెండ్ ఆదాయం కూడా కాలక్రమేణా పెరుగుతూ వెళుతుంది. కొత్త లీజు సమయంలో అప్పటికి పెరిగిన మార్కెట్ ధరల ప్రకారమే ఒప్పందాలు చేసుకుంటుంటాయి. వడ్డీ ఆదాయం రీట్లు తమవద్దనున్న మిగులు నిధులపై వడ్డీ రాబడిని పొందుతుంటాయి. లేదా ప్రాపర్టీ లీజుదారులకు రుణాలు సమకూర్చడం ద్వారా వాటిపై ఆదాయం పొందుతాయి. ఈ రూపంలోనూ వాటాదారులకు ఆదాయం లభిస్తుంది. మన దేశంలో రీట్లు ప్రధానంగా టైర్–1 పట్టణాల్లోని ప్రాపరీ్టలపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. కనుక వీటి ధరలు మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. పనితీరు భిన్నంస్టాక్స్, బాండ్లు తదితర సాధనాలకు భిన్నంగా రీట్ స్పందన ఉంటుంది. అంటే స్టాక్స్ లేదా బాండ్ల ధరలు పడిపోతే రీట్ల ధరలు కూడా పడిపోవాలనేమీ లేదు. ఆ సమయంలో ఇవి స్థిరంగా ఉండొచ్చు. లేదా లాభాలను ఇవ్వొచ్చు. ఒకవేళ రీట్ల ధరలు కూడా తగ్గినా.. ఇతర సాధనాల స్థాయిలో ఉండదు. ఈ విధంగా పెట్టుబడుల్లో కొంత భాగానికి రిస్క్ తగ్గుతుంది. పెట్టుబడి విలువ వృద్ధిరీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల విలువలు కొంత కాలానికి సహజంగా పెరుగుతుంటాయి. తమ నిర్వహణలోని ఆస్తుల విలువలను ఎప్పటికప్పుడు రీట్లు మదింపు చేసుకోవాలి. దీంతో పెరిగిన ప్రాపరీ్టల విలువ రీట్ యూనిట్ విలువపై ప్రతిఫలిస్తుంది. అలాగే, ఆరి్థకంగా లాభదాయకం లేని, లీజు పరంగా అంత డిమాండ్ లేని ప్రాపరీ్టలను విక్రయించి, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలపై ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇది కూడా పెట్టుబడి విలువ వృద్ధికి, డివిడెండ్ వాటా పెంపునకు దారితీస్తుంది. అంతేకాదు, కొంత మేర రుణాలు తీసుకుని కొత్త ప్రాపరీ్టలపై వెచి్చంచేందుకు సైతం వీటికి వెసులుబాటు ఉంటుంది. కనుక కాలక్రమంలో, కంపెనీ నగదు ప్రవాహాలు, నికర విలువ పెరుగుతున్న కొద్దీ.. కొత్త ప్రాపర్టీలను అదనంగా సమకూర్చుకుంటాయి. ఆ విధంగానూ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. మెరుగైన లిక్విడిటీభౌతిక ప్రాపర్టీ కొనుగోలు చేస్తే విక్రయించడానికి చాలా సమయం తీసుకోవచ్చు. అదే రీట్లను పనిదినాల్లో ఏ రోజు అయినా విక్రయించుకుని, మరుసటి రోజే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో పొందొచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయి ఉంటాయి కనుక లిక్విడిటీ సమస్య ఉండదు.లిస్టెడ్ రీట్లు... బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రైమాసికానికి ఒకసారి డివిడెండ్‌ను పంపిణీ చేస్తున్నాయి.ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? రీట్‌లో పెట్టుబడులకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు తప్పనిసరిగా ఉండాలి. స్టాక్స్‌ను కొనుగోలు చేసినట్టుగానే రీట్ యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. రాబడులు... వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై వార్షిక రాబడులు 8–10 శాతం మధ్య ఉంటాయి. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌పై రాబడులు ఒక్కోసారి 15 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, మన దేశంలో రీట్‌లపై ప్రస్తుత రాబడులు 10 శాతం లోపే ఉన్నాయి. మన ఆరి్థక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత విలువను సంతరించుకుంటుందని నిపుణుల అంచనా. దీనికితోడు ఈ మార్కెట్ పరిణతి చెందిన కొద్దీ రీట్‌లపై వార్షిక రాబడులు 10 శాతం, అంతకంటే ఎగువ స్థాయికి చేరుకుంటాయని నిపుణుల అంచనా. 2022–2024 మధ్య రీట్ల నుంచి డివిడెండ్ రాబడి 6–9 శాతం మధ్య ఉన్నట్టు, పెట్టుబడి విలువలో 12–18 శాతం మేర వృద్ధి ఉన్నట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది.ఇవి గమనించాలి..→ రీట్లు స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే (ఐదేళ్లు అంతకుమించిన కాలం) పరిశీలించడం సూచనీయం. అప్పుడు మూలధన పెట్టుబడి వృద్ధి సాధ్యపడుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైక్లికల్‌గా ఉంటుంది. స్వల్పకాలంలో రీట్ల ధరలు స్టాక్స్ మాదిరే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంత మేర హెచ్చుతగ్గులకు గురికావచ్చు. → మనదేశంలో ఇప్పటి వరకు కేవలం నాలుగు రీట్లే లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ మాల్స్ ఆస్తులపైనే అధిక శాతం ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన రీట్లు ఆఫీస్ ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేసేవి. పనితీరు పోల్చి చూసేందుకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. → ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా రీట్ల పరిధిలోని ప్రాపరీ్టలలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) చూడాలి. లీజుకు తీసుకున్న కంపెనీలు అన్నీ ఒకే రంగంలో కాకుండా భిన్న రంగాలకు చెందినవి అయితే రిస్క్ వైవిధ్యం అవుతుంది. రీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల నాణ్యత, డిమాండ్ చూడాలి. → ఆర్థిక సంక్షోభ సమయాల్లో, కరోనా వంటి విపత్తుల సమయాల్లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. అలాంటి సందర్భాల్లో డివిడెండ్ పంపిణీ, మూలధన పెట్టుబడి విలువ ప్రభావితం కావచ్చు. → మన దగ్గర స్టాక్స్‌తో పోలిస్తే రీట్లకు ప్రాచుర్యం తక్కువ. కనుక స్టాక్ ఎక్సే్చంజీల్లో వీటి లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. → తమకు స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారు రీట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా తమ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. పన్ను బాధ్యత... రీట్ పెట్టుబడులపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను కొంత భిన్నంగా ఉంది. బ్రూక్‌ఫీల్డ్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు రాయితీతో కూడిన పన్ను రేటును ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 115బీఏఏ కింద ఎంపిక చేసుకోలేదు. ఇవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)పైనే ఇన్వెస్ట్ చేశాయి. కనుక ఇవి పంపిణీ చేసే డివిడెండ్‌పై పన్ను లేదు. ఒకవేళ ఎస్పీవీలు రాయితీ రేటును ఎంపిక చేసుకుంటే, అప్పుడు అవి పంపిణీ చేసే డివిడెండ్ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తనకు వర్తించే శ్లాబు ప్రకారం దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్‌పై పన్ను వర్తించేట్టు అయితే, రీట్లు 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. ఇన్వెస్టర్లు తమ వార్షిక పన్ను రిటర్నుల్లో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సొంత ప్రాపరీ్టలపై రీట్లకు వచ్చే ఆదాయం నుంచి వాటాదారులకు డివిడెండ్ పంపిణీ చేసినా, ఎస్పీవీలకు ఇచ్చిన రుణాలపై రీట్లకు వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేసిన సందర్భాల్లోనూ.. ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ఇక రీట్లలోని పెట్టుబడులకు స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పన్ను నిబంధనలు వర్తిస్తాయి. విక్రయించినప్పుడు వచ్చే లాభంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభంపై 20 శాతం పన్ను, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినప్పుడు వచి్చన లాభం మొదటి రూ. లక్ష తర్వాత మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రీట్, ఇన్విట్.. పెరుగుతున్న ఆకర్షణ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్న కొద్దీ.. వీటిల్లోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇందుకు గతేడాది గణాంకాలే నిదర్శనం. 2023లో రీట్, ఇన్విట్లలోకి రూ.11,474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లో వచి్చన రూ.1,166 కోట్లతో పోలిస్తే పది రెట్ల వృద్ధి గతేడాది నమోదైనట్టు తెలుస్తోంది. సెబీ తీసుకున్న చర్యలు, ఆకర్షణీయమైన రాబడులు ఈ సాధనాల దిశగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ సాధనాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత అంచనా, విధానాల్లో వచి్చన మార్పులను ప్రస్తావిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టొచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారికి రీట్, ఇన్విట్లు ఆకర్షణీయంగా మారతాయి’’అని క్లారావెస్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు మనకి పరులేకర్ పేర్కొన్నారు. రీట్, ఇన్విట్ సాధనాల్లోకి భారీగా 2020లో రూ.29,715 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2021లో రూ.17,641 కోట్లు వచ్చాయి. రీట్,ఇన్విట్‌లను ఏడెనిమిదేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో 23 రిజిస్టర్డ్ ఇన్విట్లు, ఐదు రీట్లు ఉన్నాయి. వీటి నిర్వహణలో మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రీట్ల ద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో, ఇన్విట్ల ద్వారా ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
వాణిజ్య ప్రాపర్టీకి యజమాని అవుతారా..! రూ.కోట్లతో పని లేదు..
ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. నివాసం కోసం కొనుగోలు చేసే ఇల్లు ఎప్పటికీ పెట్టుబడి కాబోదు. రాబడులు అందించేదే పెట్టుబడి అవుతుంది. ఆ విధంగా చూస్తే వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడి కిందకే వస్తుంది. మరి వాణిజ్య ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే రూ.కోట్ల పెట్టుబడి కావాలి. అంత పెట్టుబడి అందరికీ సాధ్యపడదు. రూ.కోట్లతో పని లేకుండా, వెయ్యి రూపాయలు ఉన్నా.. వాణిజ్య ప్రాపర్టీకి యజమానులను చేసేవే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్/ఆర్ఈఐటీ)లు. ప్రతీ ఇన్వెస్టర్‌కు ఇవి అనుకూలమని చెప్పడానికి కుదరదు. కొందరికే అనుకూలం. రీట్‌లో పెట్టుబడితో ప్రయోజనం ఏ మేరకు? ఎవరికి అనువైనవో తెలియజేసే కథనం ఇది... రియల్ ఎస్టేట్ అనేది భారతీయులకు ఎంతో ఇష్టమైన ప్రాధాన్య పెట్టుబడుల్లో ఒకటిగా ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్‌పైనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే తమ బడ్జెట్ ధరలో ఇవి అందుబాటులో ఉంటాయి కనుక. అదే ఓ కమర్షియల్ షాప్ లేదా బిల్డింగ్ కొనుగోలు చేయాలంటే కొంచెం అధిక మొత్తం కావాల్సి వస్తుంది. వ్యక్తులు వాణిజ్య ప్రాపర్టీలపై తక్కువగా పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే. అయినా కానీ, తమ శక్తికొద్దీ, తమ బడ్జెట్ పరిధిలోనే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకునే వారికోసం ఉద్దేశించినవి రీట్లు. ఇన్వెస్టర్లకు మరిన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలనే సంక్పలంతో సెబీ వీటికి అనుమతించింది. భారత స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లలో లిస్ట్ అయిన తొలి రీట్ ‘ఎంబసీ ఆఫీస్ పార్క్స్’. రూ.4,750 కోట్లను సమీకరించి 2019 ఏప్రిల్‌లో ఇది లిస్ట్ అయింది. ఇన్వెస్టర్ల ముందున్న మార్గం? రీట్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ప్రాపర్టీ మార్కెట్లలో గ్రేడ్ ఏ ఆఫీసు స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నట్టు శోభిత్ అగర్వాల్ తెలిపారు. అలాగే, భవిష్యత్తులో మెరుగైన డివిడెండ్ ఆదాయానికి అవకాశం ఉంటుంది. రీట్‌ను వైవిధ్యానికి ఉపకరణంగా భావించి, తన మొత్తం పెట్టుబడుల్లో కొంత మేరకు వీటికి కేటాయించుకోవడాన్ని పరిశీలించొచ్చు. ‘‘మీ ఆర్థిక పరిస్థితులు అనుమతిస్తే మొత్తం పెట్టుబడిలో కొంత మొత్తాన్ని రీట్‌కు కేటాయించుకోవచ్చు. కానీ, ఒకరి మొత్తం పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ లేదా రీట్ మాదిరి రియల్ ఎస్టేట్ సాధనాల్లో 10–30 శాతం మించి ఉంచకూడదు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంజీవ్ గోవిల సూచించారు. రీట్లు మన దేశంలో కొత్త తరహా పెట్టుబడి సాధనాలు. కనుక వీటి రాబడులను స్టాక్ మార్కెట్ రాబడులతో పోల్చుకోకూడదు. రాబడులు ఎలా..? రీట్‌లో పెట్టుబడులపై రెండు రకాలుగా రాబడి ప్రయోజనానికి అవకాశం ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో యూనిట్ ధర వృద్ధి చెందడం ద్వారా పెట్టుబడి విలువ పెరుగుతుంది. యూనిట్ ధర పెరగడానికి రెండు అంశాలు దోహదం చేస్తాయి. ఆ రీట్ నిర్వహణలోని ఆస్తుల విలువ పెరగడం, ఆయా ఆస్తులపై అద్దె రాబడి పెరగడం యూనిట్ విలువను పెంచుతుంది. మరో రూపంలో ఇవి డివిడెండ్ చెల్లిస్తుంటాయి. కాకపోతే స్టాక్స్‌తో పోలిస్తే వీటిల్లో డివిడెండ్ పంపిణీ ఎక్కువగా ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు తమ పోర్ట్‌ఫోలియోలో 80 శాతం ఆదాయాన్నిచ్చే ఆస్తులు కలిగి ఉండాలి. అంటే నిర్మాణం పూర్తయి క్రమం తప్పకుండా అద్దె ఆదాయం వచ్చేవి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నవి కావొచ్చు. దీంతో 80 శాతం ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేయడానికి వీలుంటుంది. రెంట్, లీజు ఆదాయానికి తోడు, రియల్ ఎస్టేట్ విలువ పెరగడం రూపంలోనూ యూనిట్‌దారులకు ఆదాయం వస్తుందని అనరాక్ క్యాపిటల్ సీఈవో, ఎండీ శోభిత్ అగర్వాల్ తెలిపారు. సానుకూలతలు.. అధిక రాబడులు ఇచ్చే వాణిజ్య రియల్టీలో స్వల్ప మొత్తం పెట్టుబడికి రీట్ వీలు కల్పిస్తుంది. కావాలంటే ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. లిస్ట్ అయిన అన్ని రీట్లలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ యూనిట్ ధర రూ.303గా ఉంది. అంటే రూ.303తో ఇందులో పెట్టుబడికి అవకాశం ఉంటుంది. రిటైల్ మాల్స్‌తో కూడిన నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్‌లో అయితే రూ.107తో ఒక యూనిట్ కొనుగోలు చేసుకోవచ్చు. అద్దె ఆదాయం రూపంలో రీట్లకు స్థిరంగా ఆదాయం వస్తుంటుంది. పన్నులు పోను 90 శాతం లాభాన్ని వాటాదారులకు పంపిణీ చేయాలనేది నిబంధన. కనుక ప్రతీ మూడు నెలలకు రీట్ యూనిట్ వాటాదారులకు ఆదాయం వస్తుంటుంది. కచ్చితంగా, నూటికి నూరు శాతం డివిడెండ్ వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో రాకపోవచ్చు. లేదా డివిడెండ్ ఆదాయం పంపిణీని తగ్గించొచ్చు. కానీ అవి తాత్కాలిక పరిణామాలే. రీట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. ఇతర సాధనాలతో పాటు వీటికి కొంత కేటాయింపులు చేసుకోవడం ద్వారా వైవిధ్యం చేసుకోవచ్చు. ప్రతికూలతలు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ట్రేడ్ అవుతుంటాయి కనుక రీట్లలో ముందుగా మార్కెట్ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ, జాతీయ పరిణామాల ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై ఉన్నట్టే.. వీటి ధరల్లోనూ అస్థిరతలు ఉంటాయి. ఇతర షేర్ల మాదిరే డిమాండ్ సరఫరా వీటి యూనిట్ ధరలను నిర్ణయిస్తుంది. క్లియర్ టైటిల్ కాకపోతే రీట్లు న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రీట్లలో ఉన్న ఒక పెద్ద ప్రతికూలత ఏమిటంటే, అవి కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువపైనే యూనిట్ నికర విలువ (ఎన్ఏవీ) ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతే, అది యూనిట్ ధరపైనా ప్రతిఫలిస్తుంది. దాంతో నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతున్నాయని తెలిస్తే, వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. పెట్టుబడి శ్రేణి ఆఫీస్ స్థలాలు డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోతే, స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వాటి ఆస్తుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ఇది కూడా ఒక రిస్కేనని అగర్వాల్ తెలిపారు. ఆఫీసు స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్నే రీట్లు వాటాదారులకు పంపిణీ చేస్తాయి. మరి రీట్ల నిర్వహణలోని ఆస్తుల్లో ఆక్యుపెన్సీ (భర్తీ) ఇక్కడ కీలకం అవుతుంది. కొంత స్థలం ఖాళీగా మిగిలిపోతే ఆ మేరకు ఆదా యం తగ్గిపోతుంది. అది డివిడెండ్ పంపిణీని ప్రభావితం చేస్తుంది. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ క్షీణత సందర్భాల్లో కార్యాలయ స్థలాలకు ఖాళీ ఏర్పడవచ్చు. చివరిగా రీట్లలో పెట్టుబడులకు తప్పనిసరిగా బ్రోకర్ వద్ద ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాల్సిందే. రీట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల్లో వేటిని ఎంపిక చేసుకోవాలి, ఎప్పుడు వాటి నుంచి బయటపడాలి, తిరిగి ఎప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టాలనే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు అంతగా అవగాహన ఉండదు. అటువంటప్పుడు వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడు రకాల రీట్ మ్యూచువల్ ఫండ్స్ మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రీట్ యూనిట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. కాకపోతే ఇవి మన మార్కెట్ ఒక్కటే అని కాకుండా ఇతర దేశాల మార్కెట్లలోని రీట్లలోనూ ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. అంటే వివిధ దేశాల రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు వర్గీకరించినట్టుగా అర్థం చేసుకోవాలి. కోటక్ ఇంటర్నేషనల్ రీట్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) ఇందులో ఒకటి. దేశంలో రీట్ ఆధారిత తొలి మ్యూచువల్ ఫండ్ పథకం ఇది. 2020 డిసెంబర్లో మొదలైంది. రూ.100 కోట్లను సమీకరించింది. ఈ పథకం భారత్‌తో పాటు సింగపూర్, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. గడిచిన ఏడాది కాలంలో 7 శాతం నష్టాలను ఇచ్చింది. పీజీఐఎం ఇండియా గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఎఫ్‌వోఎఫ్ మరొక పథకం. ఈ పథకం తన పెట్టుబడులు తీసుకెళ్లి పీజీఐఎం గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. 12 దేశాల్లోని రీట్లలో ఈ పేరెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకం గత ఆరు నెలల్లో 2 శాతం రాబడులు ఇస్తే, ఏడాది కాలంలో రాబడి సున్నాగా ఉంది. మహీంద్రా మనులైఫ్ ఆసియా పసిఫిక్ రీట్ ఎఫ్‌వోఎఫ్ పథకం 2021 సెప్టెంబర్‌లో మొదలైంది. ఈ పథకం తన పెట్టుబడులు తీసుకెళ్లి మనులైఫ్ గ్లోబల్ ఫండ్ ఆసియా పసిఫిక్ రీట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకం గత ఏడాది కాలంలో 5 శాతం నష్టాలను ఇచ్చింది. ఈ మూడు ఫండ్ రీట్లలో ఏడాది కాలంలో ఎలాంటి రాబడులు లేవు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు మరికొంత కాలం పాట వేచి చూడడమే సరైనది అవుతుంది. వీటికి బదులు లిస్టెడ్ రీట్లు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి. రీట్ అంటే..? మ్యూచువల్ ఫండ్ మాదిరే రీట్ కూడా. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం ఎన్నో స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంటుంది. కానీ, ఇన్వెస్టర్లకు షేర్లకు బదులు యూనిట్లను కేటాయిస్తుంటుంది. రీట్ కూడా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలపై పెట్టుబడులు పెడుతుంది. ఆయా ప్రాపర్టీలకు సంబంధించి యూనిట్లను కేటాయిస్తుంది. ఫండ్స్ నిర్వహణలో షేర్లు, ఈటీఎఫ్‌లు, బాండ్లు, సెక్యూరిటీలు ఉన్నట్టే, రీట్ల నిర్వహణలో రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉంటాయి. ప్రస్తుతం మూడు రీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ట్రస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ వాణిజ్య ప్రాపర్టీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ మూడింటి నిర్వహణలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో 93 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య ఆఫీసు స్థలాలు ఉన్నాయి. ‘‘ఈ మూడు రీట్లు లిస్టింగ్ ధరతో పోలిస్తే ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో రాబడులు, నగదు, డివిడెండ్ ఈల్డ్, క్యాపిటల్ వృద్ధి కలిపి వార్షికంగా 13–15 శాతం మధ్య ఉన్నాయి’’అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూశ్ గుప్తా తెలిపారు. ఇవి వార్షికంగా 5–6 శాతం మధ్య రాబడిని త్రైమాసికం వారీగా యూనిట్‌దారులకు చెలిస్తున్నాయి. ఇవి కాకుండా రిటైల్ షాపులతో కూడిన మాల్స్‌ను నిర్వహించే నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పేరుతో మరో రీట్ కూడా ఉంది. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్‌ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్‌లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
రీట్, ఇన్విట్‌లకు ఇక డిమాండ్!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఐన్వీఐటీ/ఇన్విట్)లను మరింత మందికి చేరువ చేసే దిశగా సెబీ నిర్ణయం తీసుకుంది. రీట్, ఇన్విట్ల ఐపీవో, ఫాలో ఆన్ ఆఫర్లకు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాలను తగ్గించింది. దీంతో రీట్ తొలి పబ్లిక్ ఆఫర్ లేదా ఫాలో ఆన్ ఆఫర్లో ఒక లాట్ కనీసం రూ.50,000 విలువకు తక్కువ కాకుండా ఉంటే చాలు. ఇన్విట్ ఇష్యూలోనూ కనీస పెట్టుబడి ఇకపై రూ.లక్ష ఉంటే సరిపోతుంది. ఇన్విట్ ఆస్తుల విలువలో కన్సాలిడేటెడ్ రుణాల మొత్తం, వాయిదా వేసిన చెల్లింపులు, నికర నగదు, నగదు సమాన మొత్తాలను 70 శాతానికి పెంచినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటి వరకు ఇన్విట్ ఆస్తుల్లో గరిష్టంగా 49 శాతం మొత్తానికే రుణాలకు పరిమితి ఉండగా, దీన్ని 70 శాతం చేసింది. ఇందుకోసం అదనపు ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. నిధుల సమీకరణ పరంగా ఈ మార్గదర్శకాలు ఇష్యూయర్లకు వెసులుబాటు కల్పిస్తాయని సెబీ పేర్కొంది. ప్రస్తుతానికి రీట్ ఇష్యూలకు కనీస సబ్స్క్రిప్షన్ మొత్తం రూ.2 లక్షలుగా ఉంటే, ఇన్విట్‌లకు రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం. -
ఎంబసీ రీట్... 2.6 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్
న్యూఢిల్లీ: మన దేశపు తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) 2.57 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ రీట్ ద్వారా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థ రూ.4,750 కోట్లు సమీకరించింది. వ్యూహాత్మక, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ ఇటీవలనే రూ.2,619 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌కు ప్రైస్‌బాండ్ గా రూ.299–300 ధరలను నిర్ణయించారు. 7.13 కోట్ల యూనిట్లను ఆఫర్ చేస్తుండగా, మొత్తం 18.35 కోట్ల యూనిట్లకు బిడ్లు వచ్చాయి. రీట్ యూనిట్లు వచ్చే నెల మొదటి వారంలో స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్, రియల్టీ కంపెనీ ఎంబసీ గ్రూప్ కలసి ఎంబసీ ఆఫీస్ పార్క్ పేరుతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీనే తొలి రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
‘రీట్స్’ పెట్టుబడులొస్తున్నాయ్!
స్థిరాస్తి రంగంలో తీరనున్న నగదు కొరత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్థిరాస్తి రంగానికి రీట్లు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) రూపంలో మంచి రోజులు రానున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సక్సెస్ అయిన రీట్ల విధానాన్ని మన దేశంలోనూ ఆరంభించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. రీట్స్ పెట్టుబడులు పొందేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న డివెడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను తొలగిస్తున్నామని, దీర్ఘకాలిక మూలధనంపై పన్ను విధానాన్ని కూడా హేతుబద్దీకరిస్తున్నామని, అలాగే ప్రస్తుతం ఆదాయం పన్ను మినహాయింపుల్లో భాగంగా ఇస్తున్న ఇంటి అద్దె మినహాయింపులను కూడా రూ.24,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో వివరించారు. దీంతో చాలా కాలంగా స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న నగదు కొరత రీట్ల రూపంలో తీరనుందని కొలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా సీనియర్ అసోసియేట్ డెరైక్టర్ (రీసెర్చ్) సురభి అరోరా, నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్, వంటి స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు. అసలు రీట్లు అంటే ఏంటి? అవెలా పనిచేస్తాయంటే.. రీట్స్‌తో మ్యూచుఫల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే రీట్స్కూ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. రీట్లు స్టాక్ ఎక్స్ఛెంజ్లో నమోదవుతాయి. అక్కడే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిదారులకు మంచి లాభాలు గిట్టుబాటయ్యే అవకాశముంది. నిర్మాణం పూర్తయిన వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల్ని పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు అందించడమే రీట్ల ప్రధాన కర్తవ్యం. అంటే అద్దెల రూపంలోనే ఆదాయం గిట్టుబాటవుతుందన్నమాట. దేశ, విదేశీ సంస్థలకు చెందిన నిధుల ప్రవాహం పెరిగితే వాణిజ్య సముదాయాలకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుంది. రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది. మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను మినహాయింపు వుంటుంది. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు.