
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌ఈఐటీ/రీట్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఐన్‌వీఐటీ/ఇన్విట్)లను మరింత మందికి చేరువ చేసే దిశగా సెబీ నిర్ణయం తీసుకుంది. రీట్, ఇన్విట్‌ల ఐపీవో, ఫాలో ఆన్ ఆఫర్‌లకు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాలను తగ్గించింది. దీంతో రీట్ తొలి పబ్లిక్ ఆఫర్ లేదా ఫాలో ఆన్ ఆఫర్‌లో ఒక లాట్ కనీసం రూ.50,000 విలువకు తక్కువ కాకుండా ఉంటే చాలు. ఇన్విట్ ఇష్యూలోనూ కనీస పెట్టుబడి ఇకపై రూ.లక్ష ఉంటే సరిపోతుంది.
ఇన్విట్ ఆస్తుల విలువలో కన్సాలిడేటెడ్ రుణాల మొత్తం, వాయిదా వేసిన చెల్లింపులు, నికర నగదు, నగదు సమాన మొత్తాలను 70 శాతానికి పెంచినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటి వరకు ఇన్విట్ ఆస్తుల్లో గరిష్టంగా 49 శాతం మొత్తానికే రుణాలకు పరిమితి ఉండగా, దీన్ని 70 శాతం చేసింది. ఇందుకోసం అదనపు ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. నిధుల సమీకరణ పరంగా ఈ మార్గదర్శకాలు ఇష్యూయర్లకు వెసులుబాటు కల్పిస్తాయని సెబీ పేర్కొంది. ప్రస్తుతానికి రీట్ ఇష్యూలకు కనీస సబ్‌స్క్రిప్షన్ మొత్తం రూ.2 లక్షలుగా ఉంటే, ఇన్విట్‌లకు రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం.