Reception complaints
-
పగలు ఓకే... రాత్రికి షాకే!
సాక్షి, హైదరాబాద్: ‘ప్లీజ్ రండి... దయచేసి కూర్చోండి. మీకు ఏం ఇబ్బంది వచ్చింది. మేం ఏ విధంగా సహాయం చేయగలం. ఫిర్యాదు రాసివ్వడానికి తెల్లకాగితం కావాలా?’ – పగటి వేళ ఠాణాకు వెళ్లినబాధితుడితో రిసెప్షన్ సిబ్బంది... ‘సార్.. ఒక్కసారి రండి. ఈ సమయంలో నాకు పెద్ద కష్టం వచ్చిపడింది. సాయం చేయండి. కంప్లయింట్ ఇవ్వాలని అనుకుంటున్నా. కుదిరితే ఓ కాగితం ఇప్పించగలరా?’– రాత్రి వేళ పోలీసుస్టేషన్‌కు వెళ్లినబాధితుడు పోలీసులతో... రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఉన్న ఠాణాల్లో ఇవి నిత్యం కనిపించే సీన్లే. దేశంలోని మరే ఇతర పోలీసు విభాగంలోని లేని విధంగా, ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్లు కేవలం పగటిపూట మాత్రమే పని చేస్తున్నాయి. రాత్రి వేళల్లో విధుల్లో ఉంటున్న సిబ్బంది ‘తమ పనులు’ చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. ఫలితంగా ‘డయల్–100’కు కాల్ చేస్తే మినహా... ఠాణాకు వచ్చిన బాధితులు నరకం చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన సుల్తాన్‌బజార్ ఏసీపీమాత్రం ఓ అడుగు ముందుకు వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన హంగులతో... పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు సర్వకాల సర్వావస్థల్లోనూ సహాయసహకారాలు అందించడానికి రిసెప్షన్స్ ఏర్పాటయ్యాయి. కొన్నేళ్ళ క్రితమే ఈ విధానం అమలులోకి వచ్చానా.. రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆధునిక హంగులు చేకూరాయి. తెలంగాణ ప్రభుత్వం పోలీసుస్టేషన్ల నిర్వహణకు నిధులు సైతం మంజూరు చేస్తుండటంతో రిసెప్షన్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ప్రధానంగా మహిళా కాస్టేబుళ్ళనే రిసెప్షనిస్టులుగా నియమిస్తున్నారు. ప్రజా సంబంధాలు, బాధితులతో మెగలాల్సిన విధానం, రికార్డుల నిర్వహణ తదితరాలకు సంబంధించి వీరికి ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. సమకాలీన అవసరాలకు తగ్గట్టు అదనపు అంశాలు నేర్పుతూ ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు లండన్ వంటి విదేశాలకు చెందిన పోలీసులు సైతం వచ్చి ఇక్కడి రిసెప్షన్ విధానాలను అధ్యయనం చేసి వెళ్ళారు. రాత్రిపూట ఇప్పటికీ నరకమే... ఈ రిసెప్షన్ సెంటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఠాణాలకు వస్తున్న బాధితులు ఇబ్బందులు ఎదుర్కోవడం అరుదుగా మారిపోయింది. అత్యవసర వింగ్‌గా పరిగణించే పోలీసు విభాగం అనేది 24 గంటలూ పని చేస్తుంటుంది. అయితే ప్రస్తుతం రిసెప్షన్స్ మాత్రం కేవలం పగటి పూట మాత్రమే పని చేస్తున్నాయి. ఈ కారణంగా రాత్రి వేళల్లో పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితుల్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ‘డయల్–100’ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంలో పని చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులు ఎవరైనా రాత్రి వేళ ‘100’కు కాల్ చేస్తే సరైన స్పందన ఉంటోంది. అలా కాకుండా నేరుగా పోలీసుస్టేషన్‌కు వస్తే మాత్రం అక్కడి వారిని బతిమలాడాల్సిందే. రాత్రి విధుల్లో ఉండే ఎస్సైలు, హెడ్–కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు వారి పనుల్లో బిజీగా ఉంటున్నారు. కేసు ఫైల్స్ అప్డేట్ చేసుకోవడమో, తర్వాతి రోజు కేసుల వివరాలు అధ్యయనం చేయడమో చేస్తూ ఉంటున్నారు. దీంతో బాధితులు వచ్చి బతిమాలుతున్నా సరైన స్పందన ఉండట్లేదు. కీలక నిర్ణయం తీసుకున్న చేతన... సుల్తాన్‌బజార్ ఏసీపీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారిణి డాక్టర్ ఎం.చేతన ఈ ఇబ్బందితో పాటు మరికొన్ని అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేష్ అనుమతితో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విడిజన్‌లో ఉన్న అన్ని ఠాణాల్లోనూ ఓ మహిళా సిబ్బంది రాత్రి వేళల్లోనూ రిసెప్షన్ విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకరు చొప్పున ముగ్గురు రిసెప్షన్ నిబ్బంది నిర్విరామంగా విధుల్లో ఉంటున్నారు. ప్రసూతి వైద్యశాల, ఉస్మానియా ఆస్పత్రి, ఎంజీబీఎస్ సహా అనేక కీలక ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ఈ డివిజన్‌కు ఈ నిర్ణయం ఉపయుక్తంగా మారింది. ఇటీవల కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన కానిస్టేబుళ్ళల్లో యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడ వీరి సేవల్ని రిసెప్షన్ కోసం వాడుతున్నారు. ఇదే విధానాన్ని మరింత విస్తరిస్తూ మూడు కమిషనరేట్లలోని అన్ని ఠాణాల్లోనూ వినియోగించాలని బాధితులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో కూడిన, మారుమూల ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో కాకపోయినా మిగిలిన చోట్ల 24 గంటల రిసెప్షన్లు నిర్వహిస్తే బాధితులకు ఊరట లభిస్తుంది. ఇకనైనా దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
‘కోట్పా’కు మరింత పదును
ధూమపానంపై ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ గత ఏడాది రూ.1.67 కోట్ల అపరాధ రుసుం వసూలు ఈ ఏడాది మే 31 నాటికి 64,311 కేసులు నమోదు బెంగళూరు : ధూమపానంతో పాటు పొగాకు వినియోగ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ధూమపానం చేయడం కాని, పొగాకు సంబంధ ప్రకటనలు ఇవ్వడం, 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి గుట్కా, సిగరెట్ వంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం తదితర కోట్పా (సిగరెట్ అండ్ అదర్ టుబాకో ప్రాడెక్ట్ యాక్ట్ -2003 - సీఓటీపీఏ) చట్టానికి విరుద్దంగా వ్యవరించేవారిపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఠీఠీఠీ.ఛిౌ్టఞ్చ.జ్చుట జీఛి.జీ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో అందిన ఫిర్యాదుకు చట్టబద్ధత ఉంటుంది. ఈ ఫిర్యాదును రాష్ట్ర హోంశాఖ ద్వారా స్థానిక పోలీసులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారు లకు తెలుస్తుంది. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులను విక్రయించేవారిపై, వినియోగించేవారిపై చర్యలు చేపడతారు. కాగా, కోట్పా చట్టాన్ని అనుసరించి 2014లో కర్ణాటక మొత్తం మీద 1,27,163 కేసులు నమోదు కాగా రూ.1.67 కోట్ల మేర అపరాధ రుసుం వసూలైంది. ఈ ఏడాది మే 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 64,311 కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా రూ. 98 లక్షలను జరిమానా రూపంలో అధికారులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఇదిలా ఉండగా కోట్పా చట్టం దుర్వినియోగంలో రాష్ట్రంలో మైసూరు నగరం మొదటి స్థానంలో ఉండగా అటు పై వరుసగా బెంగళూరు, హుబ్లీ-దార్వాడ, మంగళూరు నగరాలు ఉన్నాయి. -
ఏ ఫిర్యాదులు తీసుకోకండి...
సిబ్బందికి లోకాయుక్త మౌఖిక ఆదేశాలు ! లోకాయుక్త రాజీనామాపై శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు లోకాయుక్తలో ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. స్వయంగా లోకాయుక్త పైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించరాదని ఆయన లోకాయుక్త సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లోకాయుక్త వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావుపై కోట్ల రూపాయల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పాటు ఇందుకు భాస్కర్‌రావు సైతం మద్దతుగా నిలిచారనే ఆరోపణల మధ్య లోకాయుక్త రాజీనామా చేయాలంటూ ప్రజాసంఘాలు, న్యాయవాదులు లోకాయుక్త కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఎదుట సైతం నిరసనకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల అవినీతికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించవద్దని, ఎలాంటి విచారణను చేపట్టవద్దని లోకాయుక్త భాస్కర్‌రావు, లోకాయుక్త ఏడీజీపీ ప్రేమ్‌శంకర్ మీనాను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదులు చేసేందుకు వస్తున్న సామాన్యులను లోకాయుక్త కార్యాలయం ఎదుట ఉన్న పోలీసులు బయటి నుంచే పంపించి వేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టే అవినీతి అధికారుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నగరానికి వచ్చిన సామాన్యులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోకుండానే వెనక్కు పంపేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తీవ్ర ఆవేదనతో లోకాయుక్త కార్యాలయం నుంచి వెనుదిరుగుతున్నారు. శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు.... ఇక లోకాయుక్త వై.భాస్కర్‌రావు తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం సైతం ఆందోళనలు కొనసాగాయి. లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు నగరంలో ర్యాలీని నిర్వహించారు. గాంధీనగర నుంచి ర్యాలీగా బయలుదేరిన కరవే కార్యకర్తలు లోకాయుక్త కార్యాలయానికి చేరుకొని, లోకాయుక్తను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బార్‌కౌన్సిల్ సభ్యులు సైతం లోకాయుక్త కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు తెలిపారు. ఇక లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలను సాకుగా చూపుతూ కొన్ని చిన్న చేపలను బలిపశువులు చేసి ఎన్నో పెద్ద తిమింగళాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తునానయని ‘న్యాయక్కాగి నావు’ సంస్థ విమర్శించింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ పదాధికారుల్లో ఒకరైన అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ....‘ఎంతో కాలంగా లోకాయుక్తలో అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావాలి’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది ఎ.కె.సుబ్బయ్య స్పందిస్తూ అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన లోకాయుక్త పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలు రుజువైతేనే రాజీనామా కోరాల్సి ఉంటుందంటూ భాస్కర్‌రావుకు మద్దతుగా నిలిచారు.