Reconstruction Works
-
4 లక్షల రోడ్డు ప్రమాదాలు
న్యూఢిల్లీ: దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు. ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు. -
పరమ నాసిరకంగా మోర్బీ మరమ్మతులు
అహ్మదాబాద్: మోర్బి వంతెన పునర్నిర్మాణ పనులపై గుజరాత్ పోలీసు శాఖ విచారణలో కళ్లు తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఎటువంటి అనుభవం లేని అజంతా– ఓరెవా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. అది కేవలం వంతెన కేబుళ్లకు రంగులు, పాలిష్ వేసి హడావుడిగా ప్రారంభించేసింది. నాసిరకమైన బరువైన మెటీరియల్ వాడకం ఒక దుర్ఘటనకు కారణమైంది. పనులు చేసిన సిబ్బందికి వేలాడే వంతెనకు సంబంధించిన ఎలాంటి పరిజ్ఞానమూ లేదని తేలింది. పనులపై ఆడిట్ జరగలేదు. నిపుణుల పర్యవేక్షణా లేదు. తుప్పుపట్టిన పాత కేబుళ్ల స్థానంలో కొత్తవి వేయకపోవడం, సామర్థ్యానికి మించి జనాన్ని అనుమతించడం ఘోరానికి దారితీసింది. -
ట్రెండ్‌కి తగ్గట్టుగా.. పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. - తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. - పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. - రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. - స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. - స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్ విషయానికి వస్తే..! -
‘ఇల్లు కూల్చితే మా చావును చూస్తారు..’
సాక్షి, చంపాపేట(హైదరాబాద్): పక్కింటి యజమాని ఫిర్యాదుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఇంటిని కూల్చివేసేందుకు సమాయత్తం అవుతుండగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని అనడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి చంపాపేట డివిజన్లో చోటు చేసుకుంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్ దుర్గానగర్‌కాలనీకి చెందిన తేలుకుంట్ల రాజు 35 సంవత్సరాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. తన ఇల్లు శిథిలావస్థకు చేరటంతో ఇటీవలే పాత ఇంటిని కూల్చి పునర్నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటి పక్కనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస్ ఇంటి పునర్నిర్మాణం చేసేందుకు అభ్యంతరం తెలిపి కోర్టు నుంచి స్టే ఆర్డరు కూడా తెచ్చారు. ఆవేమీ పట్టించుకోని రాజు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయటంతో గురువారం శ్రీనివాస్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా రాజు కుటుంబ సభ్యులు కూల్చివేత నిలిపేయాలంటూ కిరోసిన్ డబ్బాలు చేత పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాజుకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
ఇదేమిటి యాదగిరీశా..?
సాక్షి, యాదగిరికొకండ (ఆలేరు) : శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలువడానికి కారణభూతుడైన యాదరుషి విగ్రహానికి దిక్కులేకుండా పోతోంది. అదే విధంగా ద్వార పాలకుల విగ్రహాలు కనిపించకుండా పోయినా దేవస్థానం అధికారులకు పట్టింపులేకుండా పోతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదరుషి విగ్రహంతో పాటు రెండు ద్వారపాలకులు జయ, విజయ విగ్రహాలను హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఆరేళ్ల క్రితం తయారు చేయించి దేవస్థానానికి బహూకరించాడు. గతంలో విష్ణు పుష్కరిణికి సమీపాన ఒక షెడ్డు వేసి దానికింద ఈ యాదదరుషిని ప్రతిష్ట చేశారు. నూతన ప్రదానాలయం నిర్మాణం పనులు ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు ద్వార పాలకులైన జయ విజయుల విగ్రహాలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు పాత ఆలయానికి వెనుక వైపు ఉన్న రాజగోపురం ద్వారానికి ఉన్న తలుపులను కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తపాలయ్యాయి. విగ్రహాలు, ద్వార తలుపులు చెత్తల పాలు చేయడంపై ఆలయ అదికారులు కనీసం నోరు మెదపడం లేదు. యాదాద్రిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ కృషిచేస్తుంటే అధికారులు ఆలయ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
టీ భవన్లో పనులు పరిశీలించిన కేసీఆర్
► టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో పునర్నవీకరణ పనులు ► పలు సూచనలు చేస్తూ 40 నిమిషాలు గడిపిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో జరుగు తున్న పునర్నవీకరణ పనులను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. దాదాపు 40 నిమిషాల పాటు తెలంగాణ భవన్లో గడిపిన ఆయన పనులన్నింటినీ సమీక్షించి.. పలు మార్పులు, చేర్పులను సూచించారు. పార్టీ అధ్యక్షుడి కోసం ప్రత్యేకించిన గదిలో ఫ్లోరింగ్‌కు తెల్లటి గ్రానైట్ వాడారు, గోడలకు పూర్తిగా తెల్లరంగు వేశారు. దీంతో వాటికి సరిపోయేలా ఫర్నీచర్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. భవన్ ప్రధాన ద్వారం వెడల్పు పెంచాలని, భవన్ బయటే ప్రధాన గేటుకు కుడివైపున క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అది అందరికీ అందుబాటులో ఉంటుందని, భవన్ లోపల పార్టీ కార్యక్రమాలు నడు స్తున్నా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ప్రధాన సమావేశ మందిరంలో గోడలకు ఏర్పాటు చేసిన ఫ్రేముల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయనున్నామని పార్టీ నాయకులు వివరిం చగా.. హాల్లో కాకుండా ప్రహరీ గోడపైనే పథకాలకు సంబంధించి చిత్రాలు వేయిం చాలని కేసీఆర్ సూచించారు. ఇక నుంచి తెలంగాణ భవన్లో పార్టీ కార్యకర్తలకు నిత్యం శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, వివిధ అంశాలపై చర్చలు సాగుతాయని.. నాయకులంతా విధిగా భవన్‌కు రావాలని, తానూ తరచుగా వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంలో పరిశీలన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల కింద అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దగ్ధమైన రెండు అంతస్తులను పరిశీలించారు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో రెండోఅంతస్తు వరకు కేసీఆర్ మెట్లెక్కి వెళ్లారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు.