టీ భవన్‌లో పనులు పరిశీలించిన కేసీఆర్
► టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో పునర్నవీకరణ పనులు
► పలు సూచనలు చేస్తూ 40 నిమిషాలు గడిపిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరుగు తున్న పునర్నవీకరణ పనులను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. దాదాపు 40 నిమిషాల పాటు తెలంగాణ భవన్‌లో గడిపిన ఆయన పనులన్నింటినీ సమీక్షించి.. పలు మార్పులు, చేర్పులను సూచించారు. పార్టీ అధ్యక్షుడి కోసం ప్రత్యేకించిన గదిలో ఫ్లోరింగ్‌కు తెల్లటి గ్రానైట్ వాడారు, గోడలకు పూర్తిగా తెల్లరంగు వేశారు. దీంతో వాటికి సరిపోయేలా ఫర్నీచర్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు.
భవన్ ప్రధాన ద్వారం వెడల్పు పెంచాలని, భవన్ బయటే ప్రధాన గేటుకు కుడివైపున క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అది అందరికీ అందుబాటులో ఉంటుందని, భవన్ లోపల పార్టీ కార్యక్రమాలు నడు స్తున్నా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ప్రధాన సమావేశ మందిరంలో గోడలకు ఏర్పాటు చేసిన ఫ్రేముల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయనున్నామని పార్టీ నాయకులు వివరిం చగా.. హాల్లో కాకుండా ప్రహరీ గోడపైనే పథకాలకు సంబంధించి చిత్రాలు వేయిం చాలని కేసీఆర్ సూచించారు.
ఇక నుంచి తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు నిత్యం శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, వివిధ అంశాలపై చర్చలు సాగుతాయని.. నాయకులంతా విధిగా భవన్‌కు రావాలని, తానూ తరచుగా వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆంధ్రజ్యోతి కార్యాలయంలో పరిశీలన
జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల కింద అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దగ్ధమైన రెండు అంతస్తులను పరిశీలించారు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో రెండోఅంతస్తు వరకు కేసీఆర్ మెట్లెక్కి వెళ్లారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు.