డైరెక్టర్ శంకర్ రికార్డ్!
దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీబడ్జెట్తో రూపొందించిన తమిళ చిత్రం 'ఐ' తెలుగులో 'మనోహరుడు'గా వస్తోంది. దక్షిణాదిన అన్ని అంశాలలో ఈ సినిమా సంచలనం సృష్టించనుంది. దాదాపు 180 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించినట్లు సమాచారం. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా, విక్రమ్ హీరోగా, సూపర్ డైరెక్టర్ శంకర్ మూడేళ్లపాటు శ్రమించి దీనిని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. శంకర్ అంటే చెప్పేదేముంది. ఆయనే ఓ సంచలనం. ఆయన చిత్రాలు మరో సంచలనం ఈ విషయం అనేకసార్లు రుజువైంది.
తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, చైనీస్, తైవాన్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందర్భంగా 15 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాణ వ్యయంలోనే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అత్యధికంగా 20 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని రికార్డు సృష్టించినట్లు కోలీవుడ్ టాక్.ఇంత పారితోషికం దేశంలో ఏ దర్శకుడికి అందలేదు. ఆ రకంగా శంకర్ భారత సినిమా చరిత్రలో రికార్డు సృష్టించినట్లుగా భావిస్తున్నారు.
ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించిన ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ 15న చెన్నైలో అత్యంత ఆర్బాటంగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్మాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాదులో నిర్వహించే తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిర్మాణ వ్యయం - పారితోషికం.. వంటి విషయాలలో ఈ సినిమా ద్వారా శంకర్ రికార్డలు సృష్టించారు. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న 'ఐ' ఆ తరువాత ఎన్ని సంచలనాలు చేస్తోందో!.
- శిసూర్య