సీబీఐ అవసరమేముంది..?
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ అధికారులేమీ ప్రత్యేకం కాదని, దర్యాప్తు విషయంలో వారికీ, రాష్ట్ర పోలీసులకేమీ తేడా లేదని పేర్కొంది. కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారన్నది ముఖ్యం కాదని, ఎంత నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు చేస్తున్నారన్నదే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయగలరని చెప్పింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేస్ డైరీని పరిశీలించిన తరువాతే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామంది.
కేస్ డైరీని తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం ఏఏజీ శ్రీనివాస్ కోర్టుకు తెలియజేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు గాను కేస్ డైరీని తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీబీఐ దర్యాప్తు గురించి ప్రస్తావించగా పై వ్యాఖ్యలు చేసింది.