refilling
-
ఆక్సీజన్ ప్లాంట్‌లో రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం, ఒకరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ పారిశ్రామిక ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ ప్లాంట్‌లో ప్రమాదం జరడంతో.. ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆక్సీజన్ సిలిండర్లలో రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కాన్పూర్‌లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వివరాలు ప్రకారం.. దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని పంకి ఆక్సిజన్ ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం ఎప్పటిలానే ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న ఇమ్రాద్ అలీ మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు లాలా లాజ్‌పత్ రాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ( చదవండి: ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి ) -
రూపాయికే ఆక్సిజన్ సిలిండర్.. ఎక్కడంటే
లక్నో: కోవిడ్ మహమ్మారి దేశాన్ని కకావికలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దాంతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ప్రాణవాయువు నిల్వలు అయిపోవడంతో ఢిల్లీలోని ఓ వ్రైవేట్ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 25 మంది కోవిడ్ రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌కు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. దాంతో అక్రమార్కులు బ్లాక్‌లో ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంత ధర చెల్లించలేని వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్‌ని రిఫిల్ చేస్తున్నాడు. ఆ వివరాలు.. యూపీకి చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా.. హమీర్పూర్ జిల్లాలోని సుమెర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రిమ్జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్ బాధితుల కోసం కేవలం రూపాయికే ఆక్సిజన్ సిలిండర్లు రిఫిల్ చేసి ఇస్తున్నాడు. ఇప్పటివరకు గుప్తా సుమారు వెయ్యికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేశారు. వందకు పైగా కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడాడు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. ‘‘2020లో నేను కోవిడ్ బారిన పడ్డాను. అప్పుడు నేను కూడా ఆక్సిజన్ సమస్య ఎదుర్కొన్నాను. నా బాటిల్ ప్లాంట్‌కు రోజుకు వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేసే సామర్థ్యం ఉంది. దాంతో ఆక్సిజన్ కావాల్సిన సామాన్యుల కోసం ఇలా ఒక్క రూపాయికే సిలిండర్ రిఫిల్ చేసి ఇస్తున్నాను. ఇందుకుగాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల కుటుంబికులు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపిస్తే.. వారికి ఒక్క రూపాయికే సిలిండర్ అందిస్తున్నాను’’ అని తెలిపాడు. ఈ సమాచారం తెలియగానే ఝాన్సీ, బందా, లలిత్పూర్, కాన్పూర్, ఓరాయ్ తదితర జిల్లాల నుంచి కూడా కరోనా బాధితుల కుటుంబికులు గుప్తా ప్లాంట్ వద్ద క్యూ కడుతున్నారు. ఇక మనోజ్ గుప్తాపై నెటిజనుల ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: కోవిడ్ బాధితులకు ఆహారం ఫ్రీ.. ఎక్కడంటే.. -
మిస్డ్ కాల్‌తో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్
న్యూఢిల్లీ: కేవలం ఫోన్ మిస్డ్ కాల్తోనే ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సదుపాయం ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కాల్ ఛార్జీలు పడకుండానే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి, వృద్ధులకు, ఐవీఆర్ఎస్ తెలియని వారికి ఇది సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. (చదవండి: కొనగలుగుతున్నారా... తినగలుగుతున్నారా?) -
గ్యాస్ డెలి‘వర్రీ’
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మళ్లీ వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ బుక్ చేసి పది రోజులు దాటినా రీఫిల్ ఇంటికి చేరడం లేదు. ప్రధాన చమురు సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) డిస్ట్రిబ్యూటర్ల వద్ద సుమారు రెండున్నర లక్షలకు పైగా కాల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మొబైల్ ద్వారా ఆన్లైన్లో రెండు పర్యాయాలు సిలిండర్ బుక్ చేస్తే తప్ప.. రీఫిల్ ఇంటికి చేరే పరిస్థితి లేదు. గ్యాస్ డిస్టిబ్యూటర్ల చేతివాటమో.. లేక డెలివరీ బాయ్స్ జమ్మిక్కులో తెలియదు కానీ ‘డోర్‌లాక్’ లేకున్నా వంట గ్యాస్ సిలిండర్ మాత్రం సకాలంలో ఇంటికి రాని పరిస్థితి. కొన్ని సార్లు బుకింగ్ రద్దయింది మళ్లీ బుక్ చేయమని సంక్షిప్త సందేశం వస్తుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. డిస్టిబ్యూటర్‌కు ఫోన్ చేసి నిలదీస్తేగానీ సిలిండర్ ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి గ్యాస్ సరఫరా కొరత లేనప్పటికీ పంపిణీదారులే కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగదు బదిలీ పథకం కింద వినియోగదారులకు ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండర్లు సబ్సిడీపై సరఫరా చేయాలి. ఆపై తీసుకుంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండడంతో నెల రోజుల నుంచి కాల్స్ పెండింగ్‌లో పడిపోవడం, బిల్లు జనరేట్ తర్వాత బుకింగ్ అటోమెటిక్‌గా రద్దు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు ఫుల్ ప్రస్తుతం ఇంటి గ్యాస్ కొరత ఉన్నా.. వాణిజ్య అవసరాలకు మాత్రం సరఫరా భేషుగ్గా ఉంది. అడిగిందే తడవుగా రీఫిల్స్ హోటళ్లకు చేరుతున్నాయి. దీన్నిబట్టి గృహావసరాల సిలిండర్లు దారి మళ్లుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి వసరాలకు ఉపయోగపడాల్సిన గ్యాస్.. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. నగరంలో పెద్ద హోటల్స్ 5 వేలకు పైగా ఉండగా, చిన్న చితకా హోటళ్లు టీ, టీఫిన్ సెంటర్లు సుమారు లక్షల వరకు ఉంటాయని అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, చిన్నవాటిలో మాత్రం డొమెస్టిక్ సిలిండర్లే వినియోగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు లక్షకు పైగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిన్న సిలిండర్లలో సైతం డొమెస్టిక్ ఎల్పీజీ అక్రమంగా రీఫిల్లింగ్ అవుతోంది. గ్యాస్ కొరత లేదు ప్రస్తుతం గ్రేటర్లో వంట గ్యాస్ కొరత లేదు. బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లో సిలిండర్లను డెలివరీ చేస్తున్నాం. డోర్‌లాక్, ఇతర సాంకేతిక కారణాలతో కొన్నిసార్లు బుకింగ్ రద్దవుతోంది. డిస్టిబ్యూటర్ దృష్టికి తీసుకొచ్చి తిరిగి బుక్ చేస్తే వెంటనే సిలిండర్ డెలివరీ చేస్తున్నాం.– అశోక్ కుమార్, అధ్యక్షుడు,వంట గ్యాస్ డీలర్ల సంఘం -
వాహనాల్లో వంట గ్యాస్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వాహనాల సిలిండర్లలో వంట గ్యాస్ నిండుతోంది. గ్రేటర్ పరిధిలో అక్రమ రీఫిల్లింగ్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జనావాసాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లలో గ్యాస్‌కు కొరత లేనప్పటికీ వాహనదారులు మాత్రం డొమెస్టిక్ గ్యాస్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. అధికారిక స్టేషన్లలో నింపే ఎల్పీజీ కంటే డొమెస్టిక్ గ్యాస్ మందంగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా వస్తుండటం, ధర కూడా తక్కువ ఉండటం ఇందుకు కారణం. దీంతో నగరంలో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. నిత్యం ఆయా కేంద్రాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇందులో ఆటోలు అధికంగా ఉండటం విశేషం. ధరలు మంటే కారణం.. పెట్రోల్, డీజిల్ ధరలు మండుతుండటంతో చౌక గ్యాస్ వినియోగంపై వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు చక్రాల వాహనదారులు కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకుల మార్చుకుంటుండగా మరి కొందరు అనధికారికంగా మార్పిడి చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్జీల కంటే చౌకగా లభిస్తుండటంతో డొమెస్టిక్ గ్యాస్‌పై మక్కువ చూపుతున్నారు. రెండు లక్షలకు పైనే.. మహా నగరంలో వాహనాల సంఖ్య 52 లక్షలకు పైగా ఉండగా అందులో సుమారు రెండు లక్షల వాహనాలు గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేకపోయినా సీఎన్జీ గ్యాస్ సరఫరా సక్రమంగా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతి రోజు 5000 ఆటోలు, 1000 వరకు నాలుగు చక్రాల వాహనాలు వస్తాయి. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్ధ్యం 4.5 కిలోలు కాగా, 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం 10కిలోలు కాగా, 8 కిలోల వరకు గ్యాస్‌ను నింపుతారు. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్‌కు రోజూ 6వేల కిలోవరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. వాహనాల గ్యాస్ ధర నిలకడగా ఉన్నప్పటికీ డొమెస్టిక్ గ్యాస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. -
నగదు ‘బదిలీ'..భారమే!
నగదు బదిలీ పథకం.. ఆ పేరు వింటేనే జిల్లాలో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లూ సబ్సిడీ ధర చెల్లించి వంటగ్యాస్ రీఫిల్లింగ్ పొందిన వారు ఈ ప్రక్రియ అమలైతే అదనపుభారం మోయకతప్పదు. నగదు జమతో ప్రతి వినియోగదారుడిపై వ్యాట్ రూపేణా అదనంగా రూ.23 పడనుంది. ఇదిలాఉండగా, జిల్లాలో గతేడాది నగదు బదిలీ అమలైన సందర్భంలో బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమకాకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గుర్తుచేసుకుని మరింత ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నగదు బదిలీ పథకం వినియోగదారులకు భారంగా మారనుంది. ఈ పథకం అమలైతే గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్‌కు సబ్సిడీయేతర ధర రూ.972 చెల్లించి వినియోగదారుడు తీసుకోవాలి. అనంతరం సబ్సిడీ రూ.444 పోనూ వారి బ్యాంకుఖాతాలో ప్రభుత్వం రూ.504నగదు జమచేస్తుంది. ఇంకా వ్యాట్‌రూపంలో ప్రభుత్వం విధించే రూ.23ను వినియోగదారుడే చెల్లించాలి. అంటే సబ్సిడీ కంటే అదనంగా ఈ భారం పడనుంది. ఈ ధర స్థిరంగా కొనసాగుతుందని అనుకోవడానికీ వీల్లేదు. అంతర్జాతీయ మార్కెట్ డాలర్‌ను అనుసరించి ఓ మారు పెరుగుతూ.. మరోమారు తగ్గుతూ ఉం టుంది. దీనిని బట్టి వ్యాట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముందు నగదు చెల్లించి తీసుకునే రీఫిల్లింగ్ ధర కూడా పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. 4.38లక్షల మందిపై భారం జిల్లా వ్యాప్తంగా ఇండియన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 4.38లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నగదు బదిలీ అమలైతే జిల్లా వాసులపై ప్రతినెలా రూ.10.95లక్షల భారం పడనుంది. వీరిలో 90శాతం మంది వినియోగదారులు సామాన్యులే. పైగా వీరిలో బ్యాంక్ ఖాతాల్లేని వారు ఎంతోమంది ఉన్నారు. గతేడాది జిల్లాలో నగదు బదిలీ అమలైన సందర్భంలో చాలామందికి బ్యాంక్‌ఖాతాలో సబ్సిడీ జమకాక నానాపాట్లు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఇబ్బందులను మరువకముందే నగదు బదిలీ ప్రక్రియ వారిలో ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి అమలు నగదు బదిలీ జిల్లాలో జనవరి నుంచి అమలుకానుంది. మొ దటి విడతగా తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాల్లో అమలుచేసే ప్రభుత్వం రెండోవిడతగా జనవరిలో జిల్లాలో అమలుచేయనుంది. ఇందుకుగాను గ్యాస్ వినియోగదారులకు సం బంధించి ఆధార్, బ్యాంక్ ఖాతాల నెంబర్లను సేకరించే పని లో అధికారులు, గ్యాస్ డీలర్లు బిజీగా నిమగ్నమయ్యారు.